ఎన్నికల ముంగిట వైసీపీ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జగన్ కోసం సిద్ధమంటూ వైసీపీ బూత్ కమిటీ సభ్యులు ఇవాళ్టి నుంచి గడపగడపకూ వెళ్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వివరాలు వెల్లడించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇంత వరకూ సిద్ధం, మేమంతా సిద్ధం పేర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వినూత్న కార్యక్రమాలు నిర్వహించారన్నారు.
తాజాగా జగన్ కోసం సిద్ధమంటూ తమ పార్టీ బూత్ కమిటీ సభ్యులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల క్యాలెండర్లను అందజేస్తారన్నారు. ఇంత వరకూ చిత్తశుద్ధితో తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తారన్నారు. మరోసారి జగన్‌ను ఆశీర్వదించాలని కోరుతారన్నారు. ఈ దఫా జగన్‌ను సీఎం చేసేందుకు ప్రజల వద్దకు తమ పార్టీ బూత్ కమిటీ సభ్యులు వెళ్తారన్నారు.
ఇప్పటికే వైసీపీ క్షేత్రస్థాయిలో దూసుకుపోతోంది. ప్రత్యర్థులు కూడా ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ప్రతి చోట నువ్వానేనా అన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ కోసం సిద్ధమంటూ బూత్ కమిటీ సభ్యులు వెళ్లాలనుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ, ప్రజల ఆశీస్సులు కోరనుండడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. కార్యక్రమం పేరు ఏదైనా అంతిమంగా వైసీపీకి అండగా నిలవాలని అభ్యర్థించడం ఏకైక లక్ష్యం.