టార్గెట్ 175.. కొడతారా? లేదా?

షూటింగ్ ప్రాక్టీసు చేయడానికి టార్గెట్ బోర్డును దూరంగా నిలబెడతారు. దానిమీద, ఒకే కేంద్రబిందువుతో అనేక వృత్తాలు గీసిఉంటాయి. కేంద్రబిందువు 11.5 మిల్లిమీటర్లు ఉంటుంది. బుల్లెట్ దానిని తాకితే.. 10 పాయింట్లు వస్తాయి. తాకకపోతే కొంపలు…

షూటింగ్ ప్రాక్టీసు చేయడానికి టార్గెట్ బోర్డును దూరంగా నిలబెడతారు. దానిమీద, ఒకే కేంద్రబిందువుతో అనేక వృత్తాలు గీసిఉంటాయి. కేంద్రబిందువు 11.5 మిల్లిమీటర్లు ఉంటుంది. బుల్లెట్ దానిని తాకితే.. 10 పాయింట్లు వస్తాయి. తాకకపోతే కొంపలు మునిగిపోవు.. తర్వాతి వృత్తాన్ని తాకితే 9 పాయింట్లు వస్తాయి. అది అరుదుగా తాకుతుంది. కానీ.. విన్నర్స్ ఎక్కువగా ఎక్కువ షాట్స్ లో 9 పాయింట్లు స్కోర్ చేసేవాళ్లే ఉంటారు. కానీ గమనించాల్సింది ఏంటంటే.. ప్రతి ఒక్కరూ ప్రతి షాట్ కూ.. 10పాయింట్ల కేంద్రబిందువును మాత్రమే టార్గెట్ చేస్తుంటారు!

జగన్ చేతిలో ఇప్పుడు గన్ ఉంది. ‘700 డేస్’ షూటింగ్ రేంజిలో ఆయన తన టేలెంట్ పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అంతదూరం అంటే స్నైపర్ షాట్ తీసుకోవాల్సిందే! మామూలు రైఫిల్ షూటింగ్ కాదది. స్నైపర్ షాట్ కి ఇంకా చాలా అంశాలు కలిసి రావాలి. గాలి ఎటువైపు నుంచి వీస్తోంది? ఎంత వేగంతో వీస్తోంది? గాలిలో తేమ, ఉష్ణోగ్రత ఎంత ఉంది? ఇలాంటివన్నీ కలిపి ఆ షాట్ ‘అక్యురేట్’గా టార్గెట్ ను ఛేదించడాన్ని డిసైడ్ చేస్తాయి. మనకు కామెడీగా అనిపిస్తుంది గానీ.. స్నైపర్ షాట్ తీసుకునేటప్పుడు.. షూటర్ గుండె కొట్టుకునే వేగం, శ్వాస తీసుకునే వేగం కూడా షాట్ ను ప్రభావితం చేస్తాయి.

మరి ‘టార్గెట్ 175’ అంటున్న జగన్మోహన్ రెడ్డి ఈ స్నైపర్ షాట్ సక్సెస్ ఫుల్ గా తీసుకోవడానికి.. ఏయే అంశాలు ఉపయోగపడతాయి? ఏ ఇతర అంశాలు ఎలా ప్రభావితం చేస్తాయి. గ్రేట్ ఆంధ్ర విశ్లేషణాత్మక పరిశీలన కథనం!

నూటికి నూరు మార్కులు సాధించాలని టార్గెట్ పెట్టుకునే స్టూడెంట్స్ మనకు చాలా మంది కనిపిస్తుంటారు. చాలా మంది దానిని సాధిస్తుంటారు కూడా. కానీ.. నూటికి నూరుశాతం సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకునే రాజకీయ పార్టీ చరిత్రలో ఒక్కటి కూడా కనిపించదు. మొట్టమొదటి సారి.. ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రాబోయే ఎన్నికల్లో మనం ‘వందకి వందశాతం’ కొట్టాలనే టార్గెట్ మాట ఎత్తారు? ఇది చాలా సాహసం! సాధారణంగా ఇలాంటి మాటలు అతిశయంగా కనిపిస్తాయి. ఏమాత్రం మిస్ ఫైర్ అయినా.. నవ్వుల పాలు అవుతారు! ఆ సంగతి జగన్ కు తెలియనిది కాదు. కానీ ఏ ధైర్యంతో ఆ మాట అన్నారు? టార్గెట్ ను ఎలా రీచ్ అవుతారు? 

సాధారణంగా ఇలాంటి మాటను ఏ పార్టీ కూడా ఎన్నడా పలకకపోవడానికి కారణం.. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఫలితాలను రకరకాల ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి. కులం, మతం, వర్గం వంటి అనేక కారణాలు ఉంటాయి. అలాగే.. కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు చాలా స్ట్రాంగ్ ఉంటారు. వారికి స్ట్రాంగ్ హోల్డ్ అనే ఉద్దేశంతో.. వాటిపై మిగిలిన పార్టీలు అసలు ఫోకస్ పెట్టనే పెట్టవు. వాటిని వదిలేసి తమ విజయావకాశాలను లెక్కవేస్తూ ఉంటాయి. కానీ.. ఇలాంటి సాధారణ ఎన్నికల లెక్కలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి తన టార్గెట్ ను @175 గా ఫిక్స్ చేసేశారు. ఈ ధైర్యం ఆయనకు ఎలా వచ్చింది? అందుకు కారణం ఉంది.

ప్రతి ప్రభుత్వం కులాల పరంగా, మతాల పరంగా తమను నెగ్గించగల స్థిరమైన ఓటు బ్యాంక్ ను తయారు చేసుకోవడానికి.. కొన్ని పథకాలు ప్రవేశ పెడుతుంటుంది. ప్రత్యర్థి స్ట్రాంగ్ హోల్డ్ నియోజకవర్గాలను పూర్తిగా గాలికొదిలేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పరిపాలన నిరూపించిన విషయాలు వేరు. సంక్షేమ పథకాలలో కులమతాల పేర్లు ఉండవచ్చు గాక.. కానీ వాటి లక్ష్యం వేరు. కుల మత ప్రాంత వర్గాలకు అతీతంగా, అవసరంలో ఉండే ప్రతి పేదవాడినీ ప్రభుత్వం ఆదుకుంటూనే ఉంది. ఆ భరోసాను ఆయన యావత్ రాష్ట్రానికి పుష్కలంగా కలిగించారు. ప్రత్యర్థి బలమున్న చోటుపై వివక్ష చూపకుండా.. అక్కడ కూడా సమానమైన అభివృద్ధిని చూపించారు. అలాంటి సహేతుకమైన కారణాల వల్లనే ఆయన 175 టార్గెట్ పై కన్నేయగలిగారు. ప్రజలు కూడా ఈ ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా, పెత్తందారీ గుత్త రాజకీయాలకు అతీతంగా సంక్షేమ ప్రభుత్వానికి మళ్లీ పట్టం కడతారనే నమ్మకమే ఆయనతో ఈ మాట పలికించింది!

స్నైపర్ షాట్ లో రకరకాల అంశాలు సహకరించేట్లు.. ఏయే అంశాలు ప్రభావితం చేస్తాయో చూద్దాం.. 

సంక్షేమమే ఆశాకిరణం

ఆర్థికంగా సుసంపన్నంగా తులతూగే వారు తప్ప.. రాష్ట్రంలో పేదరికం కాటుకు గురైన ఏ ఒక్కరూ ప్రభుత్వ సాయం పొందకుండా లేరు. ప్రభుత్వం ఆదుకునే విషయంలో ధనిక పేద తారతమ్యాలు తప్ప.. మరొక ప్రాతిపదిక లేదు. కులమతాల పట్టింపు లేకుండా ప్రతి పేదవాడికీ సాయం అందుతూనే ఉంది. వారు జగన్ ను దేవుడిలా తలచుకుంటున్నారు. 

ప్రతి కుటుంబంలోనూ తాను ఒక సభ్యుడిగా ఉంటానని ఎన్నికలకు ముందు జగన్ చెప్పిన మాట ఇప్పుడు కార్యరూపంలో కనిపిస్తోంది. చదువుకునే పిల్లలున్న ప్రతి ఇంటిలోనూ ఆయన మేనమామ. వృద్ధులున్న ప్రతి ఇంటిలోనూ ఆయన మనుమడు. ఇలా అన్నగా, కొడుకుగా.. బహురూపాలలో ప్రతి ఇంటిలోనూ జగన్ ఇంచుమించుగా ప్రతిరోజూ వారి మాటల్లో, వారి సంతోషాల్లో, వారి ఆనందాల్లో, వారి స్థిరమైన జీవనగమనంలో నిలకడగా కనిపిస్తున్నారు. ఇదే ఆయన నమ్ముకున్న ప్రధాన కారణం.

చంద్రబాబు చేయబోతున్న సాయం..

స్నైపర్ షాట్ తో టార్గెట్ 175 ఛేదించాలంటే చంద్రబాబు సహకారం చాలా చాలా అవసరం. ఎందుకంటే.. ఇప్పటికే ఏడుమార్లు ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించిన కుప్పంలో ఆయన స్వయంగా ఓడిపోతే తప్ప ఆ టార్గెట్ జగన్ అందుకోలేరు. ఏడుసార్లు గెలిచినంత మాత్రాన ఎనిమిదోసారి గెలవాలని రూలు లేదు. ఈసారి గెలుపు సందిగ్ధం అనే సంకేతాలు ఇచ్చేలాగా.. వైసీపీ కుప్పం మునిసిపాలిటీని ఘనంగా సొంతం చేసుకుంది. కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి వివక్ష లేని అభివృద్ధి పథకాలతో ప్రజల మనసు చూరగొంది. ‘జగన్ ఎందుకు వద్దో?’ చెప్పడానికి కుప్పం ప్రజలకు కారణాలు లేవు. దేవకీదేవి అష్టమ గర్భంలో జన్మించేవాడు.. కంసుడి ప్రాణాలు తీస్తాడనే సిద్ధాంతం తరహాలనే.. చంద్రబాబుకు కుప్పంలో అష్టమ ఎన్నికలలో తలపడబోయే ప్రత్యర్థి ఆయనకు రాజకీయజీవితానికి చరమగీత పాడుతాడనే ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. 

అసలు ఈసారి ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు బరిలోకి దిగతారనే నమ్మకం కూడా లేదు. ఆయన ప్రత్యామ్నాయాన్ని అన్వేషిస్తున్నారనేది కూడా వాదన. సీటు ప్రత్యామ్నాయం మాత్రమే కాదు.. అసలు తాను బరిలోకి దిగకుండా.. రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసే పనికి పరిమితం అయ్యే చవకబారు వక్ర స్ట్రాటజీ రచనలో ఉన్నారని కూడా అనుకుంటున్నారు. ఆ మాత్రం భయం పుట్టించారంటే.. జగన్ టార్గెట్ 175 కు చాలా చాలా దగ్గరైనట్టే లెక్క.

పైగా చంద్రబాబు అనే ఫ్యాక్టర్ ఇంకా అనేక విధాలుగా కూడా ఈ టార్గెట్ రీచ్ కావడాన్ని ప్రభావితం చేయనుంది. చంద్రబాబులో ఉన్న అపరిమితమైన పుత్రవాత్సల్యం ఈసారి పార్టీకి పెద్ద గండం కానుంది. నారా లోకేష్ బాబు అనే పుత్రుడు చంద్రబాబును పున్నామ నరకం నుంచి తప్పించడానికి నారా లోకేష్ పుట్టి ఉండొచ్చు గానీ.. సదరు లోకేష్ మీద పుత్రవాత్సల్యమే.. తెలుగుదేశం పార్టీని పాతాళ లోకానికి తొక్కేయడానికి ప్రధానంగా కారణం కానున్నది. 

లోకేష్ చేతిలో రాష్ట్రాన్ని పెట్టాలనే చంద్రబాబు గొంతెమ్మకోరిక పార్టీ గొంతు కోయనుంది. ఆ కోరికను చంద్రబాబు చంపుకోలేరు. మామనుంచి దొంగిలించిన పార్టీ అక్కడికేదో తన సొంతమైనట్టు.. తన సొంత ఆస్తిని మరెవ్వరో తన్నుకు పోతారన్నట్టు ఆయన టెన్షన్ పడుతుంటారు. మరొకరిని అధికార కేంద్రానికి దగ్గరగా రానివ్వరు. ప్రజలు ఆదరించే వారిని పార్టీ అధికార కేంద్రం వైపు రానివ్వకుండా.. ఆయన కట్టే కుట్ర వ్యూహాల ఇనుప కుడ్యాలు.. ఆ పార్టీకే సమాధి అవుతాయని ఆయన గుర్తించడం లేదు. ఆ రకంగా జగన్ తన టార్గెట్ 175 అందుకోవడానికి చంద్రబాబు తనకు చేతనైన సాయం చేయబోతున్నారు. 

పవన్ కల్యాణ్ చేయబోతున్న సాయం..

స్నైపర్ షాట్ కు ఇతర కారణాలు కూడా కావాలి. అలాంటి వాటిలో పవన్ చేయబోతున్న సాయం కూడా ఒకటి. గత ఎన్నికలకు కొంతకాలం ముందునుంచి తన రాజకీయ వ్యక్తిత్వం మీద కప్పుకున్న ముసుగును తొలగించేసి.. పవన్ కల్యాణ్ ఇప్పుడు కొత్తగా దత్తపుత్రుడు అవతారం ఎత్తారు! ఈ దత్తపుత్రుడు చాలా పెద్ద ప్రగల్భాలే పలుకుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఒక్కటి కూడా చీలనివ్వను అంటున్నారు. ఈ దత్తపుత్రుడికి చంద్రబాబు చంకఎక్కి ఊరేగే ఉద్దేశం ఉన్నది. అయితే.. వ్యతిరేక ఓటు చీలకుండా చూడగల శక్తి ఆయనకు ఎలా ఉంటుంది. 

చంద్రబాబు నాయుడు అనే నాయకుడు, ప్రధాని నరేంద్ర మోడీ పట్ల ఎలాంటి అవకాశ వాద, సంకుచిత, వంచక వైఖరిని ప్రదర్శించారో, ఎన్నెన్ని మాటలు అన్నారో.. ప్రతిదీ బీజేపీ దళాలకు బాగా గుర్తున్నాయి. పవన్ ఎలా ఊరేగినా.. వారు ఆయనతో జట్టు కడతారని అనుకోవడం భ్రమ. ఒకవేళ కలిసినా కూడా సహకరిస్తారని అనుకోవడం ఇంకా పెద్ద భ్రమ. వారికి ఉన్న ఓటు బ్యాంకు చాలా స్వల్పం కావొచ్చు గాక.. ఆ ఓట్లు గెలిపించలేకపోవచ్చు, కానీ, ఓడించగలవు!

పవన్ కల్యాణ్ తో పొత్తు అనేది ఇవాళ చంద్రబాబుకు చాలా స్వీట్ స్వీట్ గా ధ్వనిస్తుండవచ్చు. అందుకే ఆయన పవన్ మీద వన్ సైడ్ లవ్ కురిపిస్తున్నానని, అటువైపు నుంచి ఇంకా సిగ్నల్ రాలేదని సిగ్గులేకుండా చెప్పుకుంటూ ఉండవచ్చు. అయితే.. సిగ్నల్ వచ్చి.. లవ్ పట్టాలెక్కిందంటే.. చంద్రబాబుకు దబిడి దిబిడే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే..
తనకు ఒళ్లంతా ప్రతి అంగమూ వాచిపోయినా కూడా.. అది వాపు కాదు బలమే అనుకునే మూర్ఖత్వం పవన్ కల్యాణ్ లో పుష్కలం, అపరిమితం! పొత్తుల ప్రతిపాదన చూచాయగా చేస్తున్న పవన్ కల్యాణ్.. అవి కార్యరూపం దాల్చే సమయానికి, తనకున్న 6 శాతం ఓటు బ్యాంకును 60 శాతంగా భ్రమించే అవకాశం మెండు! దానికి తగ్గట్టుగా మొత్తం స్థానాల్లో తనకు 40 నుంచి 50 శాతం సీట్లు కావాలని పవన్ కల్యాణ్ తెలుగుదేశాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉంది. 

చంద్రబాబు అందుకు ఒప్పుకోరు. బేరాలు అసంతృప్తికరంగా ముగుస్తాయి. బేరాలు ఎక్కడో ఒకచోట తెగినా.. ఎన్నికల బరిలో అసంతృప్తులు భగ్గు మంటాయి. ఒకరి వెనక ఒకరు గోతులు తవ్వడం చాలా సహజంగా జరుగుతుంది. ఇప్పుడు నెగ్గకపోతే ఇక ఎప్పటికీ నెగ్గం అనే భయపెట్టే డైలాగులను చంద్రబాబు ఎంతగా వల్లించినా గానీ.. ఎన్నికల వేళ వచ్చేసరికి ఆ పప్పులు ఉడకవు. స్థానిక నాయకులు.. తమ ప్రయోజనాలనే, తమ భవిష్యత్తునే చూసుకుంటారు. ఇదంతా జగన్ కు చాలా కలిసి వచ్చే అంశం. ఆ రకంగా పవన్ వ్యూహాలు.. జగన్ కు మేలు చేయబోతున్నాయి.

నిర్లక్ష్యం తగదు..

కారణాలన్నీ కలిసి వస్తున్నా సరే.. జగన్ నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఆయనలో కించిత్ నిర్లక్ష్యం తన టార్గెట్ 175 ను ఫిక్స్ చేసుకున్న మాటల్లోనే కనిపించింది. ఎలాగంటే.. కుప్పంలో ఎందుకు నెగ్గలేం? కుప్పం మునిసిపాలిటీ కూడా దక్కింది కదా.. అని జగన్ అన్నారు. అక్కడికేదో.. కుప్పం అనేది చంద్రబాబునాయుడు రాజ్యం అయినట్లుగా ఆయన భావించినట్లున్నారు. అలా రాజకీయంలో కుదరదు. ఇంతకు మించిన మహామహులు కూడా తమ సొంత నియోజకవర్గాల్లో దిక్కులేకుండా ఓడిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. నిజానికి కుప్పంలో గత ఎన్నికల సమయానికే చంద్రబాబు చాలా బలహీన పడిపోయారు. 

జగన్ కుప్పం మాటే ఎత్తుతున్నారంటే.. కుప్పం మీదనే ఫోకస్ పెడుతున్నారంటే.. రాష్ట్రంలో ఇతర టీడీపీ బలమైన నియోజకవర్గాలను విస్మరిస్తున్నారని అర్థం. సుమారుగా టీడీపీ చేతిలో ఉన్న 20 స్థానాల్లో చంద్రబాబు కంటె ఎక్కువ ప్రజాదరణతో నెగ్గగల నాయకులు కూడా ఉంటారు. అలాంటి సీట్ల మీద జగన్ ఫోకస్ పెంచాలి. చంద్రబాబు పని ఆల్రెడీ అయిపోయింది. ఇతర బలమైన టీడీపీ సీట్లపై కన్నేయాలి. అలా వ్యూహాత్మకంగా వెళితే, నిర్లక్ష్యానికి చోటివ్వకుండా ఉంటే టార్గెట్ 175 అందుతుంది. 

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని పెద్దలు అంటారు. అదే తరహాలో, అసాధ్యమైన లక్ష్యాలు కూడా ఉండవని జగన్ నిరూపించగలరా?

.. ఎల్. విజయలక్ష్మి