రైతు వ్యతిరేక ప్రభుత్వం చంద్రబాబుదా? జగన్‌దా?

ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి. రాజకీయాలలో అవమానం, అబద్ధం వంటి వాటి గురించి ఆలోచించకూడదు. మనం ఏమి చేశామన్నది మనమే మర్చిపోవాలి. మనం ఎన్ని అరాచకాలు చేసినా అవన్ని గొప్ప విషయాలుగా ప్రొజెక్టు చేసుకోవాలి. ఎదుటివాడు…

ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి. రాజకీయాలలో అవమానం, అబద్ధం వంటి వాటి గురించి ఆలోచించకూడదు. మనం ఏమి చేశామన్నది మనమే మర్చిపోవాలి. మనం ఎన్ని అరాచకాలు చేసినా అవన్ని గొప్ప విషయాలుగా ప్రొజెక్టు చేసుకోవాలి. ఎదుటివాడు ఎంత మంచి పనిచేసినా ఏదో ప్రమాదం జరిగిపోయినట్లు చూపాలి. ఇది ఒక సిద్ధాంతం. దీనిని బాగా నమ్మిన వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన దాదాపు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు విభజిత ఆంధ్రప్రదేశ్‌కు కూడా సీఎంగా పనిచేశారు. ఆయన అనుభవం అంతా ఎందుకు ఉపయోగిస్తున్నారంటే ఇలాంటి వాటికి అనుకోవాలి. ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఇలాంటి వ్యూహాలనే నమ్ముకుంటున్నారు. లేకుంటే ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏమంటున్నారు?

రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఆయన అన్నారు. అది కూడా టీడీపీ మీడియాలో లీక్‌ ద్వారా ప్రచారం చేయించారు. రైతు వ్యతిరేకం అంటే ఏమిటంటే కొన్నిచోట్ల విత్తనాల కోసం రైతులు ఆందోళన చేశారట. దానికి కారణం ఏమైనా కాని.. తాను చేయదలచిన ప్రచారం మాత్రం జగన్‌కు వ్యతిరేకంగా. ఒకప్పుడు ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేవారు. అప్పట్లో విద్యుత్‌ చార్జీలు పెంచితే పెద్ద ఆందోళన జరిగింది. అన్ని పార్టీలు కలిసి బషీర్‌ బాగ్‌ వద్ద చలో అసెంబ్లీ నిర్వహించాయి. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కాల్పులు జరిపితే నలుగురు మరణించారు. దానిని రైతు వ్యతిరేక ప్రభుత్వం అని కదా అనాల్సింది. మే 23 వరకు ముఖ్యమంత్రిగా విభజిత ఏపీకి ఉన్నది ఎవరు? చంద్రబాబే కదా? ఎన్నికల కమిషన్‌తో రోజూ గొడవ పెట్టుకున్నది దేనికి? తాను సమీక్ష చేయకపోతే పనులు ఆగిపోతాయని కదా?

వ్యవసాయ మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి కూడా సమీక్షలు చేశారు కదా.. మరి విత్తనాల గురించి ఎందుకు ఆలోచించలేదు. పైగా ఏపీసీడ్స్‌కు విత్తనాల తాలూకూ 328 కోట్లు ఇవ్వాలని పలుమార్లు లేఖలు రాస్తే చంద్రబాబు అసలు పట్టించుకోలేదే? దానికి కారణం చెప్పమంటే, అదేదో ఆయన టైమ్‌లో అంతా బాగా జరిగినట్లు, జగన్‌ రాగానే ఏదో మునిగిపోయినట్లు అసత్య ప్రచారం ఎందుకు చేస్తున్నారు? విత్తనాలు సేకరించడానికి డబ్బు ఇవ్వకుండా ఓట్ల కొనుగోలుకు డబ్బు మళ్లించింది కాకుండా, ఇప్పుడు జగన్‌పై నిందలు వేయగల సాహసం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు మాత్రమే చేయగలరు. వారు ఏమనుకున్నారంటే ప్రజలను పాలించడానికే పుట్టామని, ప్రజలను ఎంత వేధించినా వారినే ఎన్నుకుంటారని, ఎన్ని అబద్ధాలు చెప్పినా జనం నమ్ముతారని, వారేదో దైవాంశసంభూతులు అన్నట్లుగా ప్రవర్తించారు.

కాని ఇప్పుడు జనం వారి అసలు స్వరూపం తెలుసుకుని ఓడించినా దానిని నమ్మలేకపోతున్నారు. ఇంకా అధికారంలోనే ఉన్నామన్న భ్రమతో బతుకుతున్నట్లుగా ఉంది. జగన్‌ ఆదేశాల మేరకు ఈనెల రోజులలో సుమారు మూడున్నర లక్షల క్వింటాళ్ల విత్తనాలు తెచ్చి సరఫరా చేశామని చెబుతున్నారే. అయినా ఒప్పుకోరా? ఇంకా అవసరం ఉండవచ్చు. ఒక ప్రతిపక్ష నేతగా ఏమిచేయాలి? ఫలానాచోట ఈ సమస్యలు ఉన్నాయి.. వాటిని పరిష్కరించండి అని రాయడం తప్పుకాదు. కాని ఎప్పుడు అవకాశం వస్తుందా? ఇంత బురద వేద్దామా అన్న దోరణితోనే చంద్రబాబు, ఆయన కుమారుడు కూర్చుంటున్నారు. నలభై రోజులు మాత్రమే పూర్తి అయిన జగన్‌ తన పాలనలో ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారో చంద్రబాబుకు తెలియదా? రైతు భరోసా కింద 12500 రూపాయలు ఇస్తామని ప్రకటించలేదా? వడ్డీ లేని రుణాలను రైతులకు ఇస్తామని అన్నారా? లేదా?

రైతులకు బీమా సొమ్ము కూడా ప్రభుత్వమే కడుతుందని జగన్‌ ప్రకటించారా? లేదా ఉచితంగా తొమ్మిది గంటల పాటు విద్యుత్‌ను రైతులకు ఇవ్వాలని ఆదేశించారా? లేదా? శనగ రైతులు ఎన్నేళ్లుగా మొత్తుకుంటున్నారు? ఎన్నడైనా చంద్రబాబు కనికరించారా? జగన్‌ రాగానే వారికి క్వింటాల్‌కు 1500 అదనపు ధర ఇచ్చారా? లేదా? తెలంగాణలో పామాయిల్‌ గింజల ధర ఎక్కువగా ఉందన్న సంగతి చంద్రబాబుకు ఇన్నేళ్లలో తెలియలేదా? మరి ఎందుకు పెంచలేదు? మరి జగన్‌ రాగానే ఎందుకు ధర పెంచేశారు? అయినా రైతు వ్యతిరేక ప్రభుత్వం అయిందా? గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఏమి చెప్పారు? జగన్‌ ఏమిచెప్పారు.

రైతులకు సంబంధించి 89 వేల కోట్ల రూపాయల రుణాలు  రద్దు చేసేస్తామని చంద్రబాబు చెబితే, అది సాధ్యంకాదని జగన్‌ అన్నారు. అంతేకాదు.. బ్యాంకులలో ఉన్న రైతుల బంగారం మొత్తం విడిపిస్తామని చంద్రబాబు చెప్పారా? లేదా? మరి ఆ పనిచేశారా? రుణమాఫీ అంటూ 25 వేలకోట్లు చేసేశామని చెప్పి, పదమూడు వేల కోట్లు ఇచ్చి, ఆ తర్వాత నాలుగైదు వాయిదాలను చంద్రబాబు ప్రభుత్వం ఎగవేసిందా? లేదా? దానిని పక్కనబెట్టి అన్నదాత సుఖీభవ అంటూ ఎన్నికల వేళ కొత్త స్కీము తెచ్చారా? లేదా? రుణమాపీ జరగకపోవడంతో రైతులు వడ్డీలు కట్టుకోవలసి వచ్చిందా? లేదా? దానిని కదా రైతు వ్యతిరేక ప్రభుత్వం అనాల్సింది? ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పలుమార్లు ప్రాజెక్టులకు ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేయడమే తప్ప ఎన్నడైనా పనులు చేయించారా?

పోలవరం, పులిచింతల ప్రాజెక్టులు కట్టాలని చెప్పిన తెలుగుదేశం నేతల నోళ్లు మూయించారా? లేదా? దానిని కదా రైతు వ్యతిరేక ప్రభుత్వం అనాల్సింది? ఉచిత విద్యుత్‌ ఇస్తే తీగలమీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పింది చంద్రబాబా కాదా? ఆ తర్వాత ఇచ్చి చూపించింది వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాదా? ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నైనా ఉంటాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డికి వచ్చిందే రైతు ప్రభుత్వం అని.. సంక్షేమ ప్రభుత్వం అని.. ఆయన దారిలోనే తాను వెళ్లి రైతులను ఆదుకుంటానని జగన్‌ చెబుతుంటే చంద్రబాబు మాత్రం అదంతా రైతు వ్యతిరేకం అని అంటున్నారు.

వినేవాడు వెర్రివాడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అన్న రీతిలో టీడీపీ వ్యవహారం సాగుతోంది. ఆయన పార్టీ నేతల మీటింగ్‌లో ఇలాంటి విషయాలన్ని చెప్పారట. వాటిని తెలుగుదేశం మీడియా అత్యంత భక్తిశ్రద్ధలతో  ప్రచారం చేస్తోంది. ఇలా చేసే టీడీపీని ముంచారు. ఇప్పుడు కూడా దానినే కొనసాగిస్తున్నారు? ఏమి చేస్తాం.. వాళ్ల ఖర్మ అని సరిపెట్టుకోవడం తప్ప!
-కొమ్మినేని శ్రీనివాసరావు

టీడీపీ స్థానాన్ని బీజేపీ ఆక్రమించగలదా?