ఏపీకి కాబోయే సీఎం ఎవరు అంటే పవన్ కళ్యాణే అని అంటున్నారు. వచ్చే ఎన్నికలలో జనసేన గెలిచి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడం ఖాయమని జనసైనికులు ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు.
విశాఖలో జరిగిన ఆ పార్టీ కార్యక్రమంలో ఇతర పార్టీల నుంచి చేరికల సందర్భంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ శివశంకర్ ఈ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసుగెత్తిపోయారని ఆయన అన్నారు. అందువల్ల పవన్ కే జనం జై కొడతారని చెప్పారు. ఈ లెక్క పక్కాగా ఉంటుంది. ఏ మాత్రం తప్పదని అని కూడా అంటున్నారు.
రోజురోజుకీ తమ పార్టీకి జనంలో తరగని ఆదరణ లభించడమే జనసేన విజయానికి సంకేతమని కూడా శివశంకర్ చెబుతున్నారు. ఇతర పార్టీల నుంచి నాయకులు వచ్చి చేరడం కన్నా జనసేన బలం చాటేందుకు నిదర్శనం ఏం కావాలని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి జనసేన అధికారంలోకి వస్తుంది, పవన్ సీఎం అని ఆయన జోస్యం చెప్పేశారు.
అయితే జనసేన పొత్తులతో అధికారంలోకి వస్తుందా లేక సొంతంగా వస్తుందా అన్నది మాత్రం ఎక్కడా ఆయన చెప్పలేదు. మరో వైపు తాము ఒంటరిగా పోటీ చేస్తామని కూడా ఆయన ఎక్కడా చెప్పలేదు. మరి లెక్కలు అన్నీ తమకే ఫేవర్ అంటున్నారు అంటే ఆ రాజకీయ చిత్రమేంటో చూడాల్సిందే. జనసైనికులు కూడా వెయిటింగ్ మరి.