అధికారంలోకి వచ్చినప్పట్నుంచి జగన్ ప్రతి అడుగు సంచలనమే. ముఖ్యమంత్రి హోదాలో జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతోంది. ఇలా పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న ముఖ్యమంత్రి, ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. వారంరోజుల పర్యటనలో భాగంగా యూఎస్ వెళ్లిన ముఖ్యమంత్రి.. అమెరికా వేదికగా మరో సంచలనానికి శ్రీకారం చుట్టబోతున్నారా? సరికొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించబోతున్నారా? అవుననే అంటున్నారు విశ్లేషకులు.
తన వారం రోజుల పర్యటనలో భాగంగా యూఎస్ లోని ప్రముఖ వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో పాటు ఎన్నారై పారిశ్రామికవేత్తలతో సమావేశం కాబోతున్నారు జగన్. ఇప్పటికే యూఎస్ బిజినెస్ కౌన్సిల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొని తమ ప్రభుత్వ విధానాలు నిక్కచ్చిగా చెప్పినట్లు తెలిసింది. షికాగో, వాషింగ్టన్ లో జరగనున్న ఈ సమావేశాల్లో.. అత్యంత కీలకమైన పారిశ్రామిక విధానాన్ని ముఖ్యమంత్రి బయటపెట్టే అవకాశం ఉంది. ఇన్నాళ్లూ గ్రామ సచివాలయాలు, ఉద్యోగుల జీతభత్యాలు, మహిళా సంక్షేమం, ప్రాజెక్టులపై మాత్రమే దృష్టిపెట్టిన ముఖ్యమంత్రి, ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీని బయటకు తీసే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు, సరికొత్త పాలసీని అమెరికా వేదికగా జగన్ ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఈ మేరకు తన పర్యటనకు ముందే పలువురు అధికారులతో కొన్ని కీలక అంశాలపై సీఎం చర్చించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు హయాంలో ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం కేవలం ఆర్భాటానికే సరిపోయింది. ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఎంవోయూలు మార్చుకోవడానికే పరిమితమైంది.
ఏసీ గదుల్లో చేసుకున్న ఒప్పందాలు, క్షేత్రస్థాయికి వచ్చేసరికి 5 శాతం కూడా అమలుకాలేదు. సింగిల్ విండో అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు.. చాలామంది పెట్టుబడిదారుల మొహాల పైనే తలుపులు మూసేశారు. తన వర్గీయులకు మాత్రమే అనుమతులిస్తూ పక్షపాతంగా వ్యవహరించారు. దీంతో పారిశ్రామికవేత్తల్లో కూడా ఒక విధమైన నైరాశ్యం వచ్చేసింది. ఏపీలో పనులు జరగవనే అభిప్రాయానికి వచ్చేశారు చాలామంది. ఈ నేపథ్యంలో జగన్ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
పారిశ్రామికవేత్తల సమావేశంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రంపై పెట్టుబడిదారుల్లో ఉన్న అపోహల్ని తొలిగించే ప్రయత్నం చేయబోతున్నారు జగన్. జలయజ్ఞంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి గతంలో వైఎస్ఆర్ ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లారో.. సరిగ్గా అదే ప్లానింగ్ తో నవరత్నాలతో పాటు ఇండస్ట్రియల్ పాలసీని ముందుకు తీసుకెళ్లాలని జగన్ నిర్ణయించారు. ఈ 5 రోజుల్లో ఈ దిశగా సీఎం నుంచి ఓ కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
జగన్ యూఎస్ బిజినెస్ కౌన్సిల్ కాన్ఫరెన్స్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి