TV9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. ఈ మేరకు బుధవారం ఆయనపై కేసు నమోదు చేసింది. టీవీ9 యాజమాన్య మార్పు నేపథ్యంలో రవిప్రకాశ్ అడ్డంకులు సృష్టించడంతో సమస్య ఉత్పన్నమైంది. దీంతో రవిప్రకాశ్ టీవీ9లో పాల్పడిన ఆర్థిక అవకతవకలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.
టీవీ9 మాతృ సంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నుంచి 2018 సెప్టెంబర్ నుంచి 2019 మే వరకు రూ.18 కోట్ల నిధులను అనుమతుల్లేకుండా డ్రా చేసినట్టు రవిప్రకాశ్‌తో పాటు అప్పటి సీఎఫ్‌వో మూర్తి, మరొకరిపై సంస్థ ప్రతినిధులు గత ఏడాది బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 2019 అక్టోబర్‌లో కేసు నమోదైంది. దాని ఆధారంగా తాజాగా ఈడీ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేశాయి.
అప్పట్లో ఇదే కాకుండా టీవీ9 ఫేక్ నకిలీ ఐడీ తదితర అక్రమాలకు పాల్పడిన కేసులో రవిప్రకాశ్ అరెస్ట్ కావడంతో పాటు చెంచలగూడ జైలు జీవితాన్ని కూడా గడపాల్సి వచ్చింది. కాగా ఎలక్ట్రానిక్ మీడియాలో టీవీ9 వేదికగా కొత్త ఒరవడికి రవిప్రకాశ్ నాంది పలికాడు. కానీ ఆ తర్వాత కాలంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడడంతో ఆయన ఇమేజ్ అమాంతం దెబ్బతిన్నది.
ప్రస్తుతం బలమైన ఆధారాలున్న నేపథ్యంలో ఈడీ కేసు నమోదు కావడం రవిప్రకాశ్‌కు తీవ్ర ఇబ్బందులు తెచ్చి పెట్టిందనే వాదన వినిపిస్తోంది. ఎంతో మంది రాజకీయ, రాజకీయేతర ప్రముఖులపై వార్తలు రాసిన, చెప్పిన రవిప్రకాశ్…చివరికి తానే ఆర్థిక నేరంలో వార్తల్లో వ్యక్తిగా నిలబడడం గమనార్హం.