విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి,సీనియర్ తెలుగుదేశం నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకువచ్చేది ఫైర్ బ్రాండ్ అన్న మాటే. ఆయన మాట్లాడుతూనే మంటలు పుట్టిస్తారు. ప్రత్యర్ధి పార్టీల పైన దూషణలకు దిగారంటే అది అలా ఇలా ఉండదు. ఓ విధంగా అయ్యన్న పక్కా మాస్ లీడర్ అని చెప్పాలి.
అటువంటి అయ్యన్నలో మరో కోణాన్ని విశాఖ జనం చూశారు. ఆయన రెండవ కుమారుడి వివాహం సందర్భంగా జరిగిన పార్టీలో అయ్యన్న ఏకంగా అలనాటి క్లాసిక్ సాంగ్ కి డ్యాన్సులు వేస్తూ అందరికీ షాక్ తినిపించారు. దేవత సినిమాలోని వెల్లువచ్చే గోదారమ్మ పాటకు అయ్యన్న తన పక్కన ఉన్న యాంకర్ తో కలసి వేసిన స్టెప్పులు చూసిన వారు అయ్యన్నలో కూసింత కళా పోషణ కూడా ఉందే అనుకున్నారు.
నిజమే అదేదో సినిమాలో చెప్పినట్లుగా ఎపుడూ తిని తొంగుంటే మనిషికీ, గొడ్డుకూ తేడా ఏముంది. అయ్యన్న కూడా కళాపోషణలో తనకు సాటి ఎవరూలేరని పించుకున్నారు. ఓ వైపు చంద్రబాబు గో బ్యాక్ అంటూ విశాఖలో పెద్ద రచ్చ జరిగిన వేళ అయ్యన్న కొడుకు పెళ్ళి జరిగింది. తమ్ముళ్ళంతా హీట్ మీదుంటే ఎపుడూ నిప్పులు చెరిగే అయ్యన్న మాత్రం ఇలా కూల్ గా డ్యాన్సులతో టైం పాస్ చేయడం ఆసక్తికరమైన అంశమే.
ఏది ఏమైనా అధికారం పోయిందన్న బాధతో గత తొమ్మిది నెలలుగా అటు ఓటెసిన జనం మీద ఇటు పీఠమెక్కిన వైసీపీ మీద అయిన దానికి కానిదానికీ విరుచుకుపడుతున్న పచ్చ పార్టీ నేతలు మిగిలిన నాలుగేళ్ళ కాలాన్ని మంచిగా టైం పాస్ చేస్తే బాగుంటుదేమో. ఓడిపోయిన వెంటనే కుర్చీ ఎక్కాలన్న కసితో చేసే కక్కుర్తి రాజకీయాలను జనం మెచ్చరని వారు ఇకనైనా గ్రహిస్తే మంచిదేమో.
వీలైతే పెళ్ళీ పేరంటాలు, విందులూ, వినోదాలతో తమ్ముళ్ళు సాధ్యమైనత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే కొత్త ఎనర్జీ కూడా వస్తుంది. అంతే తప్ప తెల్లారుతూనే మీడియా ముందుకొచ్చి బీపీ పెంచుకుంటే పోయేది బంగారం లాంటి ఆరోగ్యమే. ఏమైనా అయ్యన్న తమ్ముళ్ళకు కొత్త బాట చూపించాలనుకోవాలి.