ఆ ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలని కేటీఆర్ తాపత్రయం 

గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలని కేటీఆర్ తాపత్రయపడిపోతున్నారు.

గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలని కేటీఆర్ తాపత్రయపడిపోతున్నారు. ఉప ఎన్నికలు వస్తాయని చాలా గట్టిగా నమ్ముతున్నారు. ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేటీఆర్ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ త్వరలో విచారణకు రాబోతోంది.

సుప్రీం కోర్టు ఈ పిటిషన్ పై సానుకూలంగా స్పందిస్తుందని ఆయన విశ్వాసంతో ఉన్నాడు. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు చూస్తుంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోందని, కాబట్టి ఫిరాయింపుదారులను కాపాడటం కాంగ్రెస్ పార్టీకి అసాధ్యమని అన్నారు. ఫిరాయింపుదారులపై వేటు పడుతుందని, ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ ఎప్పటినుంచే చెబుతున్నారు.

హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు గులాబీ పార్టీకి నిరాశే ఎదురైంది. ఫలానా తేదీలోగా ఫిరాయింపుదారులపై ఫలానా తేదీలోగా వేటు వేయాలని తాము స్పీకర్ ను ఆదేశించలేమని హైకోర్టు చేతులెత్తేసింది. దాంతో గులాబీ పార్టీ అధిష్టానం డీలా పడిపోయింది. దీంతో గులాబీ పార్టీ నాయకులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్‌పై రెండు రోజుల క్రితం సుప్రీంలో విచారణ జరుగగా.. సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ స్పీకర్‌‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ స్పీకర్ ఆలస్యం చేయడాన్ని తప్పుపట్టింది. ఇంకా ఎంత సమయం కావాలంటూ గత విచారణలో గట్టిగా ప్రశ్నించింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేదాకనా అని క్వశ్చన్‌ చేసింది. స్పీకర్‌కు ఎంత సమయం కావాలో మీరే కనుక్కుని చెప్పాలంటూ న్యాయవాది ముకుల్ రోహత్గీని ఆదేశించింది. ఆపై తదుపరి విచారణను వాయిదా వేసింది. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకటరావుపై అనర్హత వేటు వేయాలని.. పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద పిటిషన్‌ వేశారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ రిట్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. రెండు పిటిషన్లు కలిపి సుప్రీం కోర్టు ఒకేసారి విచారిస్తుంది. ఈ విచారణ మీదనే కేటీఆర్​ ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఉప ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు గతంలో ఏం చెప్పిందంటే.. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను బట్టి చూస్తే, పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో నిర్ణయాన్ని స్పీకర్లు ఇక ఏండ్ల తరబడి ఎంతమాత్రం వాయిదా వేయలేరు. తప్పనిసరిగా వారు నిర్ణీత కాలవ్యవధి అంటే మూడు నెలల్లోపే నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయించే ఎమ్మెల్యేలపై కచ్చితంగా అనర్హత వేటు కూడా పడనున్నది. అంటే వారు తమ శాసన సభ్యత్వాన్ని కోల్పోవడం ఖాయమన్న మాట.

‘రాజ్యాంగంలోని పదో షెడ్యూలు ప్రకారం శాసనసభ స్పీకర్‌ వ్యవస్థ.. ఒక ట్రైబ్యునల్‌ (న్యాయ ప్రాధికార సంస్థ) వంటిది. అందువల్ల ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్ల మీద వారు నిర్ణీత సహేతుక కాల వ్యవధిలో నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి. కొన్ని అసాధారణ సందర్భాలను మినహాయిస్తే, నిర్ణీత సహేతుక కాల వ్యవధి అంటే, అనర్హత దరఖాస్తు ఇచ్చిన తర్వాత గరిష్ఠంగా మూడు నెలల లోపలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది! నిబంధనలను ఉల్లంఘించి పార్టీ ఫిరాయించిన వారిపై పదో షెడ్యూలు మేరకు అనర్హత వేటు వేసి, రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలంటే, స్పీకర్‌ మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి’ అని సుప్రీం న్యాయమూర్తులు తేల్చి చెప్పారు.

లోక్‌సభ లేదా అసెంబ్లీ కాలపరిమితి సాధారణంగా ఐదేండ్లు మాత్రమే. దీన్ని దృష్టిలో పెట్టుకునే, స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడానికి 3 నెలల గరిష్ఠ పరిమితి విధించింది. రాజ్యాంగం పదో షెడ్యూల్‌లోని నిబంధనలను ఉల్లంఘించి, అనర్హతకు పాత్రులయ్యే ప్రజాప్రతినిధులకు ఒక్కరోజు కూడా ఎంపీ లేదా ఎమ్మెల్యేగా కొనసాగే హక్కు ఉండదు. రాజేంద్రసింగ్‌ రాణా కేసులో కూడా ధర్మాసనం ఇదే విషయాన్ని స్పష్టంచేసింది’ అని సుప్రీంకోర్టు ప్రకటించింది. అనర్హత పిటిషన్లపై మధ్యంతర నిర్ణయాలకు ఆస్కారం లేదని, తుది నిర్ణయమే వెల్లడించాల్సి ఉంటుందని కూడా ధర్మాసనం పేర్కొన్నది.

‘రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం, ఒక సభ్యుడి అనర్హతపై స్పీకర్‌ సత్వర నిర్ణయం తీసుకోవడానికి న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలనుకుంటే కచ్చితంగా చేసుకోవచ్చు. స్పీకర్‌ నిర్ణయాలపై న్యాయ సమీక్షను కిహోటో హోలోహాన్‌ కేసు తీర్పు (1992)లోని 110, 111 పేరాలు ఏవిధంగానూ అడ్డుకోవడం లేదు. అనర్హతపై స్పీకర్‌ తుది నిర్ణయం తర్వాత న్యాయ సమీక్షకు కచ్చితంగా అవకాశం ఉన్నది. ఒకవేళ స్పీకర్‌ తాత్కాలిక అనర్హత, లేదా సస్పెన్షన్‌ చర్యలు తీసుకుంటే, కోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వవచ్చు’ అని సుప్రీంకోర్టు పేర్కొన్నది.

‘ఒక ప్రజా ప్రతినిధికి శిక్షపడే విధంగా స్పీకర్‌ నిర్ణయాలు తీసుకుంటే, ఆ వ్యక్తి చట్టసభ సభ్యత్వానికి అనర్హుడవుతాడని, ఫలితంగా సుదీర్ఘ కాలంపాటు సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందని, దీనివల్ల ఆయనకు కోలుకోలేని నష్టం కలుగుతుందనే వాదన అసంబద్ధం. అనర్హత వల్ల అతనికి జరిగే నష్టం కంటే, అనర్హుడైన వ్యక్తిని చట్టసభ సభ్యుడిగా కొనసాగిస్తే, ఆ నియోజకవర్గ ప్రజలపై తీవ్ర విపరిణామాలు ఉంటాయి.. అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

One Reply to “ఆ ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలని కేటీఆర్ తాపత్రయం ”

Comments are closed.