ఏపీ మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. తెలుగుదేశం పార్టీ నేతలు, ఆ పార్టీ అనుకూల వాదులు ఈ పిటిషన్లను దాఖలు చేశారు. వీటిపై కేంద్ర ప్రభుత్వ వాదనను కోరింది హై కోర్టు. రాజధాని అంశంలో తమ జోక్యం ఉండదని, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని కేంద్రం స్పష్టత ఇచ్చింది.
రాజధానిని పెడతారా, రాజధానులను పెడతారా.. అనేది కూడా రాష్ట్ర పరిధిలోని అంశమే తప్ప అందులో తమ ప్రమేయం ఉండదని కేంద్రం పలు సార్లు స్పష్టత ఇచ్చింది.
ఆ సంగతలా ఉంటే.. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తుంగలోకి తొక్కిందని, కేవలం రెండు జిల్లాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మిగతా ప్రాంతాలకు అన్యాయం చేసేలా అమరావతిని రాజధానిగా ప్రకటించిందని హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయ్యింది. ఒక న్యాయవాది ఈ పిటిషన్ ను దాఖలు చేస్తూ.. గత ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ, తన వాదనలు వినాలని హైకోర్టును కోరారు.
రాజధాని ప్రభుత్వ భూముల్లో ఉండాలని నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారని, శిరామకృష్ణన్ కమిటీ కూడా ప్రభుత్వ భూముల్లో రాజధానిని ప్రతాపాదించిందని, అమరావతిని రాజధానిగా ఎవరూ సిఫార్సు చేయలేదని, గత ప్రభుత్వం ఏకపక్షంగా అమరావతిని రాజధానిగా ప్రకటించిందని ఆ న్యాయవాది అంటున్నారు.
పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం, రాయలసీమ ప్రజల కోరిక ప్రకారం కూడా నాటి ప్రభుత్వం వ్యవహరించలేదని.. హైకోర్టును రాయలసీమలో ఏర్పరచాలన్న విన్నపాన్ని కూడా పట్టించుకోలేదని గుర్తు చేశారు. హడావుడిగా, ఏకపక్షంగా అమరావతిని రాజధానిగా ప్రకటించారని.. ఆ నిర్ణయాన్ని తప్పు పడుతూ ఆ న్యాయవాది హై కోర్టును ఆశ్రయించారు.
వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లకు కౌంటర్ గా తన వాదనలనూ వినాలని ఆ న్యాయవాది ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. మరి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో!