అక్క ఒప్పుకుంది.. చెల్లి కాదంటోంది

కిడ్నాప్ కేసులో అరెస్టైన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కేసులో ట్విస్ట్ లేవీ లేవు. తమ విచారణలో అఖిల ప్రియ, కిడ్నాప్ వ్యవహారాన్ని అంగీకరించారని పోలీసులే స్పష్టం చేశారు. సంతకాలు పెట్టించుకుని…

కిడ్నాప్ కేసులో అరెస్టైన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కేసులో ట్విస్ట్ లేవీ లేవు. తమ విచారణలో అఖిల ప్రియ, కిడ్నాప్ వ్యవహారాన్ని అంగీకరించారని పోలీసులే స్పష్టం చేశారు. సంతకాలు పెట్టించుకుని ప్రత్యర్థుల్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్టు, అది బెడిసికొట్టినట్టు ఆమె ఒప్పేసుకున్నారట.

అక్కడ అక్క అఖిల ప్రియ ఒప్పుకున్నా ఇక్కడ చెల్లి మౌనిక మాత్రం ససేమిరా అంటోంది. అక్క అరెస్ట్ వెనక రాజకీయ కుట్ర ఉందని, తమ కుటుంబాన్ని దెబ్బతీసేందుకే ఈ కేసులో ఇరికించారని, భూవివాదం వెనక ఇతర కారణాలూ ఉన్నాయని కన్నీటి పర్యంతమైంది మౌనిక. 

గతంలో ఓసారి తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఉద్దేశిస్తూ ఓ వీడియో విడుదల చేయడంతో పాటు, అన్ని ఛానెళ్లకూ ఇంటర్వ్యూలిచ్చిన మౌనిక.. తాజాగా ఆళ్లగడ్డలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోసింది.

అక్క అఖిల ఆరోగ్యం బాగోలేదని వాపోయిన చెల్లి.. తాము నాగిరెడ్డి పిల్లలమని.. పులుల్లాగా జీవిస్తామంటూ కాస్త ఆవేశంగా మాట్లాడారు కూడా. పనిలో పనిగా కార్యకర్తలు, అనుచరులు అంటూ రెండు సెంటిమెంట్ డైలాగులు పడేశారు.

పార్టీ, బాబు గుర్తులేరు..

చంద్రబాబు పూర్తిగా అఖిల ప్రియను మర్చిపోయారు, అటు అఖిల చెల్లెలు మౌనిక కూడా పార్టీని, పార్టీ పెద్దను గుర్తుంచుకున్నట్టు లేరు. కార్యకర్తల్ని భుజస్కంధాలపై ఎత్తుకుంటామని చెప్పిన మౌనిక, ఏ పార్టీ కార్యకర్తలో సెలవివ్వలేదు, కనీసం టీడీపీ అని కానీ, చంద్రబాబు పేరు కానీ ఆమె ప్రస్తావించలేదు. 

అంటే పార్టీ తమకు అండగా లేదనే విషయం ఆమెకు బాగా అర్థమైనట్టే తెలుస్తోంది. మరోవైపు టీడీపీ తరపున అనంతపురం పార్లమెంటరీ పార్టీ ఇన్ చార్జి జేసీ పవన్ రెడ్డి మాత్రమే అఖిల వ్యవహారంలో స్పందించారు, వారికి అండగా ఉంటామని చెప్పారు.

ట్విస్ట్ అదిరింది..

సహజంగా టీడీపీ తరపున అరెస్ట్ అయిన వారైనా, వారి కుటుంబ సభ్యులైనా తమకు పార్టీ అండగా ఉంటుందని చెబుతారు, చంద్రబాబు ఉండగా మాకు దిగులేంటని అంటారు. కానీ మౌనిక మాత్రం ముందు కేసీఆర్ అంకుల్ అంటూ.. తెలంగాణ సీఎంని ఓ దఫా అభ్యర్థించారు, అది వర్కవుట్ కాకపోయే సరికి పంచాయతీని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వద్దకు తీసుకెళ్తామని చెబుతున్నారు.

బీజేపీ నేతల జోక్యంతో ఈ వ్యవహారం సెటిల్ చేసుకునేలా పావులు కదుపుతోంది  భూమా ఫ్యామిలీ. మొత్తానికి అక్క తప్పుని ఒప్పుకున్నా.. చెల్లి మాత్రం న్యాయపోరాటం అంటూ కాస్త హడావిడి చేస్తోంది. 

విక్ర‌మార్కుడు కంటే ప‌వ‌ర్ పుల్

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా?