మరోసారి రేవంత్​ సర్కారుకు హైకోర్టు అక్షింతలు…!

పోలీస్ యాక్ట్ విధించాల్సిన పరిస్థితులు సభ నిర్వహించే ప్రాంతంలో లేవు. ఘర్షణలు లేవు.

రేవంత్ రెడ్డి సర్కారు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటోంది. హైకోర్టు, సుప్రీం కోర్టులతో అక్షింతలు వేయించుకుంటోంది. ఒక విధంగా చెప్పాలంటే, ప్రభుత్వానికి ఇది ఒక ఆనవాయితీగా మారింది. న్యాయస్థానాలు సర్కారును తప్పు పట్టగానే, చీవాట్లు వేయగానే బీఆర్‌ఎస్‌, బీజేపీ… రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడంలేదని విమర్శలు కురిపిస్తున్నాయి. హైడ్రా, మూసీ సుందరీకరణ, హెచ్‌సీయూ భూములు ఇంకా కొన్ని విషయాల్లో ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు చర్యలపై కోర్టులు అక్షింతలు వేశాయి. ఘాటుగా మందలించాయి.

ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. దీన్ని ప్రతిపక్షాలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్‌ భారీ ఎత్తున రజతోత్సవ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభను నభూతో నభవిష్యతి అనేలా నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ ప్లాన్ చేస్తోంది. ఆ సభలోనే పార్టీ అధినేత కేసీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై సమర శంఖం పూరించబోతున్నారు. సర్కారును, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించబోతున్నారు. ఈ సభ ద్వారా పార్టీకి పూర్వ వైభవం తేవాలని తాపత్రయపడుతున్నారు.

ఇటీవల బీఆర్‌ఎస్‌ నేతలు సభ కోసం మూడు వేల ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకున్నారు. ఇందుకోసం 8 కోట్ల రూపాయలు చెల్లించారు. సభ కోసం చాలా ముందుగానే పోలీసు ఉన్నతాధికారులను అనుమతి అడిగారు. గులాబీ పార్టీ ఈ సభను అత్యంత కీలకంగా భావిస్తోంది. కానీ రేవంత్ రెడ్డి ఈ సభను నిర్వహించనివ్వకూడదని కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన బీఆర్‌ఎస్‌పై ప్రతీకారం తీర్చుకుంటున్నాడా? లేక ఆ పార్టీకి భయపడుతున్నాడా అనేది తెలియదు కానీ, సభ నిర్వహించేందుకు వీలులేదని పోలీసుల చేత చెప్పించాడు. దీంతో పోలీసులు సభ జరిగే ప్రాంతంలో పోలీస్ యాక్ట్‌ను అమల్లోకి తెచ్చారు.

ఈ నెల 6న అమల్లోకి వచ్చిన పోలీస్ యాక్ట్ వచ్చే నెల 5 వరకు కొనసాగనుంది. అంటే నెల రోజుల పాటు ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. దీంతో బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సభకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్‌ఎస్‌ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వారి వైఖరిని తప్పుపట్టింది.

‘‘బీఆర్‌ఎస్‌ సభను నిర్వహించనీయకూడదన్న ఉద్దేశం మీకు ఉన్నట్లుంది’’ అని వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో పార్టీలకు సభలు నిర్వహించే స్వేచ్ఛ ఉంటుందని, దాన్ని నిరాకరించే హక్కు ఎవరికీ లేదని పేర్కొంది. పోలీసులు పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని హితవు చెప్పింది.

సభ 27న ఉండబోతే, దానికి సంబంధించి సమాధానం ఇవ్వడానికి 21 వరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. కానీ హైకోర్టు అంగీకరించలేదు. ఈ నెల 17న సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

నిజానికి పోలీస్ యాక్ట్ విధించాల్సిన పరిస్థితులు సభ నిర్వహించే ప్రాంతంలో లేవు. ఘర్షణలు లేవు. ఇతర అవాంఛనీయ ఘటనలు జరగలేదు. అలాంటప్పటికీ బీఆర్‌ఎస్‌ సభకు అనుమతి నిరాకరించారు. సభ నిర్వహణకు హైకోర్టు పర్మిషన్ ఇవ్వడం ఖాయం. ఇది రేవంత్ రెడ్డి సర్కారుకు మరో మైనస్ పాయింట్ అవుతుంది. గులాబీ పార్టీకి ఇది ఓ ప్రచారాస్త్రంగా మారుతుంది.

2 Replies to “మరోసారి రేవంత్​ సర్కారుకు హైకోర్టు అక్షింతలు…!”

Comments are closed.