ఇటీవల కాలంలో కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కరోనా వైరస్ నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం అనే లోపే మరో కొత్త వైరస్ దడ పుట్టిస్తోంది. ఆఫ్రికా దేశం బురుండిలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. బజిరో ప్రాంతంలో ఈ వైరస్ సోకిన 24 గంటల్లోనే ముగ్గురు వ్యక్తులు ముక్కు నుండి రక్తస్రావంతో మరణించినట్లు తెలుస్తోంది.
వైరస్ సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, వాంతులు, నీరసం లక్షణాలు కనిపించినట్లు వైద్యులు తెలిపారు. ఇది వైరస్ బగ్ గా కనిపిస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఎబోలా లేదా మార్ బర్గ్ వైరస్ అని అనుమానం వ్యక్తం చేసిన ఆ వైరస్ కాదని ఆ దేశ ఆరోగ్య అధికారులు తెలిపారు.
ఈ నెల ప్రారంభంలో టాంజానియాలో మార్ బర్గ్ వైరస్ వ్యాప్తి చెందిందని.. ఇతర దేశాలు అప్రమత్తంగా ఉండాలని డబ్యూహెచ్ఓ హెచ్చరించింది. కాగా గతంలో ఆఫ్రికాలో ఎబోలా వైరస్ మారణహోమం సృష్టించింది. వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. ఇప్పుడు రెండు వైరస్ల లక్షణాలతోనే కొత్త వైరస్ ఉండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.