రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాజన్న రాజ్యం తీసుకొస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్, తన మాటల్ని తూచ తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని ఈరోజు ప్రకటించారు. సీఎం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ లో 30 లక్షల మంది కౌలు రైతులకు లబ్ది చేకూరనుంది.
రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా కౌలు రైతులు ఉన్నట్టు 2017లో నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఆ సర్వే ప్రకారం, కౌలు రైతులందరికీ రైతుభరోసా కింద ఆర్థికసాయం అందించాలని జగన్ నిర్ణయించారు. ఈ క్రమంలో భూమి యజమాని హక్కులకు భంగం కలగకుండా తీసుకోవాల్సిన చర్యల్ని సూచించాల్సిందిగా అధికారుల్ని ఆదేశించారు ముఖ్యమంత్రి. రైతు భరోసాకు సంబంధించి మరో శుభవార్త కూడా ప్రకటించారు.
మేనిఫెస్టో ప్రకారం చూసుకుంటే.. వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి రైతుభరోసా కింద రైతులకు ఏడాదికి 12వేల 500 రూపాయలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ ఆ పథకాన్ని ఈ ఏడాది అక్టోబర్ నుంచే వర్తింపజేస్తామని జగన్ ప్రకటించడంతో రైతుల ఆనందానికి అవధుల్లేవ్.
ఈ పథకంతో పాటు నవరత్నాలకు చెందిన మరో 12 పథకాల్ని వైఎస్ఆర్ జయంతి రోజున అధికారికంగా ప్రారంభించబోతున్నారు జగన్. గత ప్రభుత్వం ఆఖరి నిమిషంలో ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దుచేసి, ఆ స్థానంలో రైతు భరోసా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. ఈ మేరకు భూమిపై సర్వహక్కులున్న రైతులతో పాటు.. కౌలు రైతులకు కూడా ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వబోతున్నారు.