తన తప్పు లేదంటూ, పద్ధతిగా తప్పుకున్న నాని

టక్ జగదీష్ ను ఓటీటీకి ఇచ్చేశారనేది పక్కా. కాకపోతే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అలా అఫీషియల్ ప్రకటన ఇవ్వాలంటే ముందుగా నాని నుంచి క్లియరెన్స్ రావాలి. ఓటీటీ రిలీజ్ కు తనకు ఏమాత్రం…

టక్ జగదీష్ ను ఓటీటీకి ఇచ్చేశారనేది పక్కా. కాకపోతే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అలా అఫీషియల్ ప్రకటన ఇవ్వాలంటే ముందుగా నాని నుంచి క్లియరెన్స్ రావాలి. ఓటీటీ రిలీజ్ కు తనకు ఏమాత్రం సంబంధం లేదని, నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వ్యవహరించానంటూ నాని ప్రకటించాలి. ఈరోజు అదే జరిగింది.

టక్ జగదీష్ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వదని, ఓటీటీలోనే వస్తుందనే విషయాన్ని నాని పరోక్షంగా వెల్లడించాడు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అసాధారణ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని, టక్ జగదీష్ విడుదలపై నిర్ణయాన్ని పూర్తిగా నిర్మాతలకు అప్పగిస్తున్నానంటూ ఎంచక్కా తప్పుకున్నాడు నాని.

తనకు మాత్రం థియేటర్లలోనే సినిమా చూడడం ఇష్టమని, కానీ వరుసగా రెండోసారి (ఇంతకు ముందు V సినిమా) ఎటూ పాలుపోలేని అయోమయ స్థితిలో ఉన్నానని ప్రకటించిన నాని.. నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించాడు. అంతేకాదు.. సినిమా ఏ మాధ్యమంలో విడుదలైన అది ప్రేక్షకుడికి చేరేవరకు కృషి చేస్తానని కూడా తెలిపాడు.

నాని ప్రకటనతో టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్ కు అధికారికంగా లైన్ క్లియర్ అయింది. ఇక రేపోమాపో సినిమా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించేస్తారు. నిజానికి ఈ సినిమాను ఓటీటీకి ఇచ్చేశారనే విషయంతో పాటు, ఎంతకు డీల్ ఓకే అయిందనే వివరాలు కూడా బయటకొచ్చేశాయి. కానీ నిర్మాతలు మాత్రం నోరు మెదపలేదు. 

ఇప్పుడు నాని తన స్టయిల్ లో ప్రకటన ఇవ్వడంతో, ఇక సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడమే ఆలస్యం.