రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైనట్టే కనిపిస్తోంది. ఇందులో భాగంగా శాసనసభ సమావేశాల్లో భాగంగా చివరి రోజైన ఐదో రోజు చేసిన తీర్మానమే నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ సమ్మితితోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను, తేదీలు ప్రకటించేలా పంచాయతీరాజ్ చట్టంలో అవసరమైన నిబంధనలు పొందుపరిచేలా శాసనసభ శుక్రవారం తీర్మానించింది. రెండు పేజీల ఈ తీర్మానాన్ని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ప్రవేశ పెట్టారు. పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ ఒంటెత్తు పోకడలతో వ్యవహరించడం సరికాదని తీర్మానంలో పేర్కొనడం గమనార్హం.
ఈ ఏడాది మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా అర్ధాంతంగా వాయిదా వేయడంతో సమస్య మొదలైంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పు పట్టింది.
ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ తొలగింపునకు దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం-1994లోని సెక్షన్ 200ను సవరిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ నెంబర్ 5 జారీ చేసింది. ఈ సెక్షన్ ప్రకారం ఎస్‌ఈసీగా కనీసం ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో పని చేసిన రిటైర్డ్ ఐఏఎస్‌ను నియమించాల్సి ఉంది.
దాన్ని సవరించి రిటైర్డ్ హైకోర్టు జడ్జిని నియమించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమి షనర్ పదవీకాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు ప్రభుత్వం కుదించింది. గరిష్ఠంగా మరో విడత (మూడేళ్లు) పొడిగింపు ఇవ్వొ చ్చని పేర్కొంది. ఈ నిబంధనల ప్రకారం నిమ్మగడ్డను ప్రభుత్వం వెంటనే పదవి నుంచి తప్పించింది.
ఇది అనేక మలుపులు తిరిగి, న్యాయస్థానం ఆదేశాలతో చివరికి నిమ్మగడ్డను ఎస్ఈసీగా ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత కూడా నిమ్మగడ్డ, ప్రభుత్వం మధ్య రగడ కొనసాగుతోంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నట్టు స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
ఎలాగైనా పంచాయతీ ఎన్నికలను అడ్డుకోవాలనే పట్టుదల రాష్ట్ర ప్రభుత్వంలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం శాసనసభలో పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ తీర్మానం చేయడం ఆసక్తి కలిగిస్తోంది. మరోసారి ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య జగడానికి ఈ తీర్మానం కారణం కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ అని ఇప్పటికే కోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అలాంటప్పుడు ఆ సంస్థకు సంబంధించిన హక్కుల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఎంత మాత్రం చట్టానికి నిలుస్తుందోననే అనుమానాలు లేకపోలేదు.
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టానికి సవరణ తీర్మానం ఒకసారి పరిశీలిద్దాం.
“రాజ్యాంగబద్ధ సంస్థల స్వాతంత్ర్యాన్ని , వాటి అధికారాలను శాసనసభ గుర్తిస్తుంది. వాటిపై సభకు గౌరవం ఉంది. అదే సమయంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోకుండా, రాజ్యాంగబద్ధ సంస్థలు ఏకపక్షంగా వ్యవహరించడమూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమే. పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల షెడ్యూల్, తేదీలను రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితోనే ఎస్ఈసీ నిర్ణయించాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలోని 197(6) నిబంధన చెబుతోంది.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలో అలాంటి నిబంధన లేదు. అందుకే రాష్ట్రంలో అవాంఛనీయ పరిస్థితి నెలకొంది. ఎస్ఈసీ ఏకపక్ష ధోరణిని సుప్రీంకోర్టు కూడా గుర్తించింది. పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలను ఎస్ఈసీ వాయిదా వేసిన నేపథ్యంలో తదుపరి ఎన్నికల తేదీలను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాకే నిర్ణయించాలని సూచించింది. రాష్ట్రంలో ఇకపై అలాంటి పరిస్థితులు తలెత్తకుండా పంచాయతీరాజ్ చట్టంలో తగిన నిబంధనలు పొందుపరచాలి” అని తీర్మానంలో పేర్కొన్నారు.
ఒక వైపు రాజ్యాంగబద్ధ సంస్థల స్వాతంత్ర్యాన్ని, వాటి అధికారాలను శాసనసభ గుర్తించడంతో పాటు గౌరవిస్తుందంటూనే… ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా తీర్మానం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను ఒక వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుండడం వల్లే అసలు సమస్యగా రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.
అతనో రాజ్యాంగ వ్యవస్థకు ప్రతినిధి అనే విషయాన్ని జగన్ సర్కార్ గుర్తించడానికి నిరాకరించడం వల్లే సమస్య రోజురోజుకూ జఠిలమవుతోందంటున్నారు. శాసనసభలో తాజాగా చేసిన తీర్మానం చివరికి ఏ మలుపు తిరగనుందో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది. ఏది ఏమైనా నిమ్మగడ్డ ఆ పదవిలో ఉన్నంత వరకూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జగన్ సర్కార్ ససేమిరా అంటోందన్న విషయం బహిరంగ రహస్యమే.