పత్రం కనే స్వప్నమే పుష్పం. గింజ లేకుండా నేల వుండగలదు. నేలలేని గింజ బతకదు. రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు కనిపిస్తాయి. జీవితంలోని స్పీడ్ బ్రేకర్లు శ్రేయోభిలాషుల రూపంలో వుంటాయి. అంతా మంచే కోరుకుంటారు. కానీ చెడ్డ ఎందుకు రాజ్యమేలుతుందో చెప్పరు.
గుంపుగా వచ్చే హైనాల ముందు గొర్రెల కాపరి బతకడు. మేకల మెడలో తాయత్తు కడితే తోడేలు కనికరించదు. మెడ పొడుగ్గా ఉన్న జిరాఫీకి కాళ్ల కింద జరిగేది అర్థం కాదు. వేట చేతకాని సింహం కుక్కల చేతిలో చనిపోతుంది.
అతి తెలివి వంటగాడు మసాల వాసనకి మూర్ఛపోయాడట. వంద రూపాయల అవినీతికి, పది వేల ఖర్చుతో విచారణ చేస్తే అది ఉత్తమ పాలన. ఊరగాయ వడ్డించి విందు భోజనమని పత్రికా ప్రకటనలు ఇస్తే గుడ్ గవర్నెస్.
సముద్రమే చూడని వాడు తిమింగలాన్ని పడతా అన్నాడట. మూత దానం చేసి సీసాను కొట్టేసేవాడు ఆధునిక కర్ణుడు. గద పట్టిన భీముడితో గరిట పట్టించడమే విధి లీల.
గొర్రెలు కత్తి పడితే బలిపీఠాలు తిరగబడతాయి. ముహూర్తం రోజు స్క్రిప్ట్‌ని వెతికేవాడే క్రియేటివ్ డైరక్టర్. కాపీ రాగాన్ని కూడా కాపీ చేసేవాడే సిసలైన మ్యూజిక్ డైరెక్టర్. పితూరీలు చెప్పేవాడే సిసలైన ప్రాజెక్ట్ మేనేజర్.
యజమానికి కీ ఇచ్చేవాడికి కీ బోర్డు తెలియకపోయినా ఫర్వాలేదు. కంచర గాడిదకి కళ్లెం వేస్తే కళ్యాణి గుర్రంగా మారదు. వాసన బట్టి ఉడుకుతున్నది ఏందో చెప్పగలిగిన వాడే పొలిటీషియన్. పావురం చెప్పే నీతి కథని వేటగాడు వినడు.
సంపద ఉన్న ఇళ్లలోకి మారువేషంలో యుద్ధం ప్రవేశిస్తుంది. శోకించే కళ్లలోంచి శాపం పుడుతుంది. కూరలో ఉప్పు, మనుషుల తప్పు మితిమీరితే ముప్పు. నువ్వెక్కిన బస్సులో డ్రైవర్ వుండడు. రైలు ఎందరిని తీసుకెళ్లినా, దాన్ని తీసుకెళ్లే వాడు ఒకడు వుండాల్సిందే. కత్తి వైపు ఉన్నవాడే కరుణ గురించి ఎక్కువ ప్రచారం చేస్తాడు.
వాస్తవం మరిచిపోవాలంటే అధివాస్తవికతలో జీవించు. ఎదుటి వాళ్లకి నరకం సృష్టించేవాడే స్వర్గం కోసం కలలు కంటాడు. అప్రమత్తంగా వుండు. విషపాత్రలతో ఎందరో ఎదురు చూస్తున్నారు.
తొందరపడకు. చురకత్తులకి గులాబీలు కాస్తున్నాయి. సరళం, గరళం రెండూ ఒకటే. సుడిగుండంలో సున్నాలు వెతికేవాడే నిజమైన శూన్యవాది.
ప్రారంభం నుంచి ముగింపు వరకు ఏమీ అర్థం కాకపోతే అదే అర్థవంతమైన సినిమా. రియల్ లైఫ్‌లో ఐటం సాంగ్ కోసం ఎదురు చూసే వాడు స్వాప్నికుడు.
కాగితం పడవకి తెడ్డు తయారు చేయడమే కార్పొరేట్.
ఒక బ్యాంక్‌కి ఎగ్గొడితే జప్తు, వంద బ్యాంకులకి ఎగ్గొడితే జంప్.
రాక్షసులు ఫుల్ సూట్‌లో దర్శనమిస్తే ఆధునిక పురాణం. అంగీ దానం చేసి అంగ వస్త్రం లాగేస్తే అది ప్రభుత్వ పథకం.
భూమి ఎండిపోతే రైతు కళ్లు తడుస్తాయి.
ఇంద్రధనస్సు అద్భుతమే. అందుకే క్షణ కాలమే వుంటుంది.
ఇంజన్ లేని బోగీలో సీటు దొరికించుకున్నావ్. హ్యాపీ జర్నీ.
జీఆర్ మహర్షి
modati rendu padalu chusi mere rasaru ani artham aipoindi sumiii
Good one.ఇంజన్ లేని బోగీలో సీటు దొరికించుకున్నావ్. హ్యాపీ జర్నీ the best
ఇంజన్ లేని బోగీలో సీటు దొరికించుకున్నావ్. హ్యాపీ జర్నీbagundi
ఇంజన్ లేని బోగీలో సీటు దొరికించుకున్నావ్. హ్యాపీ జర్నీ
ప్యాలస్ లి వున్న బూమ్ బూమ్ సీసా కాళీ అయినట్లు వుంది