ఇండియా తరఫున ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన అరుదైన రికార్డు ఇప్పటి వరకూ పరిమిత మంది ప్లేయర్ల పేరిటే ఉంది. ఈ విషయంలో శ్రేయస్ అయ్యర్ పదహారవ ఆటగాడు మాత్రమే. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ తరఫు నుంచి తొలి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టింది కేవలం పదహారు మంది మాత్రమే. గత కొన్ని దశాబ్దాల్లో ఈ తరహాలో ఆరంగేట్రం చేసిన అరుదైన క్రికెటర్లలో అజరుద్దీన్, ప్రవీణ్ ఆమ్రే, సౌరవ్ గంగూలీ, వీరేందర్ సెహ్వాగ్, సురేష్ రైనా, శిఖర్ ధావన్, రోహిత్ శర్మలకు ఇది సాధ్యమైంది.
అయితే వీరిలో రైనా, ధావన్, రోహిత్ లు బోలెడన్ని పరిమిత ఓవర్ల మ్యాచ్ లు ఆడిన తర్వాత టెస్టు జట్టులోకి వచ్చి, తొలి మ్యాచ్ లోనే సెంచరీలు చేశారు. టెస్టులకు అయితే వారు కొత్త కానీ, పరిమిత ఓవర్ల మ్యాచ్ ల అనుభవం చాలానే ఉంది వారికి. కాబట్టి.. వారి సెంచరీలు మరీ ఆశ్చర్య పరచలేదు.
వస్తూ వస్తూనే అదరగొట్టిన వారిలో అజర్, గంగూలీ, సెహ్వాగ్ ఉంటారు. తమ తొలి టెస్టుకు ముందు వీరికి అంతర్జాతీయ అనుభవం ఏ మాత్రం లేకుండానే అదరగొట్టారు. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా ఇప్పటికే కొన్నాళ్ల నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నట్టే. టీ20లతో తెరపైకి వచ్చాడు. ఐపీఎల్ లో కెప్టెన్సీ హోదాకు వెళ్లాడు.
ఇంత జరిగిన తర్వాత టెస్టు జట్టులోకి వచ్చి, స్వదేశంలో తొలి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టాడు. ఇది ఈ ఆటగాడికి డ్రీమ్ డెబ్యూనే. ఇక తొలి ఇన్నింగ్స్ తో తీసి పోకుండా సెకెండ్ ఇన్నింగ్స్ లో కూడా శ్రేయస్ మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సెకెండ్ ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీపై పరుగులు సాధించి.. కీలక భాగస్వామ్యాలను ఏర్పరిచి, టీమిండియాకు అవసరమైన కీలక ఆధిక్యంలో తనదైన పాత్ర పోషించాడు.
కాన్సూర్ టెస్టులో టీమిండియా విజయంపై ఆశావహ పరిస్థితుల్లోనే ఉంది. చివరి రోజు తొమ్మిది వికెట్లను సాధిస్తే విజయం భారత్ సొంతం అవుతుంది. న్యూజిలాండ్ కు విజయం మీద ఆశలు లేనట్టే. రోజంతా నిలబడి డ్రా చేసుకోవడం మీద ఆ జట్టు దృష్టి సారించవచ్చు. అయితే ఐదో రోజు భారత పిచ్ లు స్పిన్నర్లకు స్వర్గధామాలవుతాయని వేరే చెప్పనక్కర్లేదు. నాలుగో రోజే నాలుగు ఓవర్లు వేసి, నాలుగు పరుగులిచ్చి, ఒక వికెట్ పడగొట్టారు భారత స్పిన్నర్లు. ఈ నేపథ్యంలో చివరి రోజు స్పిన్ ఉచ్చులో పడకుండా న్యూజిలాండ్ నెట్టుకురావడం తేలిక కాదు.
ఇక శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే.. స్వదేశంలో టెస్టుల్లో సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు కూడా భారత ఆటగాళ్లకు పెద్ద కష్టం కాదు. ఇది వరకూ ఇలాంటి పెద్ద రికార్డులు బద్దలు కొట్టిన వారికి కూడా మరుసటి మ్యాచ్ లో స్థానం దక్కలేదు. ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్ నాయర్ ఆ తర్వాతి మ్యాచ్ లో చోటు పొందలేకపోయాడు. మళ్లీ అతడి కెరీర్ కు ఊపు రాలేదు.
అయితే ఇప్పుడు జట్టులో సీనియర్ల వైఫల్యం కొనసాగుతోంది. పుజారా, రహనేలు అత్యంత పేలవంగా ఆడుతున్నారు కొన్నాళ్ల నుంచి. ఈ నేపథ్యంలో వారికి దీర్ఘకాలిక ప్రత్యామ్నాయాలనే జట్టు రెడీ చేసుకోవాల్సి ఉంది. ఇలాంటి నేపథ్యంలో శ్రేయస్ కు మెరుగైన అవకాశాలే ఉండవచ్చు.