ఇద్దరు ముఖ్యమంత్రులు కలిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో చూపించబోతున్నారు కేసీఆర్, జగన్. దశాబ్దాలుగా వృధాపోతున్న గోదావరి జలాల్ని సద్వినియోగం చేసుకోవడంపై ఓ నిర్ణయానికి వచ్చారు. రోజుకు 4 టీఎంసీల గోదావరి జలాల్ని కృష్ణాబేసిన్ లోకి ఎత్తిపోసే సాధ్యాసాధ్యాలపై చర్చించారు. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారుల్ని కోరారు.
నిజానికి ఈ ప్రక్రియను కొత్తగా ప్రారంభించలేదు ముఖ్యమంత్రులు. దీని అమలుకు సంబంధించి 5 ప్రతిపాదనలతో చర్చ ప్రారంభించారు. కాకపోతే ఈ 5 ప్రతిపాదనల్లో ఏది తక్కువ ఖర్చుతో పూర్తవుతుందనే అంశంపై మాత్రమే చర్చించారు. అంతేకాదు.. తెలుగు రాష్ట్రాలకు సహాయ నిరాకరణ చేస్తున్న కేంద్రంను దృష్టిలో పెట్టుకొని.. దానితో సంబంధం లేకుండా ప్రాజెక్టు పూర్తయ్యే అంశంపై కూడా చర్చించారు.
అటవీ భూమి, అభయారణ్యం ఉంటే వాటిపైనుంచి ప్రాజెక్టు నిర్మించాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి. అవి మళ్లీ తీవ్ర జాప్యానికి దారితీస్తాయి. ఇలాంటి కాలయాపన లేకుండా తక్కువ అటవీభూమిని వాడుకునేలా, పర్యవరణాన్ని పాడుచేయకుండా ప్రాజెక్టు డిజైన్ తయారుచేయాలనేది టార్గెట్.
ఈ మేరకు సర్వే నిర్వహించడంతో పాటు.. ఓ మంచి ప్లాన్ తో ముందుకు రావాలని రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జలవనరుల శాఖల్లోని అధికారులతో ఓ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ వచ్చేనెల 15 నాటికి తన నివేదికను అందజేస్తుంది. ఆ వెంటనే బడ్జెట్ లెక్కలు సరిచూసుకొని ప్రాజెక్టు ప్రారంభించాలని భావిస్తున్నారు. రానున్న రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలనేది ఇద్దరు ముఖ్యమంత్రుల ఆశ.
కృష్ణాజలాల లభ్యత పూర్తిగా తగ్గిపోయింది. భారీ వర్షాలు కురిస్తే తప్ప శ్రీశైలం, నాగార్జునసాగర్ లో నీరు చేరే పరిస్థితి లేదు. కేవలం వీటినే నమ్ముకంటే సాగునీరు సమస్యతో పాటు విద్యుదుత్పత్తికి కూడా ఆటంకం ఏర్పడుతుంది. అందుకే ప్రత్యామ్నాయంగా సముద్రంలో ఏటా కలిసిపోతున్న వందల క్యూసెక్కుల గోదావరి జలాల్ని ఎత్తిపోయాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు.
ఈ ప్రాజెక్టు సాకారమైతే తెలుగు రాష్ట్రాల్లో నీటిఎద్దటి, సాగునీటి సమస్యలు దాదాపు 50శాతం పరిష్కారమైనట్టే.