ఎవరైనా సరే అంతే చాన్స్ దొరికితే చాలు మనల్ని ఎక్కడానికి ప్రయత్నిస్తారు. మనం ఊరుకున్నంత వరకు, అదే పనిగా దాడి చేస్తూనే ఉంటారు! మనం తిరగబడి స్పందించాం అంటే.. వెంటనే సర్దుకుంటారు! వారు చేస్తున్న తప్పులను ఎత్తి చెపితే కనుక.. కంగారు పడతారు! తోక ముడిచి పారిపోయే ప్రయత్నం చేస్తారు!!
కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు.. అచ్చం ఇలాంటి దుస్థితిలోనే కొట్టుమిట్టాడుతోంది! అప్పుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలను కార్నర్ చేసి, ఆయా ప్రభుత్వాల మీద నిందలు వేసి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నించిన కేంద్ర ప్రభుత్వానికి ఘాటైన ఎదురుదెబ్బ తప్పలేదు. మీరంతా అప్పులు చేయడంలో అదుపు తప్పిపోతున్నారు.. జాగ్రత్త పడాలి.. లేకపోతే శ్రీలంక లాంటి విషమ పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధపడాలి.. అని సన్నాయి నొక్కులు నొక్కుతూ, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త పాట అందుకుంది!
ఈ వైఖరికి నిరసనగా- కేంద్రం చేస్తున్న అప్పుల సంగతి ఏమిటి అంటూ అనేక రాష్ట్రాలకు చెందిన పార్టీల ప్రతినిధులు ఎదురుదాడి చేసేసరికి, కేంద్రం చేస్తున్న అప్పుల తీవ్రత ఎంతో గణాంకాల సహా వివరించేసరికి కేంద్రం తోక ముడిచింది!!
శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా దిగజారిన తర్వాత కేంద్రమంత్రి జైశంకర్ అక్కడి పరిస్థితులను వివరించడానికి ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రకంగా దేశంలో ఉన్న అన్ని పార్టీలను పిలిచారు. తీరా అందరూ వచ్చిన తర్వాత.. ఎజెండా పాయింట్ అయిన శ్రీలంక సంగతులు వదిలేసి.. ఏయే రాష్ట్రాలు ఎంతెంత అప్పులు చేశాయి.. ఆయా రాష్ట్రాలు ఎలా మనుగడ సాగిస్తాయి.. అనే సంగతులు చెప్పడం ప్రారంభించారు. మన దేశంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితికి చేరేలా అప్పులు చేశాయంటూ.. ఓ పది రాష్ట్రాల జాబితాను కూడా తయారు చేశారు. ఆ జాబితా ప్రకారం.. వారంతా దోషులు అని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.!
ఇంతకూ ఆయన జాబితాలో ఉన్న పది రాష్ట్రాలు ఏమిటో తెలుసా? ఆంధ్రప్రదేశ్, బిహార్, హర్యానా, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు! వీటిలో బీజెపీ పాలిత రాష్ట్రాలు రెండే. ఎన్డీయే పాలన ఒకచోట ఉంది. అంటే డబుల్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ మాత్రమే దేశాన్ని కాపాడుతుంది. డబుల్ ఇంజిన్ లేని రాష్ట్రాలు అప్పుల పాలైపోతున్నాయి అని చెప్పడం కేంద్రం ఉద్దేశ్యం కూడా కావొచ్చు.
కానీ.. ఈ అఖిలపక్ష సమావేశంలో.. కేంద్రమంత్రి జైశంకర్.. రాష్ట్రాల అప్పుల వివరాలను ప్రస్తావించడం ప్రారంభించేసరికి పార్టీలవాళ్లు తగులుకున్నారు. అసలు కేంద్రం చేసిన అప్పుల మాటేమిటంటూ ఒక రేంజిలో ఆడుకున్నారు. మోడీ గద్దె ఎక్కిన కాడినుంచి.. ఇప్పటిదాకా కేంద్రం 95 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందంటూ.. విమర్శల జడివాన కురిపించారు. వీటన్నింటినీ మించి.. శ్రీలంక పరిస్థితులు వివరిస్తాం అంటూ అఖిలపక్షానికి పార్టీలను పిలిచి.. ఏయే రాష్ట్రాలు ఎంతెంత అప్పులు చేశాయో చెప్పడం ఏంటంటూ కేంద్రమంత్రిని నిలదీశారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా.. కేంద్రం వైఖరిని తప్పుపట్టారు. ఇంత జరిగే సరికి కేంద్రం తోకముడవాల్సి వచ్చింది.
వారు తయారు చేసుకున్న అప్పుల లెక్కల పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఆపేసి.. శ్రీలంక పరిస్థితులు కొంత వివరించి.. కార్యక్రమాన్ని మమ అనిపించారు.
ఒకవైపు కేంద్రం ఇంత దారుణంగా.. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంటే.. సందట్లో సడేమియా అన్నట్టుగా.. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. ఆర్థిక క్రమశిక్షణ లేని రాష్ట్రాలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేయడం తమాషా. ఆ మాట ద్వారా.. వైసీపీ మీద కేంద్రం చర్యలు తీసుకోవాలని, ఆ రకంగా ఏపీ పరువు తీయాలనేది ఆయన లక్ష్యమేమో తెలియదు గానీ.. కేంద్రం అంటే రాష్ట్రాల మీద పెత్తనం చేసే పెద్దన్న కాదని ఈ ఎంపీగారు కనీస జ్ఞానం కలిగి ఉండాలి.