ఉక్కు లేనిదే విశాఖ లేదు, విశాఖ మణిహారాన్ని తొలగిస్తున్నారు, మాదే అసలైన ఉక్కు సంకల్పం, టీడీపీదే అసలైన ఉద్యమం అంటూ సాగర తీరాన ప్రగల్భాలు పలికారు చంద్రబాబు. అసలు విశాఖపట్నంపై చంద్రబాబుకి ఎంత ప్రేమో అనుకునేలా బిల్డప్ ఇచ్చారు.
నిజంగానే విశాఖ సహా ఉత్తరాంధ్రపై చంద్రబాబుకి ప్రేమ ఉంటే.. మూడు రాజధానుల నిర్ణయాన్ని ఆయన అడ్డుకునేవారా..? అభివృద్ధి వికేంద్రీకరణకు మోకాలడ్డేవారా? విశాఖను ఆర్థిక రాజధాని చేశామని చెప్పిన చంద్రబాబు.. పరోక్షంగా మూడు రాజధానుల విషయాన్ని తెరపైకి తెచ్చి ఇరుకున పడ్డారు. ఆర్థిక రాజధాని అంటూ గొప్పలు చెప్పుకోవడం ఆపేసి… అభివృద్ధి వికేంద్రీకరణకు అడ్డుపడకుండా ఉంటే చాలని స్థానిక వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు.
ఉక్కు చాలు.. రాజధాని అక్కర్లేదు..
మూడు రాజధానులపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఏడాది దాటినా.. అది ఇంకా అమలులోకి రాకపోవడానికి కారణం చంద్రబాబే. బాబు నిర్వాకం వల్లే, అమరావతి రైతుల్ని ఆయన రెచ్చగొట్టడం వల్లే, కోర్టు కేసులతో ఇరుకున పెట్టడం వల్లే ఇప్పటికీ విశాఖకు పరిపాలనా రాజధాని హోదా దక్కలేదు, కార్యాలయాల తరలింపు మొదలు కాలేదు. దీనంతటికీ ఏకైక కారణం చంద్రబాబే.
విశాఖపై అంత ప్రేమే ఉంటే.. ఉక్కు ప్రైవేటీకరణ కంటే ముందుగా.. రాజధాని తరలింపుకి ఉన్న అడ్డుగోడలన్నీ ధ్వంసం కావాలి. అది చంద్రబాబు చేతిలోనే ఉంది.
ప్రైవేటీకరణ ఆపడానికి కేంద్రం కాళ్లా వేళ్లా పడాల్సిన అవసరం లేకుండా.. పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటిస్తే అంతకు మించి ప్రయోజనం ఉంటుందని అంటున్నారు స్థానికులు. ముందు రాజధాని సంగతి తేల్చాలని పట్టుబడుతున్నారు. ఉక్కు కోసం దీక్ష చేపడుతున్న చంద్రబాబు రాజధాని అంశంపై సమాధానం చెప్పాలనే డిమాండ్ స్థానికుల నుంచి బలంగా వినపడుతోంది.
అటు వైసీపీ నేతలు కూడా బాబుని ఇరుకున పెట్టేందుకు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ఉక్కు ఉద్యమంతోనే ఈ అంశాన్ని కూడా సమాంతరంగా ప్రచారంలోకి తేవాలని చూస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తలపెట్టిన పాదయాత్ర, బహిరంగ సభా వేదికపై కూడా బాబు ద్వంద్వ వైఖరిని ఎండగట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు నేతలు.
ఆర్థిక రాజధాని కాదు.. అసలు సంగతి చూడండి..
విశాఖను ఆర్థిక రాజధానిగా తాము ప్రకటించామని, అప్పటి నుంచి ఐటీ సంస్థలు సాగర తీరానికి క్యూ కట్టాయని చెప్పారు చంద్రబాబు. అంతర్జాతీయ సంస్థల్ని తీసుకొస్తే.. వైసీపీ నేతలు తరిమి కొడుతున్నారంటూ మండిపడ్డారు.
అసలు రాజధాని కాకుండా అడ్డుకుంటున్న బాబు, ఆర్థిక రాజధాని అంటూ కొత్త లాజిక్ తీయడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఉక్కు నాటకాలతో మరోసారి చంద్రబాబు విశాఖలో కాలు పెడితే ఊరుకునేది లేదని అంటున్నారు. పరిపాలనా రాజధాని అంశాన్ని తేల్చిన తర్వాతే బాబు విశాఖలో అడుగు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.