రీచార్జ్ రేటు పెరిగింద‌ని.. నెట్ వ‌ర్క్ మార్చేస్తే!

'అరే మామా.. ఎయిర్ టెల్ వాడు రీచార్జ్ మొత్తాల‌ను పెంచేశాడ్రా.. మొన్న‌టి వ‌ర‌కూ ఉన్న చార్జీల‌పై ఇప్పుడు చాలా బాదుతున్నాడు, అందుకే నెట్ వ‌ర్క్ మార్చేశా, జియోకు మారిపోయా, పాత నంబ‌ర్ నే కొత్త…

'అరే మామా.. ఎయిర్ టెల్ వాడు రీచార్జ్ మొత్తాల‌ను పెంచేశాడ్రా.. మొన్న‌టి వ‌ర‌కూ ఉన్న చార్జీల‌పై ఇప్పుడు చాలా బాదుతున్నాడు, అందుకే నెట్ వ‌ర్క్ మార్చేశా, జియోకు మారిపోయా, పాత నంబ‌ర్ నే కొత్త నెట్ వ‌ర్క్ లోకి మార్చేయించుకున్నా..' అని స్నేహితుల‌కు త‌మ ఫోన్ చార్జీ బాధ గురించి చెప్పుకున్న జ‌నాల‌కు, ఇంత‌లోనే జియో నుంచి కూడా వాయింపు త‌ప్ప‌లేదు! ఎయిర్ టెల్, వీ ల‌తో పాటు.. జియో కూడా మొబైల్ రీచార్జ్ ధ‌ర‌ల‌ను పెంచేసింది. 

ఆ నెట్ వ‌ర్క్ ల వాళ్లు చార్జీలు పెంచార‌నే కోపంతో కొత్త నెట్ వ‌ర్క్ లోకి మారిన వారికి ఊర‌ట ఏమీ ద‌క్క‌డం లేదు. అన్ని నెట్ వ‌ర్క్ ల వాళ్లూ ఉమ్మ‌డిగా బాదుతున్నారు. జియో వ‌చ్చిన త‌ర్వాత కొన్నాళ్ల పాటు మొబైల్ బిల్లుల‌న్నీ కాస్త త‌క్కువ ధ‌ర‌కే లభించాయి. ప్ర‌త్యేకించి ఇంట‌ర్నెట్ డేటా అంత‌కు ముందు ధ‌ర‌తో పోలిస్తే..  చాలా చీప్ గా మారింది. 2017 నుంచి జియోకు పోటీగా ఇత‌ర నెట్ వ‌ర్క్ ల వాళ్లు కూడా ధ‌ర‌లు త‌గ్గించ‌క త‌ప్ప‌లేదు. ఆ దెబ్బ‌కు కొన్ని నెట్ వ‌ర్క్ లు మూత ప‌డ్డాయి!

నాలుగేళ్ల కింద‌ట మార్కెట్ లో అర‌డ‌జ‌నుకు పైగా నెట్ వ‌ర్క్ లు సిమ్ ల‌ను అందించేవి. ఇప్పుడు మార్కెట్ పోటీలో మూడే మిగిలాయి. బ‌హుశా ఇక నుంచి ఈ సంస్థ‌ల బాదుడు ఉండ‌వ‌చ్చు. ఒక్క ప‌క్షం రోజుల వ్య‌వ‌ధిలోనే అన్ని కంపెనీలు రేట్లు పెంచేశాయి. 

మొన్న‌టి వ‌ర‌కూ ఎయిర్ టెల్ యాభై ఆరు రోజుల రీచార్జ్.. విత్ త్రీ జీబీ డెయిలీ డేటా.. ధ‌ర 558గా ఉండేది. ఇప్పుడు అదే ప్యాకేజ్ కొత్త ధ‌ర ఏకంగా 699 కు పెంచేశారు. అటు ఇటుగా నెల‌కు డెబ్బై రూపాయ‌ల మేర ధ‌ర పెంచారు. అయితే ఈ ప్యాకేజ్ తో అమేజాన్ ప్రైమ్ మెంబ‌ర్షిప్ ను ఎంజాయ్ చేసుకోవ‌చ్చు. ఆల్రెడీ మెంబ‌ర్షిప్ ఉన్న వారికి మాత్రం.. ఇది ఉప‌యోగం లేని ఆఫ‌రే. 

ఇక జియో విష‌యానికి వ‌స్తే.. రోజుకు రెండు జీబీ ఇంట‌ర్నెట్ డేటాతో  యాభై ఆరు రోజుల‌కు గానూ పాత ధ‌ర 444 కాగా కొత్త ధ‌ర ఏకంగా 533కు చేరింది. స్థూలంగా దాదాపు ఒకే స్థాయిలో ఈ కంపెనీల కొత్త చార్జీల పెంపును అమ‌ల్లో పెడుతున్నాయి. మ‌రి ఈ పెంపులు ఇంతేనా.. ఇంకా పెరుగుతాయా? అనేది ఇప్పుడు కీల‌క‌మైన ప్ర‌శ్న‌. ప‌ల్లెటూళ్ల‌లో వ్య‌వ‌సాయం చేసుకునే వారు, ప‌శువులు కాసుకునే వారికి కూడా ఇప్పుడు ఇంట‌ర్నెట్ లేనిది పొద్దు పోవ‌డం లేదు. రోజుకు ఒక‌టిన్న‌ర జీబీ ఇంట‌ర్నెట్ డేటా లేక‌పోతే అంతే సంగ‌తి! గ‌త నాలుగేళ్ల‌లో.. వ‌చ్చిన ప్ర‌ధాన‌మైన మార్పు ఇది.

ఇలాంటి నేప‌థ్యంలో.. అలా నెట్ , స్మార్ట్ ఫోన్ యూసేజ్ కు అల‌వాటు ప‌డ్డ వారు.. ఎక్కువ ధ‌ర చెల్లించి కూడా రీచార్జ్ లు త‌ప్ప‌ని స‌రి చేసుకుంటార‌న‌డంలో సందేహం లేదు. మ‌రి ఈ పెంపు ఇక మీద కూడా ఇదే త‌ర‌హాలో కొన‌సాగితే.. మొన్న‌టి వ‌ర‌కూ క్వార్ట‌ర్ ఇయ‌ర్ ఫ‌లితాల్లో ప్ర‌తి సారీ న‌ష్టాల‌నే చూపిన టెలికాం కంపెనీలు, ప్ర‌జ‌లు అల‌వాటు ప‌డటం పుణ్యాన లాభాల బాట‌లోకి రావొచ్చు!