చంద్రబాబు స్వజనప్రీతిపై జగన్ స్ట్రాంగ్ సెటైర్!

అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అనేది దుర్మార్గులైన రాజకీయ నాయకులు అనుసరించే నీతి. ఈ విషయంలో ఇంకాస్త ముదిరిపోయిన రాజకీయనాయకులైతే.. అయిన వారికి అడ్డగోలుగా దోచిపెట్టేయడమూ.. కానివారు ఎలా సర్వనాశనం పోయినా…

అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అనేది దుర్మార్గులైన రాజకీయ నాయకులు అనుసరించే నీతి. ఈ విషయంలో ఇంకాస్త ముదిరిపోయిన రాజకీయనాయకులైతే.. అయిన వారికి అడ్డగోలుగా దోచిపెట్టేయడమూ.. కానివారు ఎలా సర్వనాశనం పోయినా కిమ్మనకుండా ఉండడమూ కూడా రాజకీయాల్లో మనం చూస్తూనే ఉంటాం. అలాంటి స్వజనప్రీతి, కులగజ్జి రాజకీయాలు చేయడంలో.. చంద్రబాబునాయుడు ఆరితేరినవారు అనే సంగతి అందరికీ తెలుసు. ఆయన తీరుతెన్నులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసనసభ సాక్షిగా తీవ్రంగా ఎండగట్టారు. పంచ్ డైలాగులతో సెటైర్లు వేశారు. 

‘‘పచ్చళ్ళు మా వాళ్ళే అమ్మాలి… పాలు,పెరుగూ మా వాళ్ళే అమ్మాలి… పేపర్లు మా వాళ్ళే అమ్మాలి… టీవి చానెల్స్ మా వాళ్ళవే ఉండాలి… చిట్ ఫండ్స్ మా వాళ్లవే ఉండాలి… రాష్ట్రాన్ని మా వాళ్ళే పాలించాలి… రాజధాని మా ఏరియాలోనే ఉండాలి… అందులో భూములన్నీ మేమే కొనాలి… ముఖ్యమంత్రి మావాడే ఉండాలి.. మొత్తం మేమే బాగుపడాలి…కానీ అందరూ మాకు ఓట్లు వెయ్యాలి..’’ అంటూ జగన్మోహన్ రెడ్డి అన్న డైలాగులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

‘సర్వత్ర సమబుద్ధయః’ అని భగవద్గీతలో ఒక అద్భుతమైన వాక్యం ఉంటుంది. అందరి పట్ల కూడా సమానమైన బుద్ధి కలిగి ఉండాలి.. అని మంచి మనుషులకు ఉండాల్సిన లక్షణం గురించి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. మనుషులందరికీ ఆ లక్షణం ఉంటుందని అనుకోలేం. ఎందుకంటే ప్రేమాభిమానాలు, రాగ ద్వేషాలు అసూయలు ఇలాంటివి మన ఆలోచనల్ని పక్కదారి పట్టిస్తుంటాయి. కానీ నాయకుడు కాగోరే వాడు, అధికారంలోకి వచ్చి పరిపాలన సాగించాలని అనుకునే వాడు మాత్రం ఈ లక్షణాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. నాయకుడు అంటే ప్రజల మనిషి. ఆ సంగతిని నాయకులు, నాయకులు కాగోరే వారు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. 

నాయకుడు కుల మతాలకు వర్గాలకు ప్రాంతీయ అభిమానాలకు అతీతంగా వ్యవహరించాలి. అధికారంలో ఉన్నప్పుడు.. ప్రతిభలు, నైపుణ్యాల ఆధారంగా వ్యక్తులకు ప్రాధాన్యాలు కల్పించే క్రమంలో ఒక కులానికో, వర్గానికో  ఎక్కువ చోటు దక్కడం ఒక ఎత్తు. అదే సమయంలో.. ప్రతిభలతో నిమిత్తం లేకుండా లాభం ఉండగల ప్రతి పనిలోనూ నా కులం వాళ్లను మాత్రమే ప్రోత్సహించాలి. మిగిలిన వాళ్లు నాశనం అయిపోవాలి. 

నా కులం వాళ్లను మాత్రమే నెత్తిన పెట్టుకుని ఊరేగుతూ ఉంటే.. రేపు నా కులం అంతా కలిసి నా పల్లకీ మోస్తుంటుంది.. నేను మహానుభావుడినని భజన చేస్తూ యావత్తు లోకాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటుంది… అనే కుత్సితమైన కుట్రపూరిత ఆలోచనతో వ్యవహరించడం మరో ఎత్తు. చంద్రబాబు ఈ రెండో రకం మనిషి. తనకులం వారిని మించిన ప్రతిభావంతులు తనకు కనిపించకపోతే.. వారికి తన ఏలుబడిలో పదవులు పంచిపెట్టినా కూడా పర్లేదు. కానీ.. ఆయన తీరు అది కూడా కాదు. తన కులం వారికి లాభాలను పంచి పెట్టాలన్నదే.

వాళ్ల వ్యాపారాలను సమృద్ధిగా మార్చాలన్నదే. వాళ్ల ఆర్థిక ప్రయోజనాలను అనుచిత మార్గాల్లోనైనా ఇబ్బడిముబ్బడిగా మార్చేయాలన్నదే. తద్వారా.. వాళ్లను తనకు భవిష్యత్ ఆర్థిక వనరులుగా కూడా మార్చుకోవాలన్నదే. అందుకే నిత్యం తన కులం గురించిన, వారి లాభాలు, వారి ఆర్థిక ప్రయోజనాల గురించి కుట్రపూరిత ఆలోచనలతో చంద్రబాబు రగిలిపోతుంటారు. దానికి తగ్గట్టుగానే ఆయనను ప్రజలు ఛీకొట్టారు. ఛీకొట్టిన తర్వాత.. అదే కులం ఆయనను భుజాన మోస్తోంది. ఆయనకోసం కన్నీళ్లు కారుస్తోంది. వారి ఏడుపులు ఆయన కోసం కాదు.. ఆయన మాజీ అయిపోవడం వల్ల తగ్గిపోయిన తమ లాభాలు, ఆర్థిక ప్రయోజనాల గురించి. 

పచ్చళ్లు మావాళ్లే అమ్మాలి, చిట్ ఫండ్స్ మావాళ్లే నడపాలి.. అనడం ద్వారా రామోజీరావు వ్యాపారాలకు చంద్రబాబు దన్నుగా ఉండడం గురించే జగన్ సెటైర్ వేశారన్నది స్పష్టం. పాలు పెరుగూ ప్రస్తావనకూడా చిన్నది కాదు. రాష్ట్రంలో పాడి రైతులకు మరింత ఎక్కువ ధర ఇచ్చి మేలుచేసేలా.. ఆమూల్ డెయిరీ వస్తే.. దాన్ని అడ్డుకోడానికి విఫలయత్నం చేసిన సంగం డెయిరీ ఎవరిదో అందరికీ తెలుసు. తన సొంత హెరిటేజ్ డెయిరీ కోసం.. సుదీర్ఘమైన చరిత్ర ఉన్న చిత్తూరు సహకార డెయిరీని అంతం చేసేసిన చరిత్ర చంద్రబాబుది. పేపరు, టీవీచానెళ్లలో తమ కులం వారే చెలరేగిపోవాలనే, పైకి వచ్చి మిగిలిన మీడియా సంస్థలను తొక్కేసి వర్ధిల్లాలని.. తద్వారా తన కులానికి మోనోపలీ ఉండాలని ఆరాటపడిన వ్యక్తి చంద్రబాబు. అయితే ఆ పప్పులు ఉడకలేదు. ఆయన అడ్డదారుల్లో ఎంకరేజ్ చేసిన మీడియా ఇప్పుడు ఆయన భజనకే పరిమితం అవుతోంది. 

ఈ సకలమైన కులం కుళ్లును కడిగేస్తూ జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగు సెటైర్ వేశారు. ఎండగట్టారు. అమరావతి ముసుగులో జరిగే కుల దోపిడీ ప్రజలకు తెలిసినదే అయినా.. మరోమారు పునరుద్ఘాటించారు. జనం అందరి ఓట్లు కొల్లగొట్టి ఒక కులానికి మాత్రమే దోచిపెట్టాలనే దుర్మార్గపు బుద్ధులను నిరసించారు. ఒక కులం కోసం రాష్ట్రం మొత్తాన్ని సామూహికంగా వంచించడానికి చంద్రబాబు చేసే ప్రయత్నాలను బయటపెట్టారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉంటారు. అర్థం చేసుకుంటూనే ఉంటారు.