కృష్ణ..కృష్ణ..అమరావతిపై సరైన ప్రశ్న

ఎబిఎన్ లో చేరిన తరువాత అమరావతి రాజధాని వ్యవహారంపై తన స్టాండ్ మార్చుకున్న జర్నలిస్ట్ వెంకటకృష్ణ. సరే, ఏ రోటి కాడ ఆ పాట పాడాలి కాబట్టి ఆయనను, ఆయన స్టాండ్ ను తప్పు…

ఎబిఎన్ లో చేరిన తరువాత అమరావతి రాజధాని వ్యవహారంపై తన స్టాండ్ మార్చుకున్న జర్నలిస్ట్ వెంకటకృష్ణ. సరే, ఏ రోటి కాడ ఆ పాట పాడాలి కాబట్టి ఆయనను, ఆయన స్టాండ్ ను తప్పు పట్టడానికి లేదు. కానీ ఆయన ఓ డిస్కషన్ లో వేసిన ప్రశ్న, పడిన ఆవేదన కాస్త ఆలోచింప చేసేదిగా వుంది. 

'ఏఢాది కాలంగా ఉద్యమం సాగుతుంటే ఎవరికీ ఎందుకు పట్టడం లేదు. సీరియస్ నెస్ ఎందుకు రావడం లేదు. ఆడవాళ్లు అష్టాచెమ్మా ఆడుకుంటున్నట్లు, మగవారు పిచ్చాపాటీ వేస్తున్నట్లు ఫీలవుతున్నారు తప్ప, ఉద్యమం ఎవరికీ ఎందుకు పట్టడం లేదు..నాకు అర్థం కావడం లేదు..''

ఇదీ వెంకటకృష్ణ ఆవేదన. నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం ఆయన చాలా బాగా తెలుసు. కానీ తెలియనట్లు నటిస్తున్నారు అంతే. అసలు అమరావతి రైతులు ఎందుకు ఉద్యమిస్తున్నారు?

రాజధాని అమరావతిలోనే వుండాలని.

రాజధాని అమరావతిలోనే వుండాలని వారు ఎందుకు కోరుకుంటున్నారు? తాము భూమలు ఇచ్చి త్యాగం చేసామని, అందుకే అని వారు చెబుతున్న మాట. కానీ అది త్యాగం కాదని, లెక్కలతో సహా పలుసార్లు పలువురు సోషల్ మీడియాలోనే కుండ బద్దలు కొట్టారు. భూమి ఇచ్చినందుకు ఇబ్బడి ముబ్బడిగా వారికి ఎంత లాభం చేకూరుతుందో ఉదాహరణలతో సహా చెప్పారు.

అబ్బే ఇది అబద్దం, తప్పుడు ప్రచారం అని అనుకుందాం.

మరి విదేశాల నుంచి వచ్చి మరీ, కోట్లు పెట్టి భూములు కొని ప్రభుత్వానికి లాండ్ పూలింగ్ లో ఎందుకు ఇచ్చారు? ఇదీ త్యాగమేనా? లేక దీనినే స్పెక్యులేషన్ అని కూడా అంటారా?

ఎక్కడన్నా ప్రభుత్వం తమ భూమి తీసుకుంటుందీ అంటే జనం అర్జెంట్ గా అమ్మేసుకుని బయటపడదాం అనుకుంటారు. కానీ ఇక్కడేంటీ కొని మరీ ఎదురు ఇచ్చారు? అక్కడే మతలబు వుందని అర్థం కావడం లేదా ఇక్కడ మరో పాయింట్ కూడా వుంది.

అమరావతి రైతుల తరపున వకాల్తా పుచ్చుకుంటున్నది మహా మహా గొప్ప న్యాయవాదులు. వాళ్ల ఫీజు ఏ రేంజ్ లో వుంటుందో ఇప్పటికే కథనాలు వచ్చాయి. మరి ఇంత భారీ ఫీజులు రైతులు ఎలా ఇవ్వగలుగుతున్నారు అన్నది మరో ప్రశ్న. 

సరే భూముల వ్యవహారం పక్కన పెట్టి రాజధానిగా అమరావతి వుండాలనే కోరిక అక్కడివారిది అని కాస్సేపు సరిపెట్టుకుందాం. రాజధానిగా అమరావతి వుండాలని అక్కడి వారికి కోరిక ఉండడం ఎంత సహజమో, తమ ప్రాంతలో వుండాలని మిగిలిన ప్రాంతాల వారికి కూడా వుండడం అంతే సహజం కదా?

ఉదాహరణకు రాజధాని అమరావతిలో అని ప్రకటించినపుడు ఉత్తరాంధ్ర వాసులు ఉద్యమం మొదలు పెట్టి వుంటే, ఇప్పటికి ఆరేళ్లు అయి వుండేది. అప్పుడు కూడా వెంకటకృష్ణనో మరొకరో ఇదే తరహా కామెంట్ లు చేసి వుండేవారా? అయ్యో, ఉత్తరాంధ్ర ఉద్యమం ఎవరికీ పట్టడం లేదు అని వాపోయి వుండేవారా? 

అమరావతి ని రాజధానిగా ప్రకటించడానికి ముందు, తరువాత వివిధ పత్రికల్లో ఏ తరహా వార్తలు వచ్చాయో ఓ సారి గుర్తు చేసుకుందాం. త్యాగాల మీద వార్తలు రాలేదు. తుళ్లూరు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఎలా ఆకాశానికి పెరుగుతోందో కథలు కథలుగా రాసారు. విలాసవంతమైన వాహనాలు అమరావతి ప్రాంతంలోని మట్టి రోడ్ల మీద దుమ్ము రేపుతూ ఎలా తిరిగేవో వార్తలు వచ్చాయి. 

అమరావతి ప్రాంతంలో ప్రజలు కార్లు, బైకులు ఎలా కొంటున్నారో పత్రికల్లో కనిపించింది. ఇలా అమరావతి వార్తలు అన్నీ డబ్బు చుట్టూ తిరిగాయి తప్ప మరోటి కాదు. అమరావతి బౌండరీ చుట్టూ వెంచర్లే వెంచర్లు. 

అలాంటి కల ఒక్కసారి కరిగిపోయింది. కల కరిగిపోతే బాధపడేది ఎవరు? కలగనేవారు తప్ప వేరే వారు కాదు. ఇప్పుడు అదే జరుగుతోంది. నిజానికి ఉత్తరాంధ్ర, రాయలసీమ జనాలు చాలా మంచివారు అనుకోవాలి. ఎందుకంటే తమ ప్రాంతానికే రాజధాని కావాలంటూ బలమైన ఉద్యమాన్ని నిర్మించే పని చేపట్టలేదు.

అలా జరిగి వుంటే ఈ మీడియా అస్సలు దానిని ప్రొజెక్టు చేసేదే కాదు. డిస్కషన్లు పెట్టేదే కాదు. ఆవేదన వ్యక్తం చేసేదే కాదు. సరే, ఆ సంగతి అలా వుంచి ఏడాదిగా ఉద్యమం సాగుతోంది..ఏడాదిగా ఉద్యమం సాగుతోంది అంటున్నారు.

ఆ రెండు పత్రికలు మద్దతు ఇవ్వకుంటే అసలు అక్కడ ఉద్యమం వుంది అని కూడా ఎవరికైనా తెలిసేదా? నలుగురు మహిళలు ఎవరో ఒకరి ఇంటి ముందు కుర్చీల్లో కూర్చోవడం ఓ ఫోటో తీయడం మర్నాడు విజయవంతమైన 36 రోజు అంటూ లేదా 42 రోజు అంటూ చిన్న వార్త. నలుగురు మగవాళ్లు మాస్కులు కట్టుకని రోడ్డపక్క నిల్చోవడం, ఫోటో..మళ్లీ డిటో డిటో వార్త. ఇదేగా ఏడాది కాలంగా సాగుతున్న వార్త.

అసలు అమరావతి విషయంలో చంద్రబాబు చేసిన పెద్ద తప్పు ఒకటి వుంది. అమరావతిని ఎంపిక చేసినపుడే, ఎయిమ్స్ కర్నూలుకు ఇచ్చి, విశాఖకు మరోటి ఇచ్చి వుంటే ఇప్పుడు మరో విధంగా వుండేది. పాన్ డబ్బా నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకు అన్నీ కృష్ణ గుంటూరు జిల్లాల్లోనే వుండాలని కోరుకున్నారు. ఆ విధంగా తరలించారు. దాంతో మిగిలిన ప్రాంతాల వారు మౌనంగా భరించారు. సహించారు. ఇప్పుడు అమరావతిలో అగచాట్లు మొదలైనా అలాగే మౌనంగా వున్నారు..

భాజపా నేత సోము వీర్రాజు తామే ఎయిమ్స్ ను కోరి మంగళగిరికి ఇచ్చినట్లు మాట్లాడుతున్నారు. కానీ అసలు విషయం అది కాదు. ఎయిమ్స్ ఆంధ్రకు శాంక్షన్ కాగానే వినించిన పేరు కర్నూలు. కావాలంటే ఆనాటి పత్రికల డిజిటల్ కాపీలు చెక్ చేసుకోవచ్చు. దాన్ని తెలివిగా మంగళగిరికి మళ్లించింది బాబుగారే. 

అమరావతి రైతుల అభివృద్ధి, రైతుల త్యాగం అని మాట్లాడేవారు వారి త్యాగాన్ని తీసుకెళ్లి బడా కంపెనీలకు బడా బాబులకు భూముల రూపంలో పందేరం చేయడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? అంటే తమ దగ్గర తీసుకున్న భూములను బడా వ్యక్తులకు ప్రభుత్వం అప్పనంగా సమర్పించుకున్నా రైతులకు సంతోషమేనా? అది ఏవిధంగా సంతోషం అందిస్తుంది. 

అంటే తమకు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు అందించేసి, మిగిలినది మీరు ఎలా చేసుకున్నా ఫరవాలేదనేది రైతుల వైఖరి అనుకోవాలా? ఇలాంటి వైఖరి వున్న రైతులు ఇప్పుడు తమ పంట పండలేదని ఆవేదనతో ఉద్యమం చేస్తే మిగిలిన ప్రాంతాల వారు స్పందించి,ఉరకలు పరుగులు పెట్టి అమరావతి వచ్చి రైతులతో చేయి కలపాలా? అసలు అలా ఎలా ఆలోచిస్తున్నారు?

వెంకటకృష్ణకు తెలియాల్సింది ఏమిటంటే జనాలు వెర్రివాళ్లు కాదు. మీడియా ఎటు అదలిస్తే అటు కదలడం అనేది ఒకప్పుడు వుంది. మద్యపానం నిషేధించాలి అంటూ అటు అదిలిస్తే అటే కదిలారు. ఎన్టీఆర్ ను గద్దె దింపడం అన్యాయం అన్నపుడు అలాగే అన్నారు. ఎన్టీఆర్ ను రెండో సారి గద్దె దింపడం న్యాయమే అంటే అవును న్యాయమే అన్నారు. ఎందుకంటే అప్పుడు సోషల్ మీడియా లేదు.  ఆ రెండు మీడియాలు ఏం చెబితే అవే జనం నమ్మారు. 

కానీ ఇప్పుడు సోషల్ మీడియా వుంది. ఇక్కడ ఆలోచనలు పంచుకుంటున్నారు. వాదనలు, ప్రతివాదనలు జరుగుతున్నాయి. జనం విషయాన్ని ఆకళింపు చేసుకుంటున్నారు. విశ్లేషించుకుంటున్నారు.

మీడియా వైఖరిని అర్థం చేసుకుంటున్నారు. అందుకే తమ నిర్ణయం తాము తీసుకుని మౌనంగా వుంటున్నారు. తమ ఉద్యమానికి మద్దతు రాలేదో అంటూ వెంకటకృష్ణలాంటి వాళ్లు వాపోతున్నారు. 

అభిజిత్ చాలా కేరింగ్ పర్సన్