ఏపీలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న మొత్తం మున్సిపాలిటీల సంఖ్య 75. కార్పొరేషన్ల సంఖ్య 12. వీటికి నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ నెల పదో తేదీన వీటికి సంబంధించిన పోలింగ్ జరగాల్సి ఉంది.
అయితే డివిజన్ల, వార్డుల వారీగా చూస్తే.. ఏకగ్రీవం అయిన వాటి నంబర్లను బట్టి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను నెగ్గింది. పోలింగ్ కు ముందే అక్కడ మెజారిటీలను సాధించి చైర్మన్ పదవులను తన ఖాతాలో వేసుకుంది.
చిత్తూరు, కడప, తిరుపతి కార్పొరేషన్లలో నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా నెగ్గిన డివిజన్ల వారీగా చూస్తే.. వీటిల్లో చైర్మన్ పదవులు వైఎస్సార్సీపీ సొంతం అయ్యాయి.
చిత్తూరులో 50 డివిజన్లకు గానూ 37, కడపలో 50 డివిజన్లకు గానూ 23, తిరుపతిలో 50 డివిజన్లకు గానూ 21 ఏక్రగీవాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడ్డాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసే సరికి ఈ కార్పొరేషన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం పూర్తిగా లాంఛనమే.
ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే.. పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్లల్లో వైఎస్సార్సీపీ స్వీప్ చేసింది. ఈ మున్సిపాలిటీల్లో ఓటింగ్ జరగదు. ముప్పైకి పైగా వార్డులున్న ఈ మున్సిపాలిటీల్లో అన్నింటా వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు.
ఇక మెజారిటీ ఏకగ్రీవాల విషయానికి వస్తే.. రాయచోటిలో 34 వార్డులకు గానూ 31, నాయుడుపేటలో 25 కు 23, పలమనేరులో 26కు 18, డోన్ లో 32కు గానూ 22, కర్నూలు జిల్లా ఆత్మకూరులో 24కు 18, కొవ్వూరులో 23కు 12, తునిలో 30కి 15 వార్డులు, సూళ్లురు పేటలో 25కు 15, ఎర్రగుంట్లలో 29కు 12 వార్డులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవం అయ్యాయి.