కేటీఆర్ వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నాడు. ఫార్ములా రేసు కేసులో రేపు ఏసీబీ విచారణ జరుపుతుంది. ఆ తరువాత ఈడీ విచారణ జరుపుతుంది. కేటీఆర్‌ను ఏసీబీగానీ, ఈడీగానీ అరెస్టు చేయవచ్చన్న ఊహాగానాలు ప్రబలుతున్నాయి. కేటీఆర్ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. దర్యాప్తు సంస్థల విచారణకు అనుమతి ఇచ్చింది.
దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. అదింకా విచారణకు రావాల్సి ఉంది. ఏసీబీ విచారణకు రేపు హాజరు కావాల్సి ఉండగా, విచారణకు తన వెంట లాయర్‌ను అనుమతించాలని కోరుతూ ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేశాడు.
ఫార్ములా రేసు కేసు ఇంకా విచారణకు రాకముందే కేటీఆర్‌పై ఏసీబీకి, ఈడీకి మరో ఫిర్యాదు అందింది. బీఆర్ఎస్ హయాంలో ఓఆర్ఆర్ టెండర్ల కేటాయింపులో భారీగా అవకతవకలు జరిగాయని ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీనిపై ఏసీబీ అధికారులకు బీసీ రాజకీయ జేఏసీ అధ్యక్షుడు యుగంధర్ గౌడ్ లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చాడు.
ఓఆర్ఆర్ టెండర్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కోరాడు. ఓఆర్ఆర్ టోల్ లీజ్ టెండర్లలో క్విడ్ ప్రోకో జరిగిందని యుగంధర్ ఆరోపించాడు. ఈ టెండర్ల వ్యవహారంలో కేటీఆర్, కేసీఆర్‌లపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు కూడా యుగంధర్ గౌడ్ ఫిర్యాదు ఇచ్చాడు. అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి ఓఆర్ఆర్ టెండర్లలో అవినీతి అక్రమాల గురించి మాట్లాడారు. మరి ఏసీబీ, ఈడీ ఈ ఫిర్యాదును కూడా పరిగణనలోకి తీసుకొని విచారణ జరుపుతాయా?
తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు… సీ బి వర్క్