మరోసారి కవ్వించి, కెలికిన ట్విట్టర్

ట్విట్టర్ గొప్పదా, రాజకీయ నాయకులు గొప్పోళ్లా అనే డిస్కషన్ వస్తే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ నే బ్లాక్ చేసిన ట్విట్టరే గొప్పదని చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపేస్తున్న ట్విట్టర్…

ట్విట్టర్ గొప్పదా, రాజకీయ నాయకులు గొప్పోళ్లా అనే డిస్కషన్ వస్తే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ నే బ్లాక్ చేసిన ట్విట్టరే గొప్పదని చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపేస్తున్న ట్విట్టర్ భారత్ లో కూడా కొన్నాళ్లుగా తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది. 

బీజేపీ నాయకులంతా ఆల్రడీ ట్విట్టర్ ని బ్యాన్ చేసినంత పని చేశారు. కేంద్రంతో కయ్యానికి దిగిన ట్విట్టర్ తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎపిసోడ్ తో మరిన్ని విమర్శలు మూటగట్టుకుంటోంది.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ అకౌంట్ కి బ్లూ టిక్ (వెరిఫైడ్ మార్క్) తీసేసింది ట్విట్టర్. అయితే అంతలోనే సర్దుకుని, గంటల వ్యవధిలోనే పునరుద్ధరించింది. అసలు ఎందుకు తీసేసినట్టు, మళ్లీ ఎందుకు మళ్లీ టిక్ మార్క్ పెట్టినట్టు అనే చర్చ మొదలైంది.

కావాలనే ట్విట్టర్ అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని, భారతదేశ ద్వితీయ పౌరుడి అకౌంట్ కే బ్లూటిక్ తీసేయడం సమర్థనీయం కాదని బీజేపీ నేతలు ఆగ్రం వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్విట్టర్ వివరణ మాత్రం మరోలా ఉంది. వెంకయ్య నాయుడు చివరిసారిగా వేసిన ట్వీట్ జులై 23,2020న ఉంది. అంటే దాదాపుగా ఏడాదిగా ఆ అకౌంట్ ఇన్ యాక్టివ్ గా ఉందనమాట. అందుకే దానికి బ్లూ టిక్ తేసేశామంటున్నాయి ట్విట్టర్ వర్గాలు.

అయితే అదే సమయంలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఉన్న అకౌంట్ మాత్రం యాక్టివ్ గానే ఉంది. దానిలో కూడా వెంకయ్య నాయుడు ట్వీట్లు వేస్తుంటారు. ఆ అకౌంట్ కి మాత్రం బ్లూ టిక్ అలాగే ఉంది. ర్యాండమ్ గా సిస్టమ్ చెకింగ్ వల్ల ఇలాంటి పొరపాటు జరిగిందని, కావాలని చేసింది కాదని ట్విట్టర్ చెబుతోంది.

అదే సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అకౌంట్ కి కూడా బ్లూ టిక్ తీసేసిన ట్విట్టర్ దాన్ని మాత్రం పునరుద్ధరించలేదు. మోహన్ భగవత్ ట్విట్టర్ అకౌంట్ కి 212.6k మంది ఫాలోవర్లున్నారు. అయినా కూడా దాన్ని అఫీషియల్ అకౌంట్ గా గుర్తించడంలేదు ట్విట్టర్. ఎక్కువకాలంగా ఎలాంటి ట్వీట్లు లేకపోవడంతో బ్లూటిక్ తొలగించారు. విచిత్రం ఏంటంటే.. ఇది జరిగిన కొన్ని గంటలకే.. ఆయన తన ట్వీట్లు మొత్తం డిలీట్ చేశారు.

ప్రస్తుతం బీజేపీ నేతలు ఈ విషయంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి అకౌంట్ కి బ్లూటిక్ తీసేసి భారత రాజ్యాంగాన్ని ట్విట్టర్ అవమానించిందని బీజేపీ అధికార ప్రతినిధి నకువా విమర్శించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. భారత రాజ్యాంగానికి, బ్లూ టిక్స్ కు ఏంటి సంబంధమో ఆయనకే తెలియాలి. మొత్తమ్మీద మరోసారి ట్విట్టర్ తన వ్యవహార శైలితో భారత్ లో కలకలం రేపింది.