వచ్చినప్పుడు ఆర్భాటం.. వెళ్లేటప్పుడు అవమానం

ఏడాదిన్నర కిందటి సంగతి. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు వచ్చారు. వస్తూనే అందర్నీ ఎట్రాక్ట్ చేశారు. చంద్రబాబు, జగన్ పై విమర్శలు గుప్పించడంతో పాటు జనసేనతో పొత్తును మరింత ముందుకు తీసుకెళ్లారు.  Advertisement…

ఏడాదిన్నర కిందటి సంగతి. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు వచ్చారు. వస్తూనే అందర్నీ ఎట్రాక్ట్ చేశారు. చంద్రబాబు, జగన్ పై విమర్శలు గుప్పించడంతో పాటు జనసేనతో పొత్తును మరింత ముందుకు తీసుకెళ్లారు. 

చిరంజీవి లాంటి ప్రముఖుల్ని కలిశారు. ఇక ఆ టైమ్ లో చంద్రబాబుపై సోము వేసి పంచ్ లు, టీవీ చర్చావేదికల్లో మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి కూడా. అలా ఎంతో ఆర్భాటంగా వచ్చిన సోము.. బీజేపీ గతిని మార్చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఏపీ బీజేపీని సోము కూడా ఆదుకోలేకపోయారు.

నిన్న కన్నా.. ఇప్పుడు సోము..

వరుసగా ఒకే సామాజిక వర్గానికి ఏపీలో అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ వస్తోంది బీజేపీ. ఒకరు కాకపోయినా, ఇంకొకరు పార్టీని ఆదుకుంటారని భావించింది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. సామాజిక వర్గాలను చూసుకుంటే అసలుకే మోసం వస్తుందనే అనుమానం వెంటాడుతోంది. 

కన్నా లక్ష్మీనారాయణ తర్వాత వీర్రాజుపై ఆశలు పెట్టుకుంటే, తిరుపతి, బద్వేలులో ఘోర పరాభవమే ఎదురైంది. డిపాజిట్లు కూడా రాని బద్వేల్ ఉప ఎన్నికల్లో నైతిక విజయం మాదేనంటూ బీజేపీ చెప్పుకోవడం మరీ కామెడీ.

ఇలా నైతిక విజయాలు మావేనని చెప్పుకుంటూ పోతే.. రేపు 2024 ఎన్నికల్లో కూడా బీజేపీకి దక్కేది ''నైతిక విజయం'' మాత్రమే. ప్రజలు తిరస్కరించడానికి గల కారణాలు వెదుక్కోకుండా.. వాళ్లు ఎన్నికల్లో గెలిచారు, మేం మనసులు గెలిచామంటూ కవర్ చేసుకోవడం కాషాయ దళానికే చెల్లింది.

నెక్స్ట్ ఎవరు..?

ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. టీడీపీ, జనసేన పోటీలో లేని ఎన్నికల్లో కూడా బీజేపీ డిపాజిట్లు తెచ్చుకోలేదంటే జనాలు ఎవరూ బీజేపీని నమ్మడంలేదనే అర్థమవుతోంది. 

అటు జనసేనతో కూడా సఖ్యత పెద్దగా లేదనేది బహిరంగ రహస్యం. బద్వేల్ ఉప ఎన్నికల్లో జనసేన సపోర్ట్ మాకేనంటూ వీర్రాజు చెప్పినా, ఎవరూ ప్రచారానికి రాలేదు, కనీసం పేపర్ స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో జనసేన కూడా వీర్రాజుని లెక్కలో వేసుకోవడం లేదని తెలుస్తోంది.

ఈ పరిస్థితులన్నింటినీ బేరీజు వేసుకుంటే, 2024 వరకు సోమూనే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిస్తారని అనుకోవడం భ్రమే అవుతుంది. జనాల్లోకి దూసుకెళ్లే నేతలెవరైనా ఆ పదవిని అందుకుంటారేమో చూడాలి. 

వీర్రాజుతోనే గోదారి ఈదాలంటే మాత్రం పూర్తిగా కష్టం. అయితే ఈ పనులన్నింటికంటే ముందు ప్రత్యేక హోదాపై బీజేపీ విస్పష్ట ప్రకటన చేసి, అప్పుడు బలమైన నేతను ప్రతినిధిగా పెట్టుకుంటే.. ఏపీలో బీజేపీకి కాస్తో కూస్తో పరపతి ఉంటుంది. లేదంటే ఎన్నేళ్లయినా ఇంతే సంగతి.