ఉక్రెయిన్ చెప్పే నీతి.. యుద్దంతో బావుకునేది ఏమిలేదు!

అప్పుడు అటు సైన్య స‌హ‌కార‌మూ లేక‌, ఇక గ‌నులూ కోల్పోయి, యుద్ధం కొన‌సాగించే స్తోమ‌త లేక స‌ర్వ‌త్రా ఉక్రెయిన్ కుదేలు కావొచ్చు!

ప్ర‌పంచ ప్ర‌స్తుత స్థితిగ‌తుల్లో యుద్ధానికి కాలు దువ్వ‌డం అనేది , లేదా చ‌ర్చ‌ల‌తో కాకుండా యుద్ధాలను ఎదుర్కొంటామంటూ ఆవేశ పడితే ఎలాంటి ప‌రిస్థితులు ఉంటాయో ఉక్రెయిన్, ర‌ష్యాలు స‌జీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మాన‌వాళి చ‌రిత్ర‌లో జ‌రిగిన ఎన్నో యుద్ధాలు ఇలాంటి సందేశాల‌నే ఇచ్చినా, భూభాగకాంక్ష‌తో కానీ, ప్ర‌తిష్ట‌కు పోయి కానీ.. యుద్ధాల‌ను కొని తెచ్చుకుంటే సాధించేది శూన్య‌మ‌ని ర‌ష్యా, ఉక్రెయిన్లు సందేశం ఇస్తూ ఉన్నాయి. వాస్త‌వానికి మూడేళ్లుగా జ‌రుగుతున్న ఈ యుద్ధం ఎప్పుడో ఈ సందేశాన్ని ఇచ్చింది. అయితే ఈ యుద్ధ ప‌రిణామాల్లో భాగంగా తాజా ప‌రిణామాలు ప్ర‌పంచం అర్థం చేసుకోవాల్సి సందేశాన్ని చాటుతూ ఉన్నాయి.

ముందుగా ట్రంప్ గ‌ద్దెనెక్కాకా అమెరికా యూట‌ర్న్ తీసుకుంది. ఉక్రెయిన్ కు ఇన్నాళ్లూ బోలెడంత స‌హ‌కారం ఇచ్చిన అమెరికా, ఇప్పుడు ఐక్య‌రాజ్య‌స‌మితి వేదిక‌గా ఉక్రెయిన్ కు వ్య‌తిరేకంగా నిల‌డింది. అమెరికా ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మంటూ ట్రంప్ ఉక్రెయిన్ కు ఝ‌ల‌క్ ఇచ్చాడు. దాదాపుగా ర‌ష్యా అనుకూల టర్న్ తీసుకున్నాడు. ఈ ప‌రిణామంతో ఉక్రెయిన్ కు గ‌ట్టి ఝ‌ల‌క్ త‌గిలింది. అదే అనుకుంటే.. ఇప్పుడు ఇన్నాళ్లూ ఉక్రెయిన్ కోసం పెట్టిన ఖ‌ర్చును రాబ‌ట్ట‌డం మీద దృష్టి పెట్టాడు ట్రంప్. అందులో భాగంగా ఉక్రెయిన్ లో ఉన్న గ‌నుల మీద అథారిటీని రాయించుకుంటూ ఉన్నాడు! ఉక్రెయిన్ కోసం అమెరికాఇప్ప‌టి వ‌ర‌కూ కొన్ని వంద‌ల బిలియ‌న్ డాల‌ర్ల డ‌బ్బును ఖ‌ర్చు పెట్టింద‌ట ఈ యుద్ధంలో! మ‌రి అంత డ‌బ్బునూ ఏదో స‌ర‌దా కోసం ఖ‌ర్చు పెట్టిన‌ట్టు కాద‌ని, లేదా ర‌ష్యాను ఓడించే ప్ర‌తిష్ట కోసం పెట్ట‌లేద‌న్న‌ట్టుగా అమెరికా స్పంద‌న ఉంది. ఉక్రెయిన్ లో ఉన్న గ‌నులు, ఖ‌నిజాల మీద అథారిటీని రాయించుకుని.. వాటితో వ్యాపారం చేసుకోవ‌డానికి అమెరికా సిద్ధం అయ్యింది.

అస‌లుకు ఆ యుద్ధ‌మే ఎటూ తెగ‌లేదు! ఇంత‌లోనే అమెరికా గ‌నుల మీద అథారిటీ అంటోంది. ఇప్ప‌టికే ఉక్రెయిన్ పాల‌కులు అమెరికా వెళ్లారు. ఇన్నాళ్లూ అమెరికా చేసిన సాయానికి కృత‌జ్ఞ‌త‌గా గ‌నుల మీద అథారిటీ ఇవ్వ‌డానికి వారు కూడా ఎలాంటి అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డం లేదు! అంతేకాదు.. త‌మ‌కు స‌హ‌కారం అందిస్తే.. దేశంలోని యావ‌త్ గ‌నుల మీద హ‌క్కుల‌ను ఇవ్వ‌డానికి కూడా వారు వెనుకాడ‌ని ప‌రిస్థితి!

ఉక్రెయిన్ కు నాటో స‌భ్య‌త్వం అనే ద‌గ్గ‌ర నుంచి ఈ వివాదం యుద్ధం ట‌ర్న్ తీసుకుంది. ఉక్రెయిన్ నాటోలో చేర‌కూడ‌ద‌ని ర‌ష్యా ఆదేశిస్తోంది. అయితే ర‌ష్యా చెప్పింది త‌నెందుకు వినాల‌నే త‌త్వంతో ఉన్న ఉక్రెయిన్ పాల‌కుల‌కు అమెరికా, ఇత‌ర నాటో దేశాలు ఆజ్యం పోశాయి. ఇప్పుడు ట్రంప్ ఏమో.. ఉక్రెయిన్ కు నాటో స‌భ్య‌త్వం అనేది మ‌రిచిపోవాల‌ని అంటున్నాడు! ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకునే ప్ర‌స‌క్తి లేద‌ని, ఈ విష‌యంలో నాటోలోని ఇత‌ర స‌భ్య దేశాలు కూడా ఇలాంటి ప్ర‌తిపాద‌న‌ను మ‌రిచిపోవాల‌ని ట్రంప్ స్ప‌ష్టం చేస్తున్నాడు! మ‌రి నాటో స‌భ్య‌త్వం కోస‌మే ఉక్రెయిన్ ప్ర‌తిష్ట‌కు పోయి యుద్ధం మొద‌లుపెట్టింద‌నుకుంటే.. ఇప్పుడు నాటో దేశాలే వ్య‌తిరేకం అంటున్నాయి! ఇలా ర‌ష్యా ప్ర‌తిష్ట అయితే నెగ్గింది. అది కూడా ట్రంప్ వ‌ల్ల‌. నాటో స‌భ్య‌త్వం కోసం ఎగ‌దోసింది అమెరికానే, ఇప్పుడు నాటో కు నో అంటున్న‌దీ అమెరికానే! మ‌ధ్య‌లో ర‌ష్యా చేసింద‌ల్లా ఉక్రెయిన్ విధ్వంసం మాత్ర‌మే!

అయితే ర‌ష్యా కూడా ఈ యుద్ధంలో చాలా కోల్పోయింది. బోలెడంత సైన్యాన్ని, మూడు సంవ‌త్స‌రాల యుద్ధం ఖ‌ర్చు ర‌ష్యాకు భారం. అయితే ఉక్రెయిన్ పై ఆధిప‌త్యం సాధించ‌లేదు! ఏదో ట్రంప్ మూలంగా ర‌ష్యా కోరుకున్నది జ‌రుగుతూ ఉంది. అయితే యుద్ధం ఆప‌డం ఎలాగో కూడా ఇప్పుడు ర‌ష్యాకు అంతుబ‌డుతున్న‌ట్టుగా లేదు. బ‌హుశా ట్రంప్ ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తిస్తూ ర‌ష్యా విర‌మించుకుంటే ఎంతో కొంత ఖర్చు త‌గ్గుతుంది. ప్ర‌తిష్ట‌కు పోయి ఇంకా లాగినా పెద్ద ప్ర‌యోజ‌నాలు క‌న‌ప‌డ‌టం లేదు. బ‌హుశా అమెరికా వ‌లే ర‌ష్యా కూడా ఇప్పుడు ఉక్రెయిన్ గ‌నులు, ఖ‌నిజాల మీద క‌న్నేయ‌వ‌చ్చు. అయితే ఉక్రెయిన్ లో ర‌ష్యా ఆక్ర‌మించిన భూభాగం కూడా త‌క్కువ‌లాగే ఉంది. మ‌రి రేపు ఆ ఖ‌నిజాల కోసం అమెరికా ఉక్రెయిన్ మీద ప‌డితే.. అప్పుడు అక్క‌డ నుంచి ర‌ష్యాను త‌రిమి కొట్టడం అమెరికా ప‌ని కావొచ్చు!

ఏతావాతా ఉక్రెయిన్ ప‌రిస్థితే ద‌య‌నీయం. ఒక‌వైపు దేశం ధ్వంసం అయ్యింది, పౌరులు ఇక్క‌ట్ల పాల‌య్యారు. యుద్ధం వ‌ల్ల భారీ ఖ‌ర్చు. రెచ్చ‌గొట్టి పెట్టుబ‌డి పెట్టిన అమెరికాకు ఇప్పుడు గ‌నుల‌ను, ఖ‌నిజాల‌ను రాయిస్తూ ఉంది. ఇంకా స‌హ‌కారం కావాల‌ని అర్థిస్తూ ఉంది. ఎవ‌రైనా స‌హ‌కారం ఇస్తే వారికి మిగిలిన గ‌నులు, ఖ‌నిజాలు అంటూ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చుకునే ప‌రిస్థితుల్లో ఉంది ఉక్రెయిన్. ఇంత‌జేసీ ర‌ష్యా నుంచి ఇంకా ముప్పును ఎదుర్కొనాల్సి ఉంది. ఇప్పుడు అమెరికా పెట్టిన పెట్టుబడుల వ‌ర‌కూ ఖ‌నిజాల‌పై హ‌క్కులు తీసుకుని, ఉక్రెయిన్ పాటికి దాన్ని వ‌దిలేసినా పెద్ద ఆశ్చ‌ర్యం లేదు. అప్పుడు అటు సైన్య స‌హ‌కార‌మూ లేక‌, ఇక గ‌నులూ కోల్పోయి, యుద్ధం కొన‌సాగించే స్తోమ‌త లేక స‌ర్వ‌త్రా ఉక్రెయిన్ కుదేలు కావొచ్చు! ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఉక్రెయినే కాదు.. కోరి యుద్ధాల‌కు కయ్యం దువ్వుకుంటే ఏ దేశం ప‌రిస్థితి అయినా అంత‌క‌న్నా గొప్ప‌గా ఉండే ప‌రిస్థితులు క‌న‌ప‌డ‌టం లేదు!

16 Replies to “ఉక్రెయిన్ చెప్పే నీతి.. యుద్దంతో బావుకునేది ఏమిలేదు!”

  1. పెట్టుబడిదారు దేశాని పెట్టుబడి దారులని నమ్మిన ఏ దేశమైనా మనుషులు అయిన ఇదే గతి పాలువుతారు

  2. శవాల మీద పేలాలు ఏరుకునే బాపతు అమెరికా ది . ప్రపంచం లో ఉన్న అన్ని ఖనిజాలు సంపద తనకే చెందాలి . అందరూ డాలర్ ని వాడాలి. తన దగ్గరే ఆయుధాలు కొనుక్కోవాలి. యుద్ధం కూడా వాళ్ళకి నచ్చినట్టే చేయాలి. యుద్ధం ఎప్పుడు మొదలు పెట్టాలి ఎలా ఆపాలో తానే చెప్తుంది. ఉగ్రవాద సంస్థలకు ఫండ్స్ కూడా ఇస్తుంది . మళ్లీ శాంతి ప్రవచనాలు చెప్తుంది. ఇది పక్కా నిరంకుశం . దీన్ని ఒంటరి చేయాలి వీలైతే లేపేయాలి .

  3. మన విశ్వగురు పకోడీ గుజ్జు రాజా వారు గత మూడేళ్లలో ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలు చేసి యుద్ధం ఆపేస్తా అన్నాడు , ఆపేసి ఉంటె పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు అక్కడ ఉన్న అమూల్య ఖనిజ సంపద కూడా మన సొంతం అయ్యేది

  4. ట్రంప్ ఆటిట్యూడ్ చాలా వరస్ట్ గా ఉంది . రష్యా కి ఫ్యూచర్ లో చుక్కలు చూపిస్తారు . సంక్షోభానికి దారి తీసేలా ఉంది. యూరోప్ ని నాశనం చేసే ఎత్తుగడ ఇది.

  5. ఇప్పుడు గతం లో లాగా అమెరికా కు ఉండదు వాళ్ళను ఇతర దేశాలు నమ్మాలంటే ఆచితూచి వ్యవహరిస్తాయి అమెరికా ఆధిపత్యం క్రమంగా తగ్గిపోవటం ఖాయం

  6. khanijalu vaadukunna okay kaani Russia nunchi inka elanti threat vundadhu ane agreement meedha sign cheyinchandi ante maathram adhela kudurathadhi antunnadu ee kampu vedhava..vunde 4yrs ki enduku intha duraashano artham kadhu

Comments are closed.