సమీక్ష‌కుల‌పై గండ్ర గొడ్డ‌లి!

స‌మీక్ష‌కుల వ‌ల్లే సినిమాలు డిజాస్ట‌ర్ అవుతున్నాయ‌ని నిర్మాత‌లంతా ఏక‌గ్రీవ అభిప్రాయానికి వ‌చ్చారు. శుక్ర‌వారం ఉద‌యం వ‌చ్చి, ఆదివారం వ‌ర‌కూ కూడా ఎదురు చూడ‌కుండా ఆత్రంగా సినిమాలు ఇంటికి వెళ్లిపోవ‌డం వెనుక స‌మీక్ష‌కుల కుట్ర‌, మోసం,…

స‌మీక్ష‌కుల వ‌ల్లే సినిమాలు డిజాస్ట‌ర్ అవుతున్నాయ‌ని నిర్మాత‌లంతా ఏక‌గ్రీవ అభిప్రాయానికి వ‌చ్చారు. శుక్ర‌వారం ఉద‌యం వ‌చ్చి, ఆదివారం వ‌ర‌కూ కూడా ఎదురు చూడ‌కుండా ఆత్రంగా సినిమాలు ఇంటికి వెళ్లిపోవ‌డం వెనుక స‌మీక్ష‌కుల కుట్ర‌, మోసం, ద్రోహం, దుర్బుద్ధి, దురుద్దేశాలు ఉన్నాయ‌ని నిర్మాత‌లంతా గ‌ట్టిగా న‌మ్మి, ఒక చ‌ట్టాన్ని తెచ్చారు. ఇక‌పై నిర్మాత‌లే త‌మ మ‌నుషుల‌తో స‌మీక్ష‌లు చేయించుకుంటారు, రాయించుకుంటారు. ఉల్లంఘిస్తే 20 ఏళ్ల జైలుశిక్ష‌.

సినిమా చూడ‌డ‌మే ఒక జైలు శిక్షైతే, దాని గురించి మాట్లాడి అద‌నంగా జైలుకెళ్ల‌డం అవ‌స‌ర‌మా? అని స‌మీక్ష‌కులు పెన్ను, కెమెరాల్ని మూసుకుని ప్ర‌శాంతంగా నిద్ర‌పోయారు.

నిర్మాత‌లు అమితానందంతో త‌మ భ‌జ‌న బృందాల్ని స‌మీక్ష‌కులుగా అలంక‌రించి థియేట‌ర్ మీద‌కి వ‌దిలారు.

“సినిమా ఎలా వుంది?”
“అదిరింది”

“హీరో ఎలా చేసాడు”
“తుక్కు లేపాడు”

“హీరోయిన్‌?”
“ద‌డ‌ద‌డ‌లాడించింది”

“మ్యూజిక్‌”
“స్పీక‌ర్లు ఊడి కింద‌ప‌డ్డాయి”

“ఫైటింగ్‌”
“దుమ్ము లేచింది”

“ఓవ‌రాల్‌గా సినిమా”
“ద‌బిడిదిబిడే”

“మీ రేటింగ్ “
“9/5”

ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి సినిమా రాలేద‌ని, తాము అద్భుతాన్ని చూస్తున్నామ‌ని ప్రేక్ష‌కులు శివ‌తాండ‌వం చేస్తున్నారు. హీరోకి 20 ఏళ్లు, నిర్మాత‌ల‌కి బ‌తికినంత కాలం గుర్తుండే సినిమా. జ‌నం తాకిడి ఎలా వుందంటే బుక్ మై షో యాప్ కూడా హ్యాంగ‌యింది.

యూట్యూబ్ స‌మీక్ష‌ని నిర్మాత ఆదేశానుసారం నిర్వ‌హించి డ‌బ్బులు తీసుకుని యాంక‌ర్ వెళ్లిపోయింది.

ఇక నిర్మాత సొంత వెబ్‌సైట్‌లో ఇలా రాసారు.

“తింటే మెద‌డు తింటా. సినిమాకి రెస్పాన్స్ మామూలుగా లేదు. కొండ గుహ‌ల్లో వుండే హీరో, లోయ‌లో ఉన్న హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. వీళ్లిద్ద‌ర్నీ త్రిశూల దారి విల‌న్ విడ‌దీస్తాడు. ప్రేమ‌జంట చివ‌రికి ఏమ‌వుతుంది? 1940లో ప్రారంభ‌మైన క‌థ 2020 వ‌ర‌కూ మూడు జ‌న్మ‌ల క‌థ‌గా న‌డుస్తుంది. హీరోహీరోయిన్లు వాళ్లే. లోకేష‌న్లు, డ్రెస్‌లు మారుతాయి. విల‌న్ అవే గ‌డ్డాలు, మీసాల‌తో వుంటాడు. “అరుప్పురే బుషారే” అని అరుస్తూ వుంటాడు. అది చంఘిజ్ కాలంలో మంగోలులు మాట్లాడే భాష‌ని డైరెక్ట‌ర్ రీసెర్చ్ చేసి క‌నిపెట్టాడు. ఈ ప‌దానికి క‌రెక్ట్‌గా అర్థం చెప్పిన ప్రేక్ష‌కుడికి ఒక ఇత్త‌డి గొడ్డ‌లి బ‌హుమానంగా ఇస్తారు.

ఈ గొడ్డ‌లి 32 వంపులు తిరిగి వుంటుంది. తొమ్మిది ర‌కాలుగా దీన్ని సాన పెట్ట‌వ‌చ్చు. ఈ ఆయుధాన్ని విల‌న్ 1980 నాటి క‌థ‌లో వాడుతాడు. ఈ గొడ్డ‌లిని విసిరిన‌పుడు ముందు సీట్ల‌లోని ప్రేక్ష‌కులు బెదిరి పారిపోవ‌డం విశేషం. దీనికో పేరుంది, గండ్ర పిడికిలి.

ఫైన‌ల్‌గా ఇదో ప్రేమ క‌థ‌. కెమెరా ప‌నిత‌నం బాగుంది. ఎడిట‌ర్ త‌న ప‌ని తాను చేసాడు. సంగీతం క‌నీసం వారం రోజులు చెవుల్లోనే వుంటుంది. న‌టీన‌టులు త‌మ ప‌రిధుల్లో న‌టించారు.

ప్ల‌స్ పాయింట్స్ః

హీరో డ్యాన్స్‌
క‌థ‌లో వేగం
హీరోయిన్ న్యూలుక్‌

మైన‌స్ పాయింట్స్ః

ఈ సినిమాలోని రెండు పాట‌లూ మైన‌స్ డిగ్రీలో షూట్ చేయ‌డం వ‌ల్ల అవేమీ లేవు.

పంచ్‌లైన్ – మెద‌డు తిన్నా ప్రేక్ష‌కులు సంతోషంగా కుర్చీలోంచి లేవ‌డం.

సొంత స‌మీక్ష‌ల‌తో థియేట‌ర్‌లు నిండిపోతాయ‌ని అనుకున్నారు. ప్రేక్ష‌కులు థియేట‌ర్ ప‌రిస‌రాల‌కు కూడా రావ‌డం లేదు. గిఫ్ట్‌లిచ్చి లోప‌లికి తోస్తే గేట్ కీప‌ర్ల‌కి డ‌బ్బులిచ్చి పారిపోతున్నారు. నిర్మాత‌లంతా మ‌ళ్లీ స‌మావేశం అయ్యారు.

“ఇన్నాళ్లు స‌మీక్ష‌కుల వ‌ల్ల సినిమాలు డ‌మాల్ అవుతున్నాయ‌ని అనుకున్నాం. ఇపుడు సొంత స‌మీక్ష‌ల వ‌ల్ల అంత‌కు మించి ద‌డేల్‌మంటున్నాయి. ఏంటి కార‌ణం? ” మండ‌లి అధ్య‌క్షుడు క‌న్నీళ్లు తుడుచుకున్నాడు.

తెల్ల‌టి గ‌డ్డం ఉన్న ముస‌లి నిర్మాత లేచాడు. ఎన్నో హిట్లు, ప్లాప్‌లు చూసిన వాడు. ఇపుడున్న స్థితిలో సినిమాలు తీస్తే గుడిముందు ఉంటాన‌ని గ్ర‌హించి, తానే ఒక గుడి క‌ట్టి అభిషేకాలు, అర్చ‌న‌లు చేస్తూ ప్ర‌శాంతంగా జీవిస్తున్నాడు.

“ఓరే పిచ్చి నిర్మాత‌లు, కోడి కోసం తెల్ల‌వార‌దు. తెల్లవారింద‌ని కోడి కూయ‌దు. డైలాగ్ అర్థం కాలేదా? మ‌న సినిమాలు మాత్రం జ‌నాల‌కి అర్థ‌మ‌వుతున్నాయా? ప్రేక్ష‌కుల‌కి జ్ఞానం పెరిగింది. జ్ఞానం త‌గ్గ‌డం వ‌ల్ల మ‌నం నిర్మాత‌ల‌య్యాం”

“లాగ్ వద్దు, పాయింట్‌కి రా” అని కొంద‌రు అరిచారు.

“రెండు డైలాగ్‌లు లాగ్ అయితేనే భ‌రించ‌లేని వాళ్లు, రెండు గంట‌లు లాగ్ తీసి జ‌నాల మీద‌కి వ‌దిలి స‌మీక్ష‌కుల మీద ప‌డ‌తారా?”

ద్వంద్వం అనేది ప్ర‌కృతి నియ‌మం. మంచి వుంటే చెడు వుంటుంది. విషం వుంటే అమృతం వుంటుంది. మంచి స‌మీక్ష‌కుడితో పాటు చెత్త‌వాడు కూడా వుంటాడు, జ‌నాల‌కి ఏది ఎంత తీసుకోవాలో తెలుసు. స‌మీక్ష‌ల వ‌ల్ల సినిమాలు ఆడ‌వు, మంచి సినిమా చావ‌దు, చెడ్డ సినిమా బ‌త‌క‌దు. స‌మీక్ష ఉత్ర్పేర‌కం మాత్ర‌మే. ఈ స‌మీక్ష‌లు లేని రోజుల్లో కూడా బ్లాక్ బ‌స్ట‌ర్స్‌, డిజాస్ట‌ర్స్ ఉన్నాయి. మంచి సినిమా చూస్తే ప్రేక్ష‌కుడు వుండ‌లేడు. వంద మందికి చెబుతాడు. చెత్త సినిమా కూడా అంతే.

సంఘ‌ర్ష‌ణ‌లోంచే క‌ళ పుడుతుంది. క‌థ పుడుతుంది. దానికి దూర‌మై గ్రాఫిక్స్ , లోకేష‌న్స్‌, సెట్టింగ్‌లు అని జ‌నాల‌కి మాయ చేస్తున్నారు.

అలంకారం చేసినంత మాత్రానా శ‌వానికి, జీవానికి తేడా తెలీకుండా పోదు. జ‌నం డ‌బ్బులు పెట్టి చూస్తున్న‌పుడు ఎవ‌డి అభిప్రాయం వాడు చెబుతాడు. గొంతు నొక్కితే మూలుగులు వస్తాయి త‌ప్ప‌, ఆర్ట్ రాదు.

చేతితో ఎవ‌డూ చేప‌లు ప‌ట్ట‌లేడు. ప‌టిష్ట‌మైన వ‌ల వుండాలి. సినిమాలో అల్లిక వుంటే ప్రేక్ష‌కుడు వాడే ప‌డ‌తాడు. వ‌ల వేయ‌డం రాక, స‌ముద్రాన్ని నిందిస్తే ఏం లాభం? వంట వండ‌డం రాకుండా తినేవాన్ని తిడితే వూరుకుంటాడా?

సామాన్యుడు రోజంతా క‌ష్ట‌ప‌డితే ఐదొంద‌లు రావ‌డం క‌ష్టం. సినిమాలు ఎక్కువ చూసేది వాళ్లే. జీవితంలో లేనిది సినిమాల్లో కావాలి. మీరు క‌ల‌లు అమ్మాలి కానీ, పీడ క‌ల‌లు అమ్మితే ఎట్లా!

“ముందు మీరు ప్రమోష‌న్ల‌లో అబ‌ద్ధాలు చెప్ప‌డం మానండి. స‌మీక్షకులు తిట్ట‌డం మానేస్తారు” అని పెద్దాయ‌న ముగించాడు.

నిర్మాత‌లు హాహాకారాలు చేసి, మ‌ళ్లీ డ‌బ్బులు పోగొట్టుకునే అన్వేష‌ణ‌లో ప‌డ్డారు.

జీఆర్ మ‌హ‌ర్షి

9 Replies to “సమీక్ష‌కుల‌పై గండ్ర గొడ్డ‌లి!”

  1. “ 1940లో ప్రారంభ‌మైన క‌థ 2020 వ‌ర‌కూ మూడు జ‌న్మ‌ల క‌థ‌గా న‌డుస్తుంది.”

    నీ నోxట్లో కిలో చక్కర పొయ్య…ఎంత సోంపైనా మాట చెప్పాడో మహర్షి. దీనిని బట్టి మహర్షి తాతల కాలం నుండి నులక మంచాలు అద్దెకు తెచ్చుకొని theater లో పరచుకొని అక్కడే స్నానపానాలు, అన్నపానీయాలు కానిచేసినట్లున్నాడు. 2020 లో కూడా ఒక అణా తీసుకెళ్లి 10 సమోసాలు అడిగితే, ఆ వర్తకుడు ఎగాదిగా చాన్స్ సరికి, ఉక్రోషంతో ఈ వ్యాసాన్ని రచించినట్లున్నాడు.

Comments are closed.