సినిమా రివ్యూ: చంద్రకళ

రివ్యూ: చంద్రకళ రేటింగ్‌: 2/5 బ్యానర్‌: శ్రీ శుభశ్వేత ఫిలింస్‌ తారాగణం: ఆండ్రియా, హన్సిక, సుందర్‌ సి., వినయ్‌, సంతానం, రాయ్‌ లక్ష్మి, కోట శ్రీనివాసరావు, కోవై సరళ తదితరులు కథనం: ఎస్‌.బి. రామదాస్‌…

రివ్యూ: చంద్రకళ
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: శ్రీ శుభశ్వేత ఫిలింస్‌
తారాగణం: ఆండ్రియా, హన్సిక, సుందర్‌ సి., వినయ్‌, సంతానం, రాయ్‌ లక్ష్మి, కోట శ్రీనివాసరావు, కోవై సరళ తదితరులు
కథనం: ఎస్‌.బి. రామదాస్‌
సంగీతం: భరద్వాజ్‌
నేపథ్య సంగీతం: కార్తీక్‌ రాజా
కూర్పు: ఎన్‌.బి. శ్రీకాంత్‌
ఛాయాగ్రహణం: యు.కె. సెంథిల్‌ కుమార్‌
నిర్మాతలు: శ్వేతలాన, వరుణ్‌, తేజ, సి.వి. రావు
కథ, దర్శకత్వం: సుందర్‌ సి.
విడుదల తేదీ: డిసెంబర్‌ 19, 2014

తమిళంలో విజయవంతమైన ‘అరన్‌మనై’ చిత్రాన్ని తెలుగులోకి ‘చంద్రకళ’గా అనువదించారు. ‘చంద్రముఖి’ చిత్రం స్ఫూర్తితో ఇటీవల సక్సెస్‌ అవుతున్న హారర్‌ ప్లస్‌ కామెడీ ఫార్ములాతో సుందర్‌ తీర్చి దిద్దిన ‘చంద్రకళ’లో అలరించే అంశాలు చాలా తక్కువ. హారర్‌ ఎఫెక్టివ్‌గా లేకపోవడం, కామెడీ నవ్వించకపోవడంతో అసలే కొత్తదనం లేని ఈ చిత్రం బాగా విసిగించింది. 

కథేంటి?

చాలా కాలంగా పాడుబడి ఉన్న ఒక ప్యాలెస్‌ని అమ్మకానికి పెడతారు. దానిని శుభ్రం చేయించడానికి వచ్చిన ఆ ప్యాలెస్‌ హక్కుదారులకి అక్కడ విచిత్రమైన అనుభవాలు ఎదురవుతుంటాయి. పని వాళ్లు ఒక్కొక్కరుగా మాయమవుతుంటారు. ప్యాలెస్‌లో దెయ్యం తిరుగుతోందని అందరూ నమ్ముతారు. అందులో నిజంగా దెయ్యం ఉందా లేక భ్రమ పడుతున్నారా?

కళాకారుల పనితీరు:

ఈ చిత్రానికి హన్సిక కథానాయిక అని ప్రచారం చేసారు కానీ అసలు కథానాయిక ఆండ్రియా. హన్సిక టైటిల్‌ రోల్‌ అయితే చేసింది కానీ కథ మొత్తం తిరిగేది ఆండ్రియా చుట్టూనే. సెకండ్‌ హాఫ్‌లో ఆండ్రియా నటన బాగుంది. పతాక సన్నివేశాలని తన నటనతో బాగానే రక్తి కట్టించింది. హన్సిక కనిపించేది కాసేపే. పల్లెటూరి యువతి మేకప్‌ ఆమెకి అంతగా సూట్‌ అవలేదు.  సుందర్‌ నటన గురించి చెప్పుకోవడానికేమీ లేదు. ముఖంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్‌ పలికించలేకపోయాడు. సంతానం ఫుల్‌ లెంగ్త్‌ క్యారెక్టర్‌ చేసినా నవ్వించింది తక్కువ. రాయ్‌ లక్ష్మి గ్లామర్‌ ఫ్యాక్టర్‌కి దోహదపడింది. కోట శ్రీనివాసరావు పతాక సన్నివేశంలో కీలక పాత్ర పోషించారు. 

సాంకేతిక వర్గం పనితీరు:    

కమర్షియల్‌ సినిమా కనుక పాటలు తప్పనిసరి అని పెట్టారు కానీ వాటి అవసరం అస్సల్లేదు. ఉన్నవి కూడా ఆకట్టుకోలేదు. హారర్‌ సినిమాల్లో ఉండే బిల్డప్‌ సీన్స్‌, టెన్షన్‌ నిండిన మొమెంట్స్‌ ఇందులో లేకపోవడంతో నేపథ్య సంగీతం కూడా అంతంతమాత్రంగానే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సుందర్‌ రాసుకున్న కథలో కొత్తదనం లేదు. ప్రతి సీన్‌ ఇంతకుముందు ఏదో ఒక సినిమాలో చూసిందే అనిపిస్తుంది. కపీసం స్క్రీన్‌ప్లే పరంగా అయినా ఆకట్టుకునే ప్రయత్నం చేయలేదు. హారర్‌ ఎలిమెంట్‌ ఉన్న చిత్రానికి చాలా ఫ్లాట్‌ స్క్రీన్‌ప్లే రాసుకున్నారు. డైరెక్షన్‌ కూడా బాగా వీక్‌. ఫస్టాఫ్‌ మొత్తం దెయ్యం చుట్టూ అల్లుకున్న కథలో ఒక్కసారి అయినా భయపెట్టలేకపోయారు. 

హైలైట్స్‌:

  • క్లైమాక్స్‌

డ్రాబ్యాక్స్‌:

  • స్క్రీన్‌ప్లే
  • డైరెక్షన్‌

విశ్లేషణ:

‘చంద్రముఖి’ చిత్రాన్నే కాస్త అటు ఇటుగా మార్చి, ‘అరుంధతి’, ‘అమ్మోరు’ తదితర చిత్రాల నుంచి తలా ఒక పాయింట్‌ తీసుకొచ్చి.. హారర్‌, కామెడీ మిళితం చేసి కిచిడీ చేసారు. అస్సలు టైమ్‌ వేస్ట్‌ చేయకుండా సరాసరి దెయ్యాన్ని రంగంలోకి దించి థ్రిల్‌ చేయాలని చూసారు కానీ మినిమమ్‌ బిల్డప్‌ లేకుండా హారర్‌ సీన్స్‌ పండించడం అసాధ్యమని గుర్తించలేకపోయారు. ఫస్ట్‌ హాఫ్‌లో దాదాపుగా ప్రతి సీన్‌లోను ‘దెయ్యం’ ఫ్యాక్టర్‌ ఉంటుంది… కానీ కనీసం భయపెట్టడం మాట అటుంచి ఒక్కసారయినా ఉలిక్కిపడే సందర్భం కూడా లేకపోయింది. 

భయపెట్టకుండా నవ్వించే ప్రయత్నమే చేసారని అనుకుందామన్నా ఆ కామెడీ సీన్లు కూడా నవ్వించలేదు. సినిమా చూస్తున్నంతసేపు చంద్రముఖి గుర్తుకొస్తూ ఉంటుంది. అందులో ఉండే టెన్షన్‌ని, ఆకట్టుకునే అంశాలని పూర్తిగా ఫిల్టర్‌ చేసేస్తే ‘చంద్రకళ’ అవుతుంది. ఆ రాజమహల్‌ సెటప్‌తో పాటు లీడ్‌ క్యారెక్టర్స్‌ కూడా చంద్రముఖినే గుర్తు చేస్తాయి. ఫార్ములా సినిమాలు తీయడానికే ఇష్టపడే సుందర్‌ సి. ఈ చిత్రంలో కూడా అదే చేసాడు. కాకపోతే ఎంచుకున్న జోనర్‌కి అసలు న్యాయం చేయలేకపోయాడు. 

సినిమాలో బాగున్న పార్ట్‌ ఏదైనా ఉంటే అది ప్రీ క్లయిమాక్స్‌, క్లయిమాక్స్‌ మాత్రమే. ఘోరంగా ఉన్న విజువల్‌ ఎఫెక్ట్స్‌ని పక్కనపెడితే పతాక సన్నివేశాలు కదలకుండా కూర్చోబెడతాయి. ఈ సీన్స్‌లో కూడా ‘చంద్రముఖి’ ఛాయలు బాగా ఉన్నప్పటికీ బాగానే హోల్డ్‌ చేసారు. ఆ పదిహేను నిముషాలని మినహాయిస్తే ‘చంద్రకళ’లో మెప్పించే అంశాలేమీ లేవు. హారర్‌, కామెడీ, గ్లామర్‌… అంటూ కొన్ని సోకాల్డ్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ తీసుకుని మాస్‌ని మెప్పించే ప్రయత్నం చేసారు. ఎన్నో హారర్‌ సినిమాలు చూసేసి ఉన్న ప్రేక్షకులకి ‘చంద్రకళ’లో ఎలాంటి ప్రత్యేకతలు కనిపించవు. కాకపోతే ఈ జోనర్‌కి ఉన్న సేలబులిటీ వల్ల ఒక సెక్షన్‌ ఆడియన్స్‌ని థియేటర్ల వరకు ఆకర్షించవచ్చు. 

బోటమ్‌ లైన్‌: ‘కళ’ తప్పిన ‘చంద్ర’ముఖి!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

Video; Chandrakala Public Talk