Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Reviews

సినిమా రివ్యూ: కిల్లింగ్‌ వీరప్పన్‌

సినిమా రివ్యూ: కిల్లింగ్‌ వీరప్పన్‌

రివ్యూ: కిల్లింగ్‌ వీరప్పన్‌
రేటింగ్‌: 2.75/5

బ్యానర్‌: జెడ్‌3 పిక్చర్స్‌, జి.ఆర్‌. పిక్చర్స్‌, శ్రీకృష్ణ క్రియేషన్స్‌
తారాగణం: శివరాజ్‌కుమార్‌, సందీప్‌ భరద్వాజ్‌, పారుల్‌ యాదవ్‌, శ్రీధర్‌, సంచారి విజయ్‌, యజ్ఞ శెట్టి తదితరులు
సంగీతం: రవిశంకర్‌ 
కూర్పు: అన్వర్‌ అలీ
ఛాయాగ్రహణం: రామీ
నిర్మాతలు: బి.వి. మంజునాథ్‌, శివప్రకాష్‌. ఈ, బి.ఎస్‌. సుధీంద్ర
రచన, దర్శకత్వం: రామ్‌గోపాల్‌వర్మ
విడుదల తేదీ: జనవరి 7, 2016

బేసిక్‌గా ఒక కథ అంటూ లేకుండా వేగ్‌ ఐడియాని పట్టుకుని సినిమా తీస్తే రామ్‌గోపాల్‌వర్మ చిత్రాలు అగమ్యగోచరంగా అనిపిస్తాయి కానీ, సోర్స్‌ మెటీరియల్‌ అంటూ ఉంటే ఇప్పటికీ 'కూర్చోబెట్టగలిగే' సినిమా తాను తీయగలనని అడపాదడపా చూసిస్తూనే ఉన్నాడు. '26 నవంబర్‌ ఎటాక్స్‌'ని డాక్యుమెంట్‌ చేసిన వర్మ ఈసారి గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ ఎన్‌కౌంటర్‌ని డాక్యుమెంటరీ డ్రామాగా తెరకెక్కించాడు. జరిగిందేంటి అనేది మనందరికీ తెలుసు. కానీ అదెలా జరిగింది అనేది వర్మ తన కోణంలో చెప్పదలచుకున్నాడు. తనకి తెలిసిన, తెలుసుకున్న నిజాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు తప్పిస్తే అచ్చంగా ఇదే జరిగిందని అనుకోవడానికి లేదు. వీరప్పన్‌ ప్రస్థానం ఎలా మొదలైంది, అతని వ్యక్తిత్వమేంటి, అతని ఎదుగుదలకి కారణమైన సంఘటనలు వగైరా వాటి జోలికి పోకుండా కేవలం అతడిని చంపడానికి చేసిన 'ఆపరేషన్‌ కొకూన్‌' మీదే ఫోకస్‌ పెట్టాడు. కనుక వీరప్పన్‌ గురించిన విశేషాలు తెలుసుకుందామనుకునే వారికి నిరాశ తప్పదు. 

వీరప్పన్‌ని అడవిలో మట్టుబెట్టడం కష్టమని తేలిపోవడంతో అతడిని బయటకి తీసుకొచ్చి చంపడానికి పోలీసులు పథక రచన చేస్తారు. వారేం పథకాలు వేసారు, చివరకు ఎలా విజయవంతమయ్యారు అనేదే ఈ చిత్రం. వీరప్పన్‌ని చంపడం వెనుక ఏం జరిగిందనే దానిపై వర్మ తీసుకున్న నోట్స్‌ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించినట్టున్నారు. దృష్టి మొత్తం పోలీస్‌ ఆపరేషన్‌ మీదే పెట్టారు తప్ప మెయిన్‌ క్యారెక్టర్స్‌ని కూడా సరిగా డెవలప్‌ చేయలేదు. ముఖ్యంగా వీరప్పన్‌లోని చాకచక్యాన్ని, సమయస్ఫూర్తిని చూపించే ప్రయత్నం కూడా చేయలేదు. ఒక వ్యక్తి ఒక గుంపుని వేసుకుని అడవుల్లో పడి తిరుగుతూ, ఇరవవయ్యేళ్లకి పైగా మూడు రాష్ట్రాల పోలీసులకి, బోర్డర్‌ సెక్యూరిటీ సిబ్బందికి సింహస్వప్నమయ్యాడంటే అతనెంత తెలివైనవాడు, చురుకైనవాడు అయి ఉంటాడు. 'కిల్లింగ్‌ వీరప్పన్‌'లో వరుసగా ప్రతిసారీ పోలీసులు వేసే ఉచ్చులోకి వచ్చి పడిపోతూ ఉన్న వీరప్పన్‌ని చూస్తే ఇతడిని చంపడానికి అన్నేళ్లు ఎందుకు పట్టిందనిపిస్తుంది. 

వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మి పాత్రని కూడా కథలో ప్రస్తావించారు. వీరప్పన్‌కి వేసే ఎరల్లో భాగంగా ఆమె పాత్ర తెరమీదకి వస్తుంది. ఆమెతో స్నేహం చేయడానికి, వీరప్పన్‌ని అడవిలోంచి బయటకి తీసుకొచ్చేలా పథకం రచించడానికి మరో యువతి పాత్ర వుంది. ముందుగా పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా తర్వాత స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఆఫీసర్‌గా కనిపించే ఆమె నేపథ్యమేంటనే దానిపై క్లారిటీ ఉండదు. వీరప్పన్‌ గురించి ఏమీ తెలియని వారికి ఈ సినిమా చూస్తే అతను పాపులారిటీ కోసం పరితపించిపోయే వాడని, ఏకే ఫార్టీసెవెన్‌లాంటి ఆధునిక ఆయుధాల మీద మోజు పడేవాడని, ఎల్‌టీటీఈ ప్రభాకరన్‌ని పిచ్చి ఆరాధించేవాడని అనిపిస్తుంది. ఎన్నిసార్లు పోలీసులు తనని మోసం చేసినా మళ్లీ మళ్లీ వాళ్లు పన్నే ప్రతి వలలోను పడిపోతూ ఉంటే ఆసియాలోనే అతి పెద్ద పోలీస్‌ ఆపరేషన్‌ జరిగింది ఇతనికోసమా అనుకోవాల్సి వస్తుంది. 

డ్రోన్‌లతో ఏరియల్‌ షాట్లు, అడవి మొత్తం కెమెరాలు కలియతిరిగే షాట్లతో వర్మ తన మార్కు చూపించడానికి చూసాడు. సినిమా నిడివి పెరిగినా, నడక మందగించినా కానీ అవి ఎడిటింగ్‌లో పోకుండా చూసుకున్నాడు. నిజంగా జరిగిన సంఘటనలని డాక్యుడ్రామాగా తీర్చిదిద్దడంలో వర్మ ఎప్పుడూ తన పదును చూపిస్తుంటాడు. ఐస్‌క్రీమ్‌, 365డేస్‌లాంటి సినిమాలు తీసిన వర్మే ఇలాంటి సినిమాలు తీసేటపుడు చూపించే గ్రిప్‌ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే అలా అని వర్మ తిరిగి తన పూర్వ వైభవం తెచ్చేసుకున్నాడు, మళ్లీ ఆనాటి గొప్ప దర్శకుడు తిరిగి తెరమీదకి వచ్చేసాడు అనుకోవడానికి లేదు. శివ, సత్య, కంపెనీ, సర్కార్‌.. ఇలా ఏ సినిమా తీసినా కానీ తన స్టాంప్‌ ఆ సినిమాల మీదే కాకుండా చూసిన వారి మదిఫలకాలపై పర్మినెంట్‌గా పడిపోయేట్టు చేసిన వర్మ ఇప్పుడు కేవలం ఫ్యాక్ట్స్‌ని డాక్యుమెంటేషన్‌ చేస్తున్నాడే తప్ప గుర్తుండిపోయే సినిమాలుగా వాటిని మలచడం లేదు. 

ఓ సీన్‌లో పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతూ ఎస్‌టీఎఫ్‌ అధికారిణిని దాటుకుంటూ వీరప్పన్‌ వెళతాడు. పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో వీరప్పన్‌ ఉన్నా, చేతిలో తుపాకీ గురిపెట్టి ఉన్నా కానీ ఆమె అతడిని అలా చూస్తుండిపోతుందే తప్ప, కాల్చదు. ఆమె బ్రెయిన్‌ ఫ్రీజ్‌ మూమెంట్‌ని, ఆమెని దాటుతూ వెళ్లేప్పుడు వీరప్పన్‌ కళ్లల్లోని తీక్షణతని చూస్తే.. వింటేజ్‌ వర్మ ఒక్కసారి అలా కళ్లముందు తళుక్కుమంటాడు. 'ఇది కదా ఇండియాని మొత్తం ఊపేసిన వర్మ మార్కు' అని ఒక్క క్షణం తన అభిమానులు పులకించేట్టు చేస్తాడు. కానీ అలాంటి మూమెంట్‌ మళ్లీ సినిమాలో ఎక్కడా వెతికినా కనిపించదు. 'నేను చంపుతాను. చంపడం తప్పు అని వాళ్లకి తెలియజెప్పడానికి చంపుతాను' అని శివరాజ్‌కుమార్‌ అన్నప్పుడు 'క్షణక్షణం', 'అనగనగా ఒకరోజు' తదితర చిత్రాల్లో కనిపించిన వర్మ సెన్సాఫ్‌ హ్యూమర్‌ తలపుకి వస్తుంది. బుల్లెట్ల వర్షంలో ఆంబులెన్స్‌లో చిక్కుకుని నిస్సహాయంగా వీరప్పన్‌ చనిపోతూ ఉంటే, అతడిని చంపడమే లక్ష్యంగా పెట్టుకున్న శివరాజ్‌కుమార్‌ ఒక విధమైన దర్పంతో టీ తాగుతోన్న దృశ్యం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. 

వర్మ ఈమధ్య తీస్తోన్న సినిమాలతో పోల్చుకుంటే 'కిల్లర్‌ వీరప్పన్‌' నిజంగా మైళ్ల ముందుంటుంది. కానీ వర్మ తీసిన ఆనాటి సినిమాల సరసన నిలబడే అర్హత మాత్రం లేదు దీనికి. ఈ సినిమా చూసి 'వర్మ ఈజ్‌ బ్యాక్‌' అంటున్నవారికి ఆయన క్యాపబులిటీస్‌ ఏంటనేది తెలీదనుకోవాలి. లేదా తను తీసిన చిత్రాల స్థాయి ఎంతో అవగాహన లేదనుకోవాలి. కొద్ది నెలల వ్యవధిలో మూడు, నాలుగు సినిమాలు చుట్టి పారేస్తోన్న వర్మ కొన్నాళ్లు ఒక్క సినిమా మీదే ఫోకస్‌ పెట్టి, స్క్రిప్ట్‌ డెవలప్‌మెంట్‌ మీద, స్క్రీన్‌ప్లే పైన మరింత కాన్సన్‌ట్రేట్‌ చేసినట్టయితే మళ్లీ అప్పటి మెరుపులు చూడవచ్చునని 'కిల్లింగ్‌ వీరప్పన్‌'లోని కొన్ని మూమెంట్స్‌ అయినా ఆశలు రేకెత్తిస్తాయి. 

వీరప్పన్‌ పాత్రధారి సందీప్‌ భరద్వాజ్‌ అసలు రూపం చూస్తే అతనిలో వీరప్పన్‌ని చూసిన వర్మ కెమెరా కంటికి హేట్సాఫ్‌ చెప్పాలనిపిస్తుంది. వీరప్పన్‌ పాత్ర అండర్‌ డెవలప్డ్‌గా ఉండిపోయినా కానీ సందీప్‌ తనవంతు న్యాయం చేసాడు. తన తండ్రిని కిడ్నాప్‌ చేసి వంద రోజులకి పైగా అడవుల్లో బందీగా పెట్టుకున్న వీరప్పన్‌పై పర్సనల్‌ రివెంజ్‌ తీసుకుంటోన్నట్టు అనిపిస్తుంది శివరాజ్‌కుమార్‌ ఇంటెన్సిటీ చూస్తే. ఈ క్యారెక్టర్‌కి రాసిన డైలాగ్స్‌ కూడా బాగున్నాయి. పారుల్‌ యాదవ్‌ బాగానే చేసింది. యజ్ఞ శెట్టి వీరప్పన్‌ భార్య పాత్రకి సూట్‌ అయినట్టు అనిపించలేదు. ఆమె నటన బాగుంది. 'సర్కార్‌'తో మొదలై 'రక్తచరిత్ర'తో పీక్స్‌కి చేరిన లౌడ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌పై వర్మ ప్యాషన్‌ ఇందులో ఇంకాస్త ముదిరింది. 'టక్కుం టిక్కుం టిక్కుం టక్కం..' అంటూ చెవుల తుప్పు వదిలిపోతుంది. పాటల అవసరమే లేకపోయినా కొన్ని నేపథ్య గీతాలున్నాయి. వాటి గురించి చెప్పుకోడానికి ఏమీ లేదు. 

వీరప్పన్‌ని పోలీసులు ఎలా చంపారనే దానిపై వర్మ టేక్‌ తెలుసుకోవాలని ఉంటే ఈ సినిమా చూడొచ్చు. వర్మ తీస్తోన్న సినిమాలన్నీ ఫాలో అవుతున్నట్టయితే దీన్ని చూసి ఒకింత సర్‌ప్రైజ్‌ కూడా కావచ్చు. ఫుల్‌ ఫామ్‌లో ఉన్నప్పుడే... మంచి సాంకేతికవర్గంతో, క్వాలిటీ నిర్మాణ విలువలతో, ఇంకా రిచ్‌ కాన్వాస్‌పై, బాలీవుడ్‌లో రాజుగా వెలుగుతోన్న రోజుల్లోనే ఈ చిత్రాన్ని వర్మ తలపెట్టినట్టయితే ఎలా ఉండేదో అన్న ఊహే మహా థ్రిల్లింగ్‌గా ఉంది. ఆ థ్రిల్‌ని మ్యాచ్‌ చేసే సత్తా మొత్తంగా 'కిల్లింగ్‌ వీరప్పన్‌' సినిమాకి కూడా లేదు. 

బోటమ్‌ లైన్‌: వర్మ రీసెంట్‌ సినిమాలకంటే చాలా బెటర్‌!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?