ప్రజల పల్స్ రేటును పెంచేస్తున్నాయి కరోనా కొత్త వేరియెంట్ వార్తలు. అదిగో పులి అంటే.. ఇదిగో తోక.. అన్నట్టుగా వచ్చే టీవీ వార్తలు ఓమిక్రాన్ గురించి దంచి కొడుతున్నాయి. ఆస్ట్రేలియాలో రెండు కేసులను గుర్తించారనే వార్తను కూడా ఆస్ట్రేలియా అల్లకల్లోలం అయిపోతోందనే లెవల్లో రిపోర్ట్ చేయడం తెలుగు టీవీ చానళ్ల ప్రత్యేకత. ప్రజలను బెదరగొట్టడమే పని. రెండు కేసులు, ఒక కేసులను కూడా సంచలనం అనే స్థాయిలో చెప్పకపోతే వార్తలు చూడరన్నట్టుగా పని చేయడం తెలుగు చానళ్లకు కొత్త కాదు.
అలాగని ఓమిక్రాన్ ఏమీ ఫ్రెండ్లీ వేరియెంట్ అని ఇక్కడ ఎవరూ అనడం లేదు. అయితే పెద్ద పెద్ద వైరాలజిస్టులే, దీని ప్రభావం గురించి అప్పుడేం ఏం చెప్పలేమంటున్నారు. వేగంగా వ్యాపిస్తోందని దక్షిణాఫ్రికాలో గుర్తించిన మాట నిజమే కావొచ్చు కానీ, ఇది వ్యాక్సిన్లకు అందదని, వ్యాధినిరోధకతను హరించి వేచి చంపేస్తుందని కానీ.. చెప్పలేమని వైరాలజిస్టులు అంటున్నారు. దీని గురించి మరి కాస్త స్పష్టత కావాలని.. దానికి కనీసం రెండు వారాలు పట్టవచ్చని వారు అంటున్నారు. శాస్త్రీయంగా దాని ప్రవర్తన గురించి తెలుసుకోవడానికి రెండు వారాలు కాదు, ఇంకా ఎక్కువ సమయమే పట్టినా పెద్ద ఆశ్చర్యం లేదు.
అయితే వైరాలజిస్టుల మాటలతో వార్తలు చదివే వారికి పని లేదు. అదిగో.. ఇదిగో.. అని బెదరగొడితే తప్ప ఆ రోజుకు ప్రశాంతత ఉండదు. ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయనేదీ నిజమే. కరోనాతో ఇప్పటికే కుదేలైన రాజ్యాలు ఇప్పుడు అలర్ట్ కావడం.. సంచలనం ఏమీ కాదు. జాగ్రత్త పడుతున్నాయి. ఇండియా కూడా జాగ్రత్త పడాలి. ప్రతి మనిషీ జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్తలను మనం ఏనాడో మానేశామనే విషయాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాలి.
ఓమిక్రాన్ కావొచ్చు, మరో వేరియెంట్ కావొచ్చు.. వైద్య పరిశోధకులు గుర్తించే వరకూ తన వ్యాప్తిని ఆపుకోదు. వైరాలజిస్టులు చెప్పే మాట ఏమిటంటే.. ఇప్పటికే ఈ వేరియెంట్ అన్ని వైపులకూ వ్యాపించి ఉండవచ్చనేది! కాబట్టి.. ఒక కేసు, రెండు కేసులు అనడం కూడా.. ఉత్తుత్తి మాటే అని వారి మాటను బట్టి స్పష్టం అవుతోంది.
ఈ వేరియెంట్ ను వైరాలజిస్టులు తక్కువ అంచనా వేయడం లేదు, అలాగని బెంబేలెత్తి పోమనీ అనడం లేదు. వారు చెప్పేది అదే మాస్కు, అదే వ్యాక్సిన్, అదే భౌతిక దూరం. వాటిని పాటించండి.. మీకు చాలా వరకూ రక్షణ ఉన్నట్టే అని వారు అంటున్నారు. అయితే వీటిని గుర్తు చేయడం మానేసి.. కొత్త వేరియెంట్ వార్తలను ప్రజల గుండెళ్లో గుబులు పుట్టించేలా, వారిని మానసికంగా భయంతో చంపడానికి చేసే పనిలా జరుగుతోంది టీవీ చానళ్ల చేతబడి!