Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: కృష్ణాష్టమి

సినిమా రివ్యూ: కృష్ణాష్టమి

రివ్యూ: కృష్ణాష్టమి
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
తారాగణం: సునీల్‌, నిక్కీ గల్రానీ, డింపుల్‌, అశుతోష్‌ రాణా, అజయ్‌, తులసి, ముఖేష్‌ రిషి, పవిత్రా లోకేష్‌, బ్రహ్మానందం, సప్తగిరి, పృధ్వీ, వైవా హర్ష తదితరులు
కథ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
సంగీతం: దినేష్‌
కూర్పు: గౌతరరాజు
ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు
నిర్మాత: రాజు
కథనం, దర్శకత్వం: వాసు వర్మ
విడుదల తేదీ: ఫిబ్రవరి 19, 2016

ఓ శనివారం సాయంత్రం టీవీ ముందు కూర్చుని, ఏదో తెలుగు సినిమా చూస్తూ, యాడ్స్‌ వచ్చినప్పుడల్లా ఛానల్స్‌ మార్చుకుంటూ అలా అన్ని సినిమాలనీ కవర్‌ చేస్తుంటే ఎలా ఉంటుందో తెలుసు కదా? 'కృష్ణాష్టమి' చూస్తుంటే అచ్చంగా అలాగే అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఛానల్‌ మార్చే సౌకర్యం దొరకదు, స్విచ్చాఫ్‌ చేసే సౌలభ్యం ఉండదు! కమర్షియల్‌ సినిమా అంటే ఫలానా సినిమాలో హిట్‌ అయిన సీన్‌ని తెచ్చి, మరో సినిమాలో హిట్‌ అయిన సీన్‌కి కలుపుతూ మన దగ్గరున్న 'దారం' మందం వున్న కథతో దండ గుచ్చడమే కథనం అన్న రీతిన ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. 

సినిమా ఎలాగో ఎంటర్‌టైన్‌ చేయదు కనుక, 'ఈ సీన్‌ ఏ సినిమాలోదో కనుక్కునే' గేమ్‌ ఆడుకుంటూ కాలక్షేపం చేయవచ్చు. సినిమా మొదలైన దగ్గర్నుంచీ 'ఎక్కడో చూసేసామనే'.. కాదు కాదు 'అక్కడ చూసినదే' అనే ఫీలింగ్‌ అడుగడుగునా ఎదురవుతుంది. అసలు కథ ఏంటనేది తెలిసేసరికి ఇంటర్వెల్‌ వస్తుంది. అక్కడ్నుంచి అయినా కొత్త సినిమా ఉంటుందేమో అనుకుంటే, అక్కడ్నుంచి వేరే సినిమాల మెడ్‌లీతో కథ గోవాకి చేరుతుంది. కనీసం అక్కడ కూడా కొత్తదనానికి తావు లేకుండా కాలం చెల్లిపోయిన 'శ్రీనువైట్ల ఫార్ములా'కి తెర లేస్తుంది. 'దిల్‌, బొమ్మరిల్లు, కొత్తబంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'... ఇలా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో చిరకాలం గుర్తుండిపోయే ముద్ర వేసిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నుంచి ఇలాంటి కిచిడీ కథతో మరీ ఇంతటి నాసిరకం సినిమా రావడమేంటి? ఇక్కడ సేఫ్‌ గేమ్‌ ఆడింది దిల్‌ రాజా, వాసు వర్మా అనేది వాళ్లకే తెలియాలి. 

మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌లో హీరో మాదిరిగా మన హీరో (సునీల్‌) యుఎస్‌లో సెటిలైన ఒక వీడియో గేమ్‌ డిజైనర్‌. అతడిని ఇండియా రాకుండా పద్ధెనిమిదేళ్ల నుంచీ అక్కడే ఉంచేస్తాడతని పెదనాన్న. ఇలాగైతే కుదరదని ఇండియాకి బయల్దేరతాడు హీరో. మధ్యలో వాతావరణ సమస్యల వల్ల ఫ్లయిట్‌ మూడు రోజులు డిలే అవుతుంది 'ఇష్క్‌' సినిమాలో చూసినట్టుగా! అక్కడ 'పల్లవిజం' అంటూ తన జీవిత సూత్రాల్ని బుక్కు రాసి పెట్టుకున్న హీరోయిన్‌ (నిక్కీ) కంట పడుతుంది. 'బాద్‌షా'లో 'బంతి' ఫిలాసఫీ మాట్లాడే కాజల్‌ గుర్తుందిగా. అలా అన్నమాట. అచ్చంగా అందులో ఎన్టీఆర్‌ ఆమెని పిచ్చిదాన్ని చేసి ప్రేమలోకి దించినట్టే ఇక్కడా మూడు రోజుల్లో హీరోయిన్‌ని పడేస్తాడు హీరో. ఈ క్రమంలో అతనికి 'సంతోషం'లో నాగార్జునలాంటి కథ ఉన్న వ్యక్తి (అజయ్‌) తారసపడతాడు. అతనో ఎటాక్‌లో కోమాలోకి పోతే అతని పిల్లాడిని తీసుకుని వాళ్లింటికెళ్తాడు హీరో. అతనే తమ అల్లుడని (ఈ ట్రాక్‌లో చాలా పేర్లు రాసుకోవచ్చు కానీ 'బృందావనం'కి ఫిక్స్‌ అవుదాం. ఎందుకంటే ఆ సినిమానే ఎక్కువసార్లు గుర్తొస్తుంటుంది) పొరపాటు పడతారు. చెప్పలేని పరిస్థితిలో హీరో లాక్‌ అయిపోతాడు. వచ్చేద్దామని అనుకుంటూ ఉంటే మళ్లీ ఎటాక్‌ జరుగుతుంది. అప్పుడు కానీ తెలిసిరాదు మన హీరోకి తన 'కథేంటి' అని. అఫ్‌కోర్స్‌ ఈ సినిమా కథేంటనేది మనకి తెలిసేది కూడా అప్పుడే అనుకోండి.

'మర్యాద రామన్న' మాదిరిగా తన మీద ఏళ్ల తరబడి పగ పెంచుకుని కత్తులు నూరుతోన్న ఇంట్లోకే హీరో చేరాడన్నమాట. కాకపోతే అతడెవరనేది అక్కడ విలన్లకీ తెలుసు. ఇక్కడ హీరోకి మాత్రమే తెలుసు. అటుపై బృందావనం, మిర్చి వగైరా మిశ్రమమంతా అయిపోయాక లొకేషన్‌ షిఫ్ట్‌ అవుతుంది. రెడీలో మాదిరిగా విలన్లు వేషాలు మార్చేసుకుని భార్యలతో సరదాగా మాట్లాడేస్తే వాళ్లు కళ్లు తడిపేసుకుని 'వయొలిన్‌' వాయించేస్తారు. అసలు కథ ముగిసే ముందు కామెడీ డోస్‌ బాగా పడాలనేది ఫార్ములా కాబట్టి 'బకరా' పాత్రలో బ్రహ్మానందం దిగుతాడు. రొటీన్‌గా 'సంగీత్‌' సాంగేసుకున్నాకే విలన్‌కి విషయం తెలుస్తుంది. కొట్టగలిగినా కానీ హీరోల తన్నులు తింటూ లీటర్ల కొద్దీ రక్తం కోల్పోవడమే ఫార్ములా కాబట్టి అదీ జరిగిపోతుంది. ఆ తర్వాత విలన్లకి జ్ఞానోదయం డైలాగులు, ఓ కొటేషన్‌ పడ్డాక రోల్‌ అవుతూ టైటిళ్లూ. అదండీ కృష్ణాష్టమి కథాకమామీషు.

సునీల్‌ సినిమా కాబట్టి కామెడీ ఉంటుందని వెళితే నిరాశ తప్పదు. ఎందుకంటే తనేం చేయాలనేది తనకే తెలియని అయోమయంలో సునీల్‌ తెగ ఇబ్బంది పడ్డాడు. పద్దెనిమిదేళ్ల పాటు యుఎస్‌లో పెరిగిన ఎన్నారై ఎంచక్కా తూర్పు గోదావరి యాసలో దంచి కొట్టేస్తోంటే ఎంత నేచురల్‌గా ఉందో చెప్పనవసరం లేదు. బ్రాండెడ్‌ డ్రస్సులు, ఇన్‌డోర్స్‌లో కూడా ఏవియేటర్‌ గాగుల్సు పెట్టుకుని తిరిగే హీరో నోరు తెరిస్తే మాత్రం 'స్టయిల్‌' జాడ కనిపించదు. తనకి కామెడీ హీరో అనే ఇమేజ్‌ ఉంది కనుక నవ్వించాల్సిన బాధ్యత ఫీలయ్యాడో ఏమో క్యారెక్టర్‌కి సూట్‌ అయినా కాకున్నా తన ధోరణిలోనే సునీల్‌ చేసుకుంటూ పోయాడు. 'ప్రిపేర్‌ అయి వచ్చాన్రా... కొడితే రిపేరుకి కూడా పనికిరారు' లాంటి డైలాగులు సునీల్‌ చెప్తుంటే డైజెస్ట్‌ అవదు. సునీల్‌కి బలమైన కామెడీ లేకుండా అతడిని అందరి మాదిరి హీరోగా చూపించాలనే ప్రయత్నం ఎందుకు జరిగిందో, అసలు ఈ కథలో సునీల్‌ని ఎలా విజువలైజ్‌ చేసుకున్నారో బోధ పడదు. తెర నిండా ఆర్టిస్టులున్నా కానీ ఏ ఒక్కరికీ గుర్తుండిపోయే పాత్ర లేదు. 

పాటలైనా బాగుంటే కాస్తయినా టైమ్‌పాస్‌ అయ్యేదేమో కానీ పాటలొచ్చినప్పుడల్లా విసుగు డబులయింది. సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. కార్‌ ఛేజ్‌ సీన్‌ చిత్రీకరణ మెప్పిస్తుంది. స్టార్‌ హీరో లేకపోయినా ఖర్చుకి వెనకాడకుండా దిల్‌ రాజు దీనిని తెరకెక్కించిన తీరుకి మెచ్చుకోవాలి. మొదటి సినిమా తర్వాత ఆరేళ్లకి పైగా సమయం తీసుకున్న వాసు వర్మ ఇలాంటి 'టెంప్లేట్‌' సినిమాతో తిరిగి రావడం ఆశ్చర్యపరుస్తుంది. దర్శకుడిగా తన ముద్ర చాటుకునే అవకాశాన్ని ఈ కథ ఇవ్వలేదు. ఇలాంటి మూస సినిమాల్తో ఎటువంటి ప్రత్యేక ముద్రలూ రావు. 

ఫార్ములా సినిమాలకి అలవాటు పడి, వాటికి అడిక్ట్‌ అయిపోయిన వాళ్లు మినహా 'కృష్ణాష్టమి'ని ఎంజాయ్‌ చేయలేరు. 'ఎదుటోడి మొహంలో సంతోషం చూడ్డానికి ఎంత దూరం అయినా వెళ్లవచ్చు' అనేది ఈ చిత్రంలో ఇచ్చిన సందేశం. మన సంతోషం కోసం కొన్ని మూస సినిమాలకి దూరంగా ఉండొచ్చు అనేది మనకి తెలిసే నీతి. 

బోటమ్‌ లైన్‌: కష్టం సుమీ!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?