వైద్య రంగంలో అద్భుతం. ఏడేళ్ల క్రితం ఓ వైద్యుడి ముందు జాగ్రత్తతో దాచిన వీర్యంతో ఆ దంపతులకు పండంటి బిడ్డ జన్మిం చింది. కేన్సర్ బారిన పడి…తిరిగి అతను కోలుకున్నప్పటికీ, సంతానం పొందే అదృష్టాన్ని కోల్పోయినప్పటికీ, ఓ ముందు జాగ్రత్త ఆ దంపతులకు మధురానుభూతిని మిగిల్చింది.
2012లో 23 ఏళ్ల యువకుడికి వివాహం జరిగింది. కొన్ని రోజులకే అతను తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. వైద్య పరీక్షల్లో అతను కేన్సర్‌బారిన పడినట్టు నిర్ధారణ అయింది. ఛాతీ, ఊపిరితిత్తుల మధ్య మెడియాస్టినల్ ట్యూమర్ (కేన్సర్)తో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో ఆ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అయితే ట్రీట్‌మెంట్‌లో ఎదురయ్యే దుష్ప్రభావాలతో సంతాన శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు గుర్తించారు.
ఆ విషయాన్ని అతనికి చెప్పి ఓ వైద్యుడు ముందస్తుగా అప్రమత్తం చేశాడు. దీంతో బాధితుడైన ఆ యువకుడు ట్రీట్‌మెంట్‌కు ముందే వీర్యాన్ని ఒయాసిస్ ఫెర్టిలిటీ బ్యాంకులో భద్రపరిచాడు. అనంతరం ట్రీట్‌మెంట్ తీసుకున్నాడు. ఏడాది క్రితం కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. కానీ వైద్యులు ముందే హెచ్చరించినట్టు కిమోథెరపీ, రేడియోథెరపీ మోతాదుల కారణంగా తండ్రి అయ్యే సామర్థ్యాన్ని కోల్పోయాడు.
ఈ నేపథ్యంలో ముందుగా భద్రపరచుకున్న వీర్యం ద్వారా సంతానం పొందాలని దంపతులు నిర్ణయించుకుని ఒయాసిస్ ఫెర్టిలిటీని సంప్రదించారు. ఐసీఎస్‌ఐను మాక్స్ (మాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ సార్టింగ్) వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞా నాన్ని ఉపయోగించి 2019లో పిండాన్ని సృష్టించి . మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెట్టారు. ఆ మహిళ తాజాగా పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవలే ఆస్పత్రి నుంచి తల్లీబిడ్డలు డిశ్చార్జయ్యారు.