Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఏవి తండ్రీ విలువలు.. ఏల మీకీ విలాపాలు..?

ఏవి తండ్రీ విలువలు.. ఏల మీకీ విలాపాలు..?

రాజకీయ రంగం, పాత్రికేయ రంగం.. ఈ రెండు రంగాలకు సామాన్యుడి దృష్టిలో ఒక పవిత్రత ఉండేది. నిజంగానే అవి పవిత్రమైన వ్యవస్థలు. ఈ రెండు రంగాల్లోని వారు.. అచ్చంగా ప్రజలకు మేలు చేయడం కోసం పనిచేస్తుంటారనేది ఒక నమ్మకం. అందుకే ఆయా రంగాలకు ఆ గౌరవం! ఇప్పుడు రాజకీయ రంగం ఎలా ఉంది? పాత్రికేయ రంగం ఎలా వర్ధిల్లుతున్నది?

రాజకీయ పార్టీలు పాత్రికేయుల మీద దాడులకు దిగుతున్నాయి. పాత్రికేయులు కర్రలు రాళ్లు పుచ్చుకుని దాడులు చేయడం లేదు గానీ.. అంతకంటె నీచంగా తమ రాతలతో మానహననానికి పాల్పడుతున్నారు. రెండు రంగాలు కూడా పూర్తిగా దారి తప్పిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాత్రికేయుల మీద, వారి ఆఫీసుల మీద దాడి జరిగితే.. దానిని ‘ప్రత్యేకంగా’ ఖండించాల్సిన అవసరం ఏమిటి? మామూలుగా విద్వేషాలతో రగిలే రెండు వర్గాల మధ్య వ్యవహారంగానే ఎందుకు చూడకూడదు. మారుతున్న పోకడల మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘ఏవి తండ్రీ విలువలు.. ఏల మీకీ విలాపాలు..?’

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ యవనికపై రకరకాల పరిణామాలు ఉధృతంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ.. ప్రతి చిన్న అవకాశాన్ని కూడా.. ఎన్నికల సమరాంగణంలో విజయం సాధించడానికి తమకు అనుకూలంగా మలచుకోవడానికి, తమ ప్రత్యర్థులను దుర్మార్గులుగా చిత్రీకరించడానికి వాడుకుంటూ ఉంటారు. చినుకు కురిసినా జనం మురిసినా అది తమ ఘనతే అని టముకు వేసుకోవడానికీ, ఆకు రాలినా చీమ కుట్టినా అది ప్రత్యర్థుల కుట్రే అని బద్నాం చేయడానికి ప్రతి ఒక్కరూ హేతువులు వెతికే పనిలో సదా నిమగ్నులై ఉంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో చీమ చిటుక్కుమంటేనే నానా గోల చేసేసేవాళ్లు పెచ్చరిల్లుతున్న వర్తమానంలో.. కలంధారుల మీద, పత్రికా విలేకరుల మీద, ప్రతికా కార్యాలయాల మీద దాడులు జరిగితే ఊరుకుంటారా? ఊరూ వాడా ఏకం చేసేయకుండా ఉంటారా?  అదే జరుగుతోందిప్పుడు ఆంధ్రసీమలో! ఆందోళనలు రేగుతున్న మాట.. వాటిని భూతద్దంలో చూపిస్తున్న మాట అంతా నిజమే గానీ.. అందులో ఔచిత్యం ఎంత?

రాజకీయం చేసుకునే వారికి వేరే పనిలేదా? వార్తలు రాసుకునే వారి మీద దాడులకు దిగాల్సిన అగత్యం ఎందుకు ఏర్పడుతుంది? రాజకీయ ప్రత్యర్థుల మీద బురదచల్లడమూ, వారిని ఇరుకున పెట్టడమూ, వారి మీద అక్రమ కేసులు బనాయించడమూ లేదా, అలాంటివి బనాయించినట్లుగా ఆగ్రహించి ఉద్యమాలు చేయడమూ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు రాజకీయ నాయకులకు అనేకం ఉంటాయి కదా. ఇన్ని పనుల ఒత్తిడి మధ్యలో జర్నలిస్టుల గురించి పట్టించుకునేంత తీరిక వారికి ఉంటుందా? అనే సందేహాలు కూడా ఎవరికైనా కలగవచ్చు.

సాధారణంగా జర్నలిజం తరగతుల్లో సరదాగా పెద్దలు ఇలా చెబుతుంటారు. ‘రాజకీయ నాయకుడు అనేవాడు.. జర్నలిస్టుతో ఎన్నటికీ తగాదా పెట్టుకోడు. వాడిని తిడుతూ రాసినా సరే.. పిలిచి భోజనం పెట్టి పంపిస్తాడు. పొగుడు లేదా తిట్టు నాగురించి ఏదో ఒకటి రాయకుండా మాత్రం ఉండొద్దు.. అని కోరుతుంటాడు’ అని అంటుంటారు. మరి అలాంటి కల్చర్ మనకు అలవాటుండగా.. వారిమీద దాడులు చేసే దాకా వైషమ్యాలు ఎందుకు ముదురుతాయి. పాత్రికేయ రంగానికీ, రాజకీయ రంగానికీ ఈ శత్రుభావం అనేది ఈనాడే పుట్టిందా? ఇదివరలో లేదా? ఇప్పట్లో తేలే ప్రశ్న కాదు ఇది.

అసలైన మూలాల్లోకి వెతుక్కుంటూ మనం వెళ్లలేము గానీ... కొన్ని దశాబ్దాల కిందటి పరిస్థితులను గుర్తు చేసుకుందాం. అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేశారు. ఎన్నిక పోటాపోటీగా జరిగింది. చిట్ట చివరికి రాజశేఖర్ రెడ్డి నెగ్గారు. ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇలా చెప్పారు. ‘‘ఈ ఎన్నికలలో నేను కేవలం తెలుగు దేశం మాత్రమే పోరాడవలసి వచ్చి ఉంటే సులభంగానే నెగ్గేవాడిని. ఈనాడు తో కూడా సమాంతరంగా తలపడాల్సి వచ్చింది. అందుకే  కాస్త కష్టమైంది’’ అన్నారు. దీనిని బట్టి మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే ఒక పత్రిక ఒక రాజకీయ అభ్యర్థికి ప్రధాన ప్రత్యర్థిగా మారడం అనేది ఇవాళ పుట్టిన సంస్కృతి కాదు! కొన్ని దశాబ్దాల కిందటే స్పష్టంగా ఏర్పడింది. మరి ఈ మధ్యకాలంలో అలాంటి సంస్కృతి ఎంతగా మితిమీరి పెరిగి ఉండాలి? ఎంతగా విశ్వరూపం దాల్చి ఉండాలి? దానినే మనం ఇప్పుడు చూస్తున్నాం.

ఒక సారూప్యత ఉంది..

పాలిటిక్స్, జర్నలిజం రంగాలకు ఒక సారూప్యత ఉంది. ఈ రెండు రంగాల్లోని వారందరూ కూడా తాము ప్రజాసేవ కోసమే పనిచేస్తున్నాం అని చెప్పుకుంటూ ఉంటారు. ఒక రకంగా అది నిజమే. ఈ రెండు రంగాలు పురుడు పోసుకున్న తొలిరోజుల్లో అలాంటి లక్ష్యాలే వారికి ఉండేవి. ఆ లక్ష్యాలకు నిదర్శనాలు అయిన గొప్ప నాయకులు, జర్నలిస్టులు స్వాతంత్ర్యపూర్వ చరిత్రలో మనకు యెల్లెడలా కనిపిస్తారు. ఆ తర్వాత క్రమక్రమంగా పోకడలు మారుతూ వచ్చాయి.

అధికార మోహం, అక్రమ ధనార్జన అనేవి రాజకీయం లక్ష్యాలయ్యాయి. జర్నలిజం యజమానులకు ఒక వ్యాపారం అయింది. జర్నలిస్టులకు కేవలం ఒక ఉద్యోగంగా మారిపోయింది. ఈ క్రమంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనేక దశలు ఉన్నాయి. జర్నలిజంలోగానీ, రాజకీయాల్లో గానీ ఇవాళ మనకు కనిపిస్తున్న పతన రూపాలు ఒక్కసారిగా వచ్చినవి కాదు.. క్రమక్రమంగా దిగజారుతూ పోవడం వల్ల ఏర్పడిన రూపాలు. 

ఇప్పటి పరిస్థితులు ఏమిటి?

ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద, జర్నలిస్టుల మీద దాడి జరిగిందని, ఈనాడు ఆఫీసు మీద దాడిచేశారని పచ్చమీడియాలో మాత్రం వార్తలు వెల్లువెత్తాయి. జర్నలిస్టులకు మద్దతుగా ఇతర జర్నలిస్టులందరూ దీక్షలు, ప్రదర్శనలు చేస్తున్నట్టుగా వార్తలు కూడా ఆయా మీడియా సంస్థల్లో తప్ప మరెక్కడా రాలేదు.

చూడబోతే ఈ సంఘటనలను కూడా రాజకీయ ప్రయోజనాలకు ఒక ఆలంబనగా వాడుకోవడానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న తీరు మనకు కనిపిస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు మీడియా మీద దాడిచేసేస్తున్నారు.. అని గగ్గోలు పెడుతున్న సమయంలో పరిస్థితుల్ని ఓసారి లోతుగా గమనించాలి. 

‘దాడి’ ఎలాంటిదైనా గర్హించాల్సినదే

ఆందోళన చేస్తున్న వారు చాలా చిత్రంగా మాట్లాడుతుంటారు. ‘జర్నలిస్టుల మీదనే దాడిచేస్తారా?’ , ‘కలం గళం నొక్కేస్తున్నారు’ అని పదేపదే అంటూ ఉంటారు. ఇక్కడ సామాన్యులకు అర్థం కాని సంగతి ఒక్కటే. పాలకపార్టీ లేదా ఏ ఇతర రాజకీయ పార్టీ అయినా జర్నలిస్టుల మీద అని మాత్రమే కాదు.. ఏ సామాన్యుడి మీద దాడిచేసినా అది తప్పే కదా! జర్నలిస్టుల మీద దాడి అనేది ప్రత్యేకమైన తప్పు ఎలా అవుతుంది? కలం గళం నొక్కేస్తున్నారని ఆక్రోశించేవాళ్లకు సామాన్యుడి గొంతు నొక్కేస్తే పరవాలేదా అనేది ఆ సందేహం.

దాడి ఎవరి మీద చేసినా అది తప్పే. ఎవ్వరు చేసినా దానిని తప్పుపట్టాల్సిందే. జర్నలిస్టులను ఒక ప్రత్యేక కేటగిరీగా చూడాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. ఎస్సీలకు, మహిళలకు ఉన్నట్టు జర్నలిస్టుల మీద దాడులకు ప్రత్యేకమైన చట్టాలేమీ మనదేశంలో లేవు. ఇక్కడ మనం దాడుల సంగతి మాట్లాడుకుంటున్నాం.. కానీ మన దేశంలోనే మరికొన్ని ప్రాంతాల్లో ఏకంగా జర్నలిస్టులను చంపేస్తున్నారు. అలాంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. తెరవెనక్కు వెళ్లిపోతున్నాం. 

జర్నలిస్టులా? పార్టీ కార్యకర్తలా?

ఒకరి మీద మరొకరు విరుచుకుపడితే అది దాడి అవుతుంది. కానీ ఏపీలో జర్నలిస్టుల మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు చేస్తున్నది దాడులేనా? ఆ నిర్వచనం కిందికి వస్తాయా? అనేది మీమాంస. ఎందుకంటే..  ఏకపక్షంగా జరుగుతున్న వ్యవహారాలు కాదు అవి. జర్నలిస్టుల రూపంలో ఉన్న పచ్చ పార్టీ కార్యకర్తల మీద మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఇలాంటి వాటిని దాడులుగా అభివర్ణించలేం. దొమ్మీలుగా మాత్రమే పేర్కొనాలి. అవును. ఎందుకంటే.. జర్నలిస్టుల ముసుగులో వీళ్లు పాలకపక్షాన్ని బద్నాం చేయడానికి.. పచ్చదళాలకు రాజకీయ లబ్ధి అనుచిత మార్గాల్లో చేకూర్చిపెట్టడానికి కెలుకుతూ ఉంటారు. దానికి ఎవ్వరైనా సరే ప్రతిస్పందించకుండా ఎందుకుంటారు?

ఇవాళ్టి రోజుల్లో జర్నలిస్టులు జర్నలిస్టుల్లాగా ఉంటున్నారా? నిష్పాక్షికంగా ఒక్క అక్షరమైనా రాస్తున్నారా? పార్టీలే పత్రికల్ని పెట్టుకున్నాయి. పార్టీ ప్రయోజనాలకు మాత్రమే పత్రికలు కట్టుబడి ఉంటున్నాయి. పత్రికల యాజమాన్యాలు పార్టీలకు కొమ్ము కాస్తున్నాయి. ఇక ఆయా పత్రికల్లోని జర్నలిస్టు యంత్రాంగం మొత్తం ఆ పార్టీ పట్ల విధేయత చూపించుకుంటూ.. వారికోసం పనిచేయడం జరుగుతోంది. నిష్పాక్షికత ఎక్కడుంది?

ఇందుకు ఏ ఒక్క పార్టీ గానీ, ఏ ఒక్క పత్రికగానీ మినహాయింపు కానే కాదు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు సాక్షి మీడియా సంస్థల మీద ఎన్ని రకాల ఆంక్షలు విధించారో అందరికీ తెలుసు. వాళ్లను ప్రెస్ మీట్ లకు కూడా రానివ్వకుండా శత్రువుల్లాగా చూశారు. సాక్షి జర్నలిస్టులు కూడా.. చంద్రబాబును ప్రత్యర్థిలాగా చూస్తూ.. ఆయనను ఇరుకున పెట్టడమే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చేవారు. తర్వాత జగన్ సీఎం అయ్యారు. తెలుగుదేశానికి ఉన్న రెండు పత్రికలూ ఇక తమ విశ్వరూపం చూపించడం ప్రారంభించాయి.

ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల విలేకర్లు వస్తున్నారంటేనే.. అనవసరమైన సంభాషణలతో ప్రెస్ మీట్ పెట్టిన వారికి బీపీ తెప్పించడానికే వస్తుంటారనే భావన పెరిగిపోయింది అందరిలోనూ. కేవలం ప్రెస్ మీట్లకు వెళ్లే జర్నలిస్టులు మాత్రమే కాదు. టీవీ ఛానెళ్లలో డిబేట్ లు నిర్వహిస్తున్న వారు మాత్రం ఎలా ఉంటున్నారు? పార్టీ తరఫున నడిరోడ్డులో ఎదుటి పార్టీ కార్యకర్తలతో కలబడి కొట్లాడుకునే గూండాల్లాగా వ్యవహరిస్తున్నారు. డిబేట్ నిర్వహిస్తూ ప్రయోక్తగా ఉండే జర్నలిస్టు.. సంధాన కర్తగా, విరుద్ధభావాలు వ్యక్తమవుతోంటే.. వాటిమధ్య సమన్వయం చేయాల్సింది బదులుగా.. తనకు కిట్టని పార్టీ నాయకుల్ని డిబేట్ కు పిలిచి.. చొక్కా చేతులు పైకి మడిచి మీసం మెలేసి వారితో కలబడే రౌడీల తరహాలో మాట్లాడడాన్ని మనం చూస్తూనే ఉన్నాం.

జర్నలిస్టులు జర్నలిస్టుల్లాగా ఎక్కడ మిగిలిఉంటున్నారు? మీడియా సంస్థల అధిపతులు రాజకీయ పార్టీలకు కొమ్ముకాసే తైనాతీలుగా మారుతున్నారు. పార్టీల ద్వారా ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి.. తప్పుడు పెట్టుబడులతో వక్రమార్గాలు తొక్కుతూ ముందుకు సాగుతున్నారు. ఆ సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు ఆయా పార్టీల కార్యకర్తల్లాగా మారిపోతున్నారు. నిష్పాక్షికత అనేది తమకు ఒక మౌలిక లక్షణం అనే సంగతిని వారు మరచిపోతున్నారు. ప్రత్యర్థి పార్టీల మీదకు మీడియా ముసుగులో ఎగబడుతుంటారు? లేకుంటే ఇలాంటి అవాంఛనీయ ఘటనలు ఎందుకు జరుగుతాయి. 

రాజకీయ ప్రపంచమూ అంతే..

ఒక్క జర్నలిస్టులనే నిందించాల్సిన అవసరం ఏం లేదు. రాజకీయ నాయకులు కూడా అలాగే తయారవుతున్నారు. కేవలం సమాజహితానికి పనిచేస్తాం.. ప్రజలకోసం పాటుపడతాం అనే పాతకాలపు లక్ష్యాలే తమ లక్షణాలుగా ఇంకా చెప్పుకుంటూ దబాయించి బతికేస్తుంటారు.. ఈరెండు రంగాలకు చెందిన వారు కూడా. జర్నలిస్టులు రాజకీయ పార్టీల కార్యకర్తల్లాగా మారిపోతోంటే.. గూండాలు, పెట్టుబడిదారులు రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తుతున్నారు. రాజకీయ రంగం కూడా పూర్తిగా కలుషితం అయిపోయింది. కేవలం వ్యాపారం మాత్రమే తెలిసిన వారు, అడ్డదారుల్లో సంపాదించడం అలవాటుగా ఉన్నవారు.. మిక్కిలిగా రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. గూండాలను, రౌడీలను వారు పోషిస్తున్నారు. ‘ప్రజాసేవ’ అనే ఒక్క పదాన్ని పట్టుకుని అడుగుపెట్టే వారు.. ఈ రెండు  రంగాల్లోనూ కాగడా పెట్టి వెతికినా కనిపించరు.

రెండు రంగాలూ పతనం అయిపోతున్నాయి. మీడియా వ్యక్తులు అయినంత మాత్రాన.. వారిని టచ్ చేయకుండా సాగాలనే ప్రత్యేకహక్కులను కోరుకోవాలంటే.. మీడియా విలువలను పాటించే సత్ప్రవర్తన, నిష్పాక్షికతను వారు అలవరచుకోవాలి. రాజకీయ నాయకుల మీద మీడియా చెత్త రాతలతో విరుచుకుపడకుండా ఉండాలంటే.. ఆ రంగంలో నిజాయితీ గల నాయకులు రావాలి.

ఆదర్శాలు చెప్పుకోడానికి చాలా బాగుంటాయి. కానీ ఆచరణలో అంత సులువు కాదు. విలువలు దిగజారిపోయాక.. ఇప్పుడు ఈ రెండు రంగాలవారు కూడా పరస్పర విద్వేషంతో విలపించడం వల్ల ఉపయోగం ఉండదు. 

.. ఎల్ విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?