ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ప్రముఖ సీనియర్ హీరో సుమన్ మద్దతుగా నిలిచారు. ఆలయాలపై వరుస దాడుల నేపథ్యంలో వైఎస్ జగన్కు ఆయన అండగా నిలిచారు.
తిరుమలలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుమార్తె వివాహం ఆదివారం జరిగింది. ఈ వివాహానికి హాజరైన సుమన్ మాట్లాడుతూ ప్రతి ఆలయం వద్ద సీసీ కెమెరాలు, భద్రత ఏర్పాట్లు చేయాలని కోరారు.
దేవుడి విషయంలో రాజకీయాలు తగదన్నారు. దేవుడికి సంబంధించి తప్పు ఎవరు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు. ఆలయాలు, దేవతా విగ్రహాలపై దాడులు చేయడం హేయమైన చర్యతో పాటు అత్యంత బాధాకరమన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెడ్డపేరు తేవడానికి ఆలయాలపై కొన్ని దుష్టశక్తులు ఉద్దేశపూర్వకంగానే దాడులు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. రోడ్డుపై ధర్నాలు దిగడం కంటే ఆలయాల వద్ద నిఘా పెంచాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆలయాలపై దాడులను అరికట్టాలని ప్రతి ఒక్కరికీ ఆయన పిలుపునిచ్చారు. కాగా 2020 ఏడాది చాలా గుణపాఠాలు నేర్పిందని సుమన్ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ కాలంలో పోలీసులు, వైద్య సిబ్బంది సేవలకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.