Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: జయమ్ము నిశ్చయమ్మురా

సినిమా రివ్యూ: జయమ్ము నిశ్చయమ్మురా

రివ్యూ: జయమ్ము నిశ్చయమ్మురా
రేటింగ్‌: 2.75/5

బ్యానర్‌: శివరాజ్‌ ఫిలిమ్స్‌, ఎన్‌కెఆర్‌ ఫిలిమ్స్‌
తారాగణం: శ్రీనివాసరెడ్డి, పూర్ణ, శ్రీవిష్ణు, రవివర్మ, ప్రవీణ్‌, పోసాని కృష్ణమురళి, కృష్ణ భగవాన్‌, జోగి బ్రదర్స్‌, జీవా, కృష్ణుడు, డబ్బింగ్‌ జానకి తదితరులు
కథనం: శివరాజ్‌ కనుమూరి, పరమ్‌ సూర్యాన్షు
సంగీతం: రవిచంద్ర
కూర్పు: 'ఎడిటర్‌' వెంకట్‌ 
ఛాయాగ్రహణం: నాగేష్‌ బానెల్‌
నిర్మాతలు: శివరాజ్‌ కనుమూరి, సతీష్‌ కనుమూరి
రచన, దర్శకత్వం: శివరాజ్‌ కనుమూరి
విడుదల తేదీ: నవంబరు 25, 2016

అద్భుతమైన కామెడీ టైమింగ్‌ ఉన్న ఆర్టిస్టుల్లో ఒకడు శ్రీనివాసరెడ్డి. చిన్న డైలాగ్‌ని కూడా పర్‌ఫెక్ట్‌గా పలికించి నవ్విస్తుంటాడు. తన టాలెంట్‌కి తగినన్ని ఫుల్‌ లెంగ్త్‌ క్యారెక్టర్లు తనకి దక్కలేదనే చెప్పాలి. 'జయమ్ము నిశ్చయమ్మురా'లో శ్రీనివాసరెడ్డి తనలోని మరో కోణాన్ని చూపిస్తాడు. వివిధ ఎమోషన్లు పలికించడంలో, క్యారెక్టర్‌ని అండర్‌ ప్లే చేయడంలో తన విలక్షణత చాటుకుంటాడు. నటుడిగా ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి పరిపూర్ణ న్యాయం చేసాడు. కానీ అతనికి ఉన్న కమెడియన్‌ ఇమేజ్‌ ఈ చిత్రానికి ఆటంకం కావచ్చు. శ్రీనివాసరెడ్డి హీరో అంటే ఖచ్చితంగా అదో ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ సినిమా అనుకుంటారు. ఇందులో కామెడీ లేకపోలేదు కానీ బేసిక్‌గా ఇదో హ్యూమన్‌ ఎమోషన్స్‌ బేస్‌ చేసుకున్న డ్రామా. శ్రీనివాసరెడ్డికి తన మార్కు కామెడీ పండించే స్కోప్‌ ఇవ్వని క్యారెక్టర్‌. భాగ్యరాజా తరహా పాత్రని తలపించే ఈ 'సర్వ మంగళం' పాత్రకి శ్రీనివాసరెడ్డిని ఎందుకు ఎంచుకున్నారనేది ఆసక్తికరం. 

మూఢ నమ్మకాలని నమ్ముతూ, తనపై తనకి అసలు ఆత్మవిశ్వాసం లేని ఒక అమాయకుడు తన తప్పు తెలుసుకుని స్వంతంగా నిర్ణయాలు తీసుకుని, తనని తాను నమ్ముకుని నడుచుకునేందుకు దారి తీసిన పరిణామాలు, పరిస్థితుల సమ్మేళనం 'జయమ్ము నిశ్చయమ్మురా'. 'ఆ ఒక్కటీ అడక్కు' తరహాలో ఇలాంటి హీరో పాత్రని కామెడీగా మలచి వుండొచ్చు. కానీ దర్శకుడు శివరాజ్‌ తన హీరోని సీరియస్‌గా, సహజంగా చూపిస్తూ, చుట్టూ హాస్య సన్నివేశాలు అల్లుకున్నాడు. కాకినాడ లాంటి టౌన్‌లో గవర్నమెంట్‌ ఆఫీస్‌ ఎలా రన్‌ అవుతుంది, అక్కడ పని చేసే వారి తీరుతెన్నులు ఎలాగుంటాయి, బ్రోకర్లు ఏ విధంగా సామాన్య జనాన్ని ఇబ్బందికి గురి చేస్తుంటారు వగైరా వ్యవహారమంతా దర్శకుడు కళ్లకి కట్టాడు. 

పాత్రల్లో, సన్నివేశాల్లో, సంభాషణల్లో సహజత్వం ఉండడమే ఈ చిత్రానికి ప్రధానాకర్షణ, బలం కూడా. అయితే కథ మరీ నత్త నడక నడుస్తున్న ఫీలింగ్‌ వస్తుంది. ముఖ్యంగా ఫస్ట్‌ హాఫ్‌లో క్యారెక్టర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ కోసం దర్శకుడు చాలా టైమ్‌ తీసుకున్నాడు. గవర్నమెంట్‌ ఆఫీస్‌ పని తీరు గురించి, అక్కడి ఉద్యోగుల తీరుతెన్నుల గురించి వివరించడానికి అవసరానికి మించిన టైమ్‌ తీసుకోవడం, హీరో మూగ ప్రేమ కూడా 'స్లో మోషన్‌'లోనే నడుస్తుండడంతో ఫస్ట్‌ హాఫ్‌ ఎంతకీ తరగదు. ఇంటర్వెల్‌కే ఒక ఫుల్‌ లెంగ్త్‌ మూవీ చూసిన భావన కలుగుతుంది.

ఒక్కసారి హీరో పాత్రలో ఆత్మవిశ్వాసం పెరిగిన తర్వాత సన్నివేశాల్లో జోరు పెరుగుతుంది. రవివర్మతో శ్రీనివాసరెడ్డి కాన్‌ఫ్రంటేషన్‌ సీన్‌ (కోతి బొమ్మ) చాలా బాగా పండింది. కానీ ఆ స్పీడు కొనసాగించే సన్నివేశాలు కొరవడ్డాయి. రవివర్మని ఇరకాటంలో పెట్టి పాట పాడడం, సంతకం పెట్టించుకోవడం వగైరా తంతు ఆ కోతి బొమ్మ సీన్‌ అంత ఎఫెక్టివ్‌గా లేవు. పైగా అంతవరకు సహజంగా అనిపించిన హీరో పాత్ర కాస్తా నేల విడిచి సాము చేసిన భావన కలుగుతుంది. లవ్‌ ట్రాక్‌ కూడా రొటీన్‌ ట్విస్టులతో సాగిపోతుంది తప్ప ఎలాంటి ఆసక్తి కలిగించదు. ఈ మధ్యలో ప్రభాస్‌ శ్రీను 'బైక్‌ ఎపిసోడ్‌', కృష్ణభగవాన్‌ 'మంగళవారం వీక్‌నెస్‌' పాయింట్ల మీద కామెడీ బాగానే పండింది. పోసాని, ప్రవీణ్‌ల ట్రాక్‌ని క్లయిమాక్స్‌లో పెళ్లి సీన్‌లో పొడిగించడం వల్ల విసుగు తప్ప వినోదం లేకపోయింది. 'అత్తారింటికి దారేది' పోస్టర్ల నేపథ్యంలో ప్రేమకథని నడిపించడం బాగుంది. మెయిన్‌ లీడ్‌పై సింపతీ కలిగించలేకపోవడం, ఆ పాత్రతో రిలేట్‌ చేసుకోలేకపోవడం మైనస్‌గా మారాయి. ఇలాంటి అండర్‌డాగ్‌ క్యారెక్టర్ల సక్సెస్‌ మీద డిపెండ్‌ అయిన కథలో పబ్లిక్‌ రిలేట్‌ చేసుకోగలిగే అంశాలుండాలి. అలాంటి బలమైన సన్నివేశాలు లేకపోవడం ఈ చిత్రానికి ఖచ్చితంగా డ్రాబ్యాకే.

శ్రీనివాసరెడ్డి నటన గురించి ముందే చెప్పుకున్నాం. తెలంగాణ మాండలికంలో తడబడకుండా డైలాగ్స్‌ చెప్పినందుకు అతడికి క్రెడిట్‌ ఇవ్వాలి. పూర్ణ ఎప్పటిలానే చక్కగా నటించింది. రవివర్మ, శ్రీవిష్ణు ఇద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రవివర్మ సొఫెస్టికేటెడ్‌ విలనీ బాగా ప్రదర్శించాడు. గోదావరి జిల్లాల్లో చాలా కామన్‌గా కనిపించే 'యమహా బైక్‌ బిల్డప్‌ రాయుడి' పాత్రలో శ్రీవిష్ణు ఎంటర్‌టైన్‌ చేస్తాడు. కృష్ణభగవాన్‌కి చాలా కాలం తర్వాత నవ్వించే అవకాశమిచ్చిన పాత్ర ఇది. ప్రవీణ్‌ తత్కాల్‌ పాత్రలో వినోదం పంచాడు. పోసాని తనదైన శైలిలో నవ్విస్తే, జోగి బ్రదర్స్‌, ప్రభాస్‌ శ్రీను కూడా కామెడీకి దోహదపడ్డారు. 

హీరో మూగ ప్రేమని తెలియజెప్పే బిట్‌ సాంగ్‌ బాగుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. దర్శకుడిగా శివరాజ్‌ కనుమూరిపై వంశీ సినిమాల ప్రభావం బాగా కనిపించింది. పాత్ర చిత్రణ, సంభాషణల్లో వంశీ శైలి కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. దర్శకుడిగా అతని టాలెంట్‌ తెలియజెప్పే సందర్భాలు చాలానే వున్నాయి. కాకపోతే మరీ ఓల్డ్‌ ఫ్యాషన్డ్‌గా తీర్చిదిద్దడమే ఇబ్బంది పెడుతుంది. 

జయమ్ము నిశ్చయమ్మురా అనే నమ్మకం టైటిల్‌లో ప్రతిధ్వనిస్తున్నా కానీ జయమ్ముపై సందేహమ్ములు రేకెత్తించే పంటి కింది రాళ్లు చాలానే తగుల్తాయి. ఎనభైల కాలంలోని సినిమా చూస్తున్న భావన కలిగించడం, కనీసం అరగంట రన్నింగ్‌ టైమ్‌ ఎక్కువ ఉండడం, అన్నిటికీ మించి నత్త నడకన సాగే వైనం ఈ చిత్రానికి పెద్ద బలహీనతలు. సహజత్వం నిండిన పాత్రలు, శ్రీనివాసరెడ్డి నటన, సెకండ్‌హాఫ్‌లో వర్కవుట్‌ అయిన కామెడీ దీనికి బలాలు. అయితే శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన సినిమానుంచి ప్రేక్షకులు పూర్తిస్థాయి వినోదం ఆశిస్తారు. రెగ్యులర్‌ హీరోల సినిమాలపై ఎక్స్‌పెక్టేషన్స్‌ సంగతి ఎలాగున్నా, కమెడియన్‌ హీరోగా నటించిన సినిమా చాలా స్పెషల్‌గా ఉండాలని అనుకుంటారు. మిగిలిన వాటి సంగతి ఎలాగున్నా కామెడీ విషయంలో లోటు జరగకూడదని భావిస్తారు. ఆ అంచనాలన్నీ అందుకునేంత 'విషయం' ఇందులో ఉందా అంటే అంత లేదనే చెప్పాలి. ఒక్కసారి చూసేందుకు అంతగా ఇబ్బంది కలిగించే సినిమా అయితే కాదు కానీ, ఎంతోకొంత ఇబ్బంది పెడుతుంది కనుక ఈ శ్రీనివాసరెడ్డి సినిమాకి సగటు సినీ ప్రేక్షకుడి స్పందన ఎలాగుంటుందో చూడాలి. 

బాటమ్‌ లైన్‌: మరీ నిదానమ్మురా!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?