ఉసిగొల్పడంలో బాబు తర్వాతే ఎవరైనా..?

వ్యవస్థలను వాడుకుని రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్న చంద్రబాబుకి.. ఆ వ్యవస్థలు ఇప్పుడు అనుకున్నంతగా ఉపయోగపడటం లేదు. దీంతో కొత్త ఎత్తుగడ వేశారు. ప్రజల్ని రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఓటీఎస్ అంటూ జనాల్ని రెచ్చగొట్టారు,…

వ్యవస్థలను వాడుకుని రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్న చంద్రబాబుకి.. ఆ వ్యవస్థలు ఇప్పుడు అనుకున్నంతగా ఉపయోగపడటం లేదు. దీంతో కొత్త ఎత్తుగడ వేశారు. ప్రజల్ని రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఓటీఎస్ అంటూ జనాల్ని రెచ్చగొట్టారు, వరద సాయంలో బురద రాజకీయం చేశారు, వైసీపీ కార్యకర్తలకే పరిహారం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. 

తాజాగా ఉద్యోగ సంఘాల్ని రెచ్చగొట్టి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే స్థాయికి వారితో వ్యాఖ్యలు చేయిస్తున్నారు. అన్నిటికంటే ముందు అమరావతి రైతుల్ని రెచ్చగొట్టి ప్రాంతీయ దురభిమానాన్ని ఉసిగొల్పారు. మొన్నటికి మొన్న వెక్కి వెక్కి ఏడ్చి నందమూరి ఫ్యామిలీని ఉసిగొల్పారు.

పక్కనోడి భుజంపై తుపాకీ..

చంద్రబాబు ఎవరినైనా టార్గెట్ చేయాలనుకుంటే.. తన చేతిలో తుపాకీ ఉన్నా అది పక్కనోడి భుజంపై పెట్టి ప్రత్యర్థికి ఎక్కుపెడతారు. తాజాగా జగన్ ని టార్గెట్ చేయడానికి ఆయన ఉద్యోగ సంఘాలను ఉసిగొల్పుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల పీఆర్సీ ఆలస్యమైంది. సీపీఎస్ రద్దు కూడా వెనక్కిపోయింది. అయితే ఉద్యోగులు మాత్రం తమ డిమాండ్లు నెరవేర్చుకునే వరకు వెనక్కి తగ్గం అంటూ మొండి పట్టు పట్టారు.

కొన్నిరోజులుగా ఈ ఉద్యమం శాంతియుతంగానే సాగుతోంది. ప్రభుత్వం కూడా పలు దఫాలు చర్చలకు పిలిచింది. ఎప్పుడైతే చంద్రబాబు బ్యాచ్ ఎంటరైందో.. అప్పుడే ఉద్యోగ సంఘాలు పట్టుతప్పాయి. ఉద్యోగులంటే 6 లక్షలమంది కాదు, 60లక్షల ఓట్లు అంటూ.. ప్రభుత్వాన్నే బెదిరించారంటే ఏ స్థాయిలో వారిని రెచ్చగొట్టారో, ప్రభుత్వంపైకి ఉసిగొల్పారో అర్థం చేసుకోవచ్చు. 

పోనీ 60లక్షల ఓట్లే అనుకుందాం.. అది కూడా రెండున్నరేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఉద్యోగులు తమ ప్రతాపం చూపించాల్సి ఉంటుంది. అంటే అప్పటి వరకూ పీఆర్సీని ప్రభుత్వం అమలు చేయకపోయినా పర్వాలేదా..?

ప్రభుత్వాలను నిలబెట్టాలన్నా మేమే, పడగొట్టాలన్నా మేమేనంటున్న ఉద్యోగ సంఘాల నాయకులు.. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవగలరా..? కేవలం ప్రభుత్వానికి ఉద్యోగుల అభిమానం ఉంటే సరిపోతుందా, ప్రజాభిమానం అవసరంలేదా..? ఈ మొండిపట్టుదలతో, చంద్రబాబు ఉచ్చులో పడి ఉద్యోగ సంఘాలు ఏం సాధిస్తాయో వేచి చూడాలి.

ఓటీఎస్ పై ఎందుకంత కక్ష..

ఓటీఎస్ విధానంతో పాత బకాయిలన్నీ రద్దయిపోయి ఒకేసారి ఇంటిపై హక్కు వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. పోనీ ప్రజల్ని బలవంతపెట్టారే అనుకుందాం.. నా దగ్గర డబ్బుల్లేవు, నేను కట్టలేను అంటే ఎవరూ ఏం చేయలేరు కదా. ఉద్యోగులకు టార్గెట్లు పెట్టారే అనుకుందాం.. అవి రీచ్ కాకపోతే వారి జీతంలో కోత పెట్టలేరు కదా. 

అంతమాత్రం దానికి ప్రజల్ని రెచ్చగొట్టి, ప్రతిరోజూ పచ్చ పత్రికల్లో బ్యానర్ ఆర్టికల్స్ వేయిస్తూ రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందనే తప్పుడు ప్రచారం ఎందుకు..? ఇలా రెచ్చగొట్టి ఏం సాధిస్తారు? ఎవరిని బలిచేస్తారు..?

నందమూరి ఫ్యామిలీ నుంచి.. అందరినీ..

నందమూరి ఫ్యామిలీని దగ్గర చేసుకునేందుకు కూడా ఫ్యామిలీ సెంటిమెంట్ అడ్డు పెట్టుకొని ఎన్టీఆర్ సహా అందర్నీ రెచ్చగొట్టారు చంద్రబాబు. ఇప్పుడు ప్రజల్లో వివిధ వర్గాలను ప్రభుత్వం పైకి ఉసిగొల్పుతున్నారు. 

పథకాలన్నీ సక్రమంగానే అమలవుతున్నా.. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవంటూ భవిష్యత్తుపై భయపడేలా చేస్తున్నారు. అయితే ఇలాంటి లెక్కలన్నీ జగన్ ముందు చిత్తవడం ఖాయం. ఈ రెచ్చగొట్టే ప్రక్రియలో చివరకు చంద్రబాబు ఏమవుతారో చూడాలి.