రివ్యూ: కబాలి
రేటింగ్: 2/5
బ్యానర్: వి క్రియేషన్స్
తారాగణం: రజనీకాంత్, రాధిక ఆప్టే, ధన్సిక, కిషోర్, దినేష్ రవి, నాజర్, విన్‌స్టన్ చావ్, రిత్విక తదితరులు
మాటలు: పా. రంజిత్, సాహితి
సంగీతం: సంతోష్ నారాయణ్
కూర్పు: ప్రవీణ్ కె.ఎల్.
ఛాయాగ్రహణం: జి. మురళి
నిర్మాత: కలైపులి ఎస్. థాను
రచన, దర్శకత్వం: పా. రంజిత్
విడుదల తేదీ: జులై 22, 2016
ఒక్క నిమిషం టీజర్‌తోనే అంచనాలకి ఆకాశమే హద్దుగా చేసిన దర్శకుడు పా. రంజిత్ 'కబాలి' ప్రేక్షకులని అంతే ఎత్తు నుంచి ఒకేసారి కిందకి పడేసాడు. వయసు మళ్లిన డాన్ పాత్రలో రజనీకాంత్ గెటప్ మినహా 'కబాలి'లో మరో చెప్పుకోతగ్గ పాజిటివ్ పాయింట్ లేదంటే అతిశయోక్తి కాదు. మలేషియాలో కష్టాలు పడుతోన్న భారతీయులకి అండగా నిలబడి, వారి బాగోగులు చూసుకునే ఒక డాన్, జైలు పాలయి, కుటుంబానికి దూరమయి, వారిని మళ్లీ ఎలా కలిసాడు, చివరిగా దుష్ట శిక్షణ ఎలా చేసాడు అన్నదే 'కబాలి' లైన్. ఈ సింగిల్ లైన్ స్టోరీని రెండున్నర గంటల సినిమాగా మలచడంలో, ఈ కథకి ఆసక్తికరమైన కథనం రాసుకోవడంలో రంజిత్ పూర్తిగా విఫలమయ్యాడు.
రజనీకాంత్ పరిచయ సన్నివేశాల అనంతరం 'కబాలి' పూర్తిగా గాడి తప్పుతుంది. ఒక పది నిమిషాల పాటు చూసిన తర్వాత, ఇంటర్వెల్ కోసం వేచి చూసేలా, సెకండాఫ్ మొదలయ్యాక ముగింపు కోసం పడిగాపులు పడేలా ఉన్న 'కబాలి' చిత్రంలో రజనీకాంత్ ఒక్కడినీ తీసి పక్కన పెడితే, కనీసం కొన్ని నిమిషాల పాటు కూర్చోవడం కష్టం. ఒక సామాన్యుడు ప్రజా నాయకుడిగా ఎదగడం, మాఫియాని ఏలడం అనేది సూపర్ కమర్షియల్ పాయింట్. గ్యాంగ్‌స్టర్ సినిమాలకి భగవద్గీతలా మారిన 'గాడ్‌ఫాదర్' స్ఫూర్తితో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కాయి. నాయకుడు, సర్కార్‌లాంటి సినిమాల సరసన చేరే కెపాసిటీ ఉన్న కథాంశాన్ని దర్శకుడు రంజిత్ పూర్తిగా నీరుగార్చాడు. నీరసానికి పర్యాయపదంగా మార్చేసాడు.
రజనీకాంత్‌ని ఈ ఏజ్‌లో ఇలా చూపించాలనే విజన్ ఉన్నందుకు, ఆ ఐడియా తనకే ముందుగా వచ్చినందుకు మెచ్చుకోవచ్చు. అందుకే ఒక్కటైనా భారీ చిత్రం తీసిన అనుభవం లేకపోయినా కానీ రజనీ అతనికి అవకాశం ఇచ్చి ఉండొచ్చు. అయితే రజనీకాంత్‌ని డాన్ పాత్రలో ఊహించుకుని, అందుకు తగ్గ క్యారెక్టర్ స్కెచ్ అయితే వేసుకున్నాడు కానీ తన కథని ఆసక్తికరంగా చెప్పేందుకు కాస్తయినా ప్రయత్నించలేదు. ఈ డొల్ల సినిమాని నిలబెట్టడానికి రజనీకాంత్ తన వంతు ప్రయత్నం చేసారు కానీ కేవలం ఆయన నడిస్తేనో, నవ్వితేనో చూసి ఆనంద పడిపోవడానికి, పరవశంతో ఊగిపోవడానికి అందరూ ఆయన వీరాభిమానులే ఉండరు కదా.
సినిమా మొదలైన పది నిమిషాల తర్వాత మనసారా విజిల్ వేసుకోవడానికి రజనీ అభిమానులకి కూడా స్కోప్ ఇవ్వకుండా రంజిత్ పెట్టిన స్టయిలిష్ టార్చర్ అంతా ఇంతా కాదు. 'లింగా' చిత్రంలో అయినా రజనీకాంత్ కాకుండా ఇతర హంగులు, తారాగణం, సాంకేతికగణం ఉన్నాయి. కానీ ఇందులో రజనీకాంత్ తప్ప మరేమీ లేదు. కీలకమైన పాత్రలకి కూడా సీజన్డ్ ఆర్టిస్టులని తీసుకోకుండా ఒక మాదిరి కాస్ట్ కంట్రోల్ పాటించారు.
రజనీకాంత్ కూతురి పాత్ర చాలా కీలకం. ఆ పాత్రలో ధన్సిక పూర్తిగా తేలిపోయింది. అలాగే రజనీకి కుడి భుజమైన 'జీవా' పాత్రలో 'ఆటకత్తి' దినేష్ సీరియస్‌గా నటిస్తున్నా, అతని ఓవరాక్షన్ మనకి కామెడీగా అనిపిస్తుంది. ఇలాంటి నటులు తమిళ వారికి కనక్ట్ అవుతారేమో కానీ, తెలుగు ప్రేక్షకులకి వాళ్లెవరనేది కూడా తెలీదు. రాధికా ఆప్టే మంచి నటి అనేదాంట్లో అనుమానాల్లేవు. కాకపోతే ఇందులోని పాత్రకి తగ్గ 'పవర్' కానీ, 'స్క్రీన్ ప్రెజెన్స్' కానీ ఆమెకి లేదు. ఎన్నో ఏళ్ల తర్వాత భర్త ఎదురు పడిన సన్నివేశాన్ని హావభావాలతో రక్తి కట్టించింది కానీ రమ్యకృష్ణ మాదిరి ఆహార్యం అవసరమైన పాత్రలో రాధిక మెప్పించలేకపోయింది.
Watch Kabali Movie Public Talk
ఏరియల్ షాట్స్‌తో సినిమాటోగ్రాఫర్ ఆకట్టుకున్నాడు. సాంకేతిక పరంగా సినిమాటోగ్రాఫర్ ఒక్కడే మెప్పిస్తాడు. సంతోష్ నారాయణ్ థీమ్ మ్యూజిక్ మినహా మరేమీ ఆకట్టుకోదు. వాస్తవికమైన పాత్రలో సూపర్‌స్టార్‌ని చూపించాలనే దర్శకుడి తపన అర్థమవుతుంది కానీ 'కబాలి' పాత్రని ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ, అతని చాకచక్యం, సమయస్ఫూర్తి, నేర్పు చూపించే సన్నివేశాలతో హీరోయిజం పండించడంలో కానీ అతను చేతులెత్తేసాడు. కుర్చీలోంచి కదలకుండా 'సర్కార్'లో అమితాబ్ ఎంత హీరోయిజం పండించాడో తెలుసుగా? ముదలియార్‌గా కమల్ నటించిన 'నాయకన్'లో ఉండే మలుపులు, జరిగే డ్రామా లోతెంతో గుర్తుందిగా? సరైన దర్శకుడి చేతిలో పడి వుంటే ఇది కూడా అలాంటి పవర్‌ఫుల్ సినిమా అయి ఉండేది. కానీ ఒక మహదవకాశాన్ని దర్శకుడు పా. రంజిత్ చేతులారా వృధా చేసుకున్నాడు.
ఈమధ్య కాలంలో రజనీకాంత్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ప్రెజెంట్ చేయడంలో శంకర్ మినహా మరే దర్శకుడూ సక్సెస్ కాలేదు. యువ దర్శకుడు రంజిత్ మనకి రజనీలో కొత్త కోణం చూపిస్తాడని ఆశిస్తే అతనేమో కనీసం పాత రజనీని కూడా చూపించకుండా, నూట యాభై నిమిషాల సమయం ఎంత భారంగా గడుస్తుందనే దానికి లైవ్ డిమాన్‌స్ట్రేషన్ ఇచ్చాడు. అంచనాలని ఎంత తగ్గించుకుని చూసినా నిరుత్సాహపరిచేలా ఉన్న 'కబాలి' రిలీజ్‌కి ముందు ఉన్న ఆ మెగా హైప్‌తో బాక్సాఫీస్‌ని ఎన్ని రోజులు ఏలతాడో చూడాలి. 'నిప్పురా' అంటూ బీభత్సంగా అంచనాలని పెంచిన కబాలి చూసాక కానీ తెలిసిరాదు… నిప్పంటే కాలుతుంది కదా, ఈ సంగతి ముందుగా ఎందుకు బోధ పడలేదని!
బోటమ్ లైన్: రాంగ్ డైరెక్టర్ చేతిలో కథ బలి!
– గణేష్ రావూరి