రేవంత్ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వట్లే.. అందుకే రాజీనామా!

ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన చాలామంది నాయకులు, ఎమ్మెల్యేలు చాలా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన చాలామంది నాయకులు, ఎమ్మెల్యేలు చాలా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీలో వీరికి ప్రాధాన్యం, గుర్తింపు దక్కడం లేదంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాల్లో గ్రూపు గొడవలున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇతర పార్టీల నాయకులను పార్టీ నాయకత్వం గానీ, ముఖ్యమంత్రి గానీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

ఇలాంటి అసంతృప్తితోనే మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. ఆయన గతంలో తాను పనిచేసిన రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలోనే మళ్లీ చేరాడు. చేరగానే దిలీప్‌కుమార్‌ను పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయంత్ చౌధురి నియమించారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన దిలీప్‌కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి మీద అసంతృప్తే. ముఖ్యమంత్రి కనీసం తనకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

కాంగ్రెస్‌లో ఇతర నాయకులతో కూడా దిలీప్‌కుమార్‌కు పొసగడం లేదు. ఆయన వెళ్లిపోవడానికి ఇది కూడా ఒక కారణమే. దిలీప్‌కుమార్ తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేశాడు. ఆ ఉద్యమంలో కేసీఆర్‌కు చాలా సన్నిహితంగా ఉన్నాడు. కానీ క్రమంగా కేసీఆర్‌తో ఆయనకు విభేదాలు వచ్చాయి. టీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చాక వి. ప్రకాష్, బెల్లయ్య నాయక్‌తో కలిసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ విమోచన సమితి (టీవీఎస్) ను ఏర్పాటు చేశాడు.

ఆ తరువాత ఆయన విమలక్క, గద్దర్‌ లాంటి వారితో కలిసి టీయూఎఫ్‌ను ప్రారంభించి 2014 ఎన్నికల్లో అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్‌ఎల్‌డీ లో చేరాడు. ఆ తరువాత 2023 అక్టోబరులో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఉత్తరాది పార్టీ అయిన రాష్ట్రీయ లోక్‌దళ్ తెలంగాణలో ఏ మాత్రం ప్రభావం చూపే అవకాశం లేదు. దాన్ని గురించి సామాన్య ప్రజలకు తెలియదు కూడా. మరి కపిలవాయి దిలీప్‌కుమార్ ఆ పార్టీలో ఎందుకు చేరాడో తెలియదు.

One Reply to “రేవంత్ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వట్లే.. అందుకే రాజీనామా!”

  1. పార్టీ అధికారం లో లేనప్పుడు ఇలాంటి వాళ్ళు అడ్రెస్స్ లో ఉండరు కానీ.. పార్టీ ఎవడి కష్టం మీదనో అధికారం లో కి వస్తే మాత్రం అలవిమాలిన కోరికలు..

Comments are closed.