ప్రియుడి సూట్ కేసులో దూరిన గర్ల్ ఫ్రెండ్

అంతా కలిసి సూట్ కేసు ఓపెన్ చేస్తే, అందులోంచి ఓ అమ్మాయి లేచొచ్చింది. అక్కడే ఉన్న మరో స్టూడెంట్,

అమ్మాయిల హాస్టల్ లోకి చొరబడ్డానికి చాలామంది చాలా సాహసాలు చేసి ఉంటారు. మరి అబ్బాయిల హాస్టల్ లోకి అమ్మాయి వెళ్లాలంటే ఏం చేయాలి? దీనికి ఓ మార్గం కనిబెట్టాడు ఆ కుర్రాడు. కానీ అడ్డంగా దొరికిపోయాడు. హరియాణలో జరిగిన ఈ ఘటన కొందరికి నవ్వు తెప్పిస్తే, మరికొందరు మాత్రం కుర్రాడిపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

ప్రేమించిన అమ్మాయిని తన హాస్టల్ కు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేశాడు ఆ కుర్రాడు. అనుకున్నదే తడవుగా పెద్ద సూట్ కేస్ కొన్నాడు. అందులో తన ప్రేయసిని కూర్చోబెట్టాడు. ఎంచక్కా సూట్ కేసుతో యూనివర్సిటీలో అడుగుపెట్టాడు. అప్పటివరకు అంతా బాగానే ఉంది.

అంత పెద్ద సూట్ కేస్ చూసిన ఓపీ జిందాల్ యూనివర్సిటీ సెక్యూరిటీకి అనుమానం వచ్చింది. వాళ్లు సూట్ కేసు ఓపెన్ చేయమన్నారు. అందులో తన దుస్తులు, తినుబండారాలు ఉన్నాయని, ఓపెన్ చేయనని అన్నాడు కుర్రాడు. దీంతో అనుమానం మరింత ఎక్కువైంది.

అంతా కలిసి సూట్ కేసు ఓపెన్ చేస్తే, అందులోంచి ఓ అమ్మాయి లేచొచ్చింది. అక్కడే ఉన్న మరో స్టూడెంట్, అది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం వైరల్ అయింది. అమ్మాయిని దొంగతనంగా బాయ్స్ హాస్టల్ కు తీసుకెళ్లడానికి ప్రయత్నించిన ఆ విద్యార్థిపై చర్యలకు దిగింది యూనివర్సిటీ.