ఇంకో నాయకుడు తయారయ్యాడు

జాతీయ రాజకీయాల పిచ్చి, నేషనల్ లీడర్ కావాలనే కోరిక కేసీఆర్ ఒక్కడికే ఉందని ఇంతకాలం అనుకున్నాం. కానీ ఇప్పుడు మరొకాయన తయారయ్యాడు. ఆయన పేరే గులాం నబీ ఆజాద్. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి.…

జాతీయ రాజకీయాల పిచ్చి, నేషనల్ లీడర్ కావాలనే కోరిక కేసీఆర్ ఒక్కడికే ఉందని ఇంతకాలం అనుకున్నాం. కానీ ఇప్పుడు మరొకాయన తయారయ్యాడు. ఆయన పేరే గులాం నబీ ఆజాద్. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ నుంచి ఈ మధ్యనే రాజీనామా చేసిన నాయకుడు. ఈయన కూడా జాతీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశాడు. కాకపొతే కేసీఆర్ కు , ఆజాద్ కు ఒక్కటే తేడా. ఏమిటంటే …కేసీఆర్ ప్రాంతీయ పార్టీ అధినేతగా ఉండి జాతీయ పార్టీ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆజాద్ జాతీయ పార్టీలో నుంచే వచ్చిన నాయకుడు. 

సాధారణంగా జాతీయ పార్టీల్లో నుంచి బయటకు వచ్చిన నాయకులు ప్రాంతీయ పార్టీలు పెడుతుంటారు. మమతా బెనర్జీ అలాగే చేశారు. ఆమె కాంగ్రెస్ నుంచే బయటకు వచ్చారు. శరద్ పవార్ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చి ఎన్సీపీ పెట్టారు. దాని పేరులోనే నేషనల్ అని ఉందిగానీ అది ప్రాంతీయ పార్టీయే. ఇంకా కొందరు కూడా ఉండొచ్చు. కేసీఆర్ తాను బీజేపీకి, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జాతీయ పార్టీ పెడతాను అన్నారు. యేవో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవి ఓ కొలిక్కి రావడంలేదు. ఇక ఆజాద్ తన జాతీయ పార్టీ బీజేపీకి, కాంగ్రెస్ కు దీటుగా ఉంటుందని అంటున్నాడు. కానీ ఈయన పార్టీ బీజేపీతో సానుకూల సంబంధాలు పెట్టుకోవచ్చని జాతీయ మీడియా అంచనా వేస్తోంది.

ఆజాద్ మాత్రం ఒక టీవీ ఇంటర్వ్యూలో దీన్ని కొట్టి పడేశారు. అయితే గులాం నబీ ఆజాద్ చెప్పిన ప్రకారం వీలైనంత త్వరలోనే జాతీయ పార్టీని ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బీజేపీ అనేక రాష్ట్రాలలో బలంగా ఉండడం,  ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ చాలా బలహీన పడడం వంటి కారణం వలన ఆజాద్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి… తన పార్టీ ని ఇక్కడ నుండే స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. సంవత్సరాల నుండి భారతదేశ రాజకీయాలను ఏలుతున్న రెండే రెండు పార్టీలు కాంగ్రెస్ , భారతీయ జనతా పార్టీ.  బీజేపీకి  అంత ప్రాభవం లేని సమయంలో కాంగ్రెస్ పార్టీ  చాలా మంచి పేరు తెచ్చుకుంది.

కానీ ఆ తరువాత మెల్ల మెల్లగా పార్టీ దేశంలో బలహీన పడుతూ వచ్చింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో సైలెంట్ గా ఒక్కో రాష్ట్రంలో బీజేపీ  అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ కి ఉన్న బలహీనతపై వర్క్ అవుట్ చేసి అధికారంలోకి వచ్చింది అని చెప్పాలి. కాగా జాతీయంగా ఈ రెండు పార్టీల తర్వాత మరో పార్టీ పైకి రాలేకపోయింది. కాంగ్రెస్, బీజేపీలను పక్కకు తోసి ఆ స్థానాన్ని భర్తీ చేయడం ఎవరివల్లా కావడంలేదు. ఆజాద్ కూడా ఆ పని చేయగలడని నమ్మకం లేదు. చూడాలి ఏమౌవుతుందో.