Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: పండగ చేస్కో

సినిమా రివ్యూ: పండగ చేస్కో

రివ్యూ: పండగ చేస్కో
రేటింగ్‌: 2.75/5

బ్యానర్‌: యునైటెడ్‌ మూవీస్‌ లిమిటెడ్‌
తారాగణం: రామ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌, సంపత్‌ రాజ్‌, సాయికుమార్‌, బ్రహ్మానందం, అభిమన్యుసింగ్‌, జయప్రకాష్‌రెడ్డి, పవిత్ర లోకేష్‌, రావు రమేష్‌, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు
సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి
నిర్మాత: పరుచూరి కిరీటి
కథనం, దర్శకత్వం: గోపిచంద్‌ మలినేని
విడుదల తేదీ: మే 29, 2015

ఫస్ట్‌ హాఫ్‌ సరదాగా కాలక్షేపం చేయడం, ఇంటర్వెల్‌కి హీరోకున్న బాధ్యత ఏంటనేది చెప్పడం, విడిపోయిన కుటుంబాన్ని కలపడానికి హీరోతో పాటు అందరూ ఒకే ఇంట్లో చేరి కామెడీ చేయడం... తెలుగు సినిమాకి గత కొన్నేళ్లుగా ఇదే కమర్షియల్‌ ఫార్ములా అయిపోయింది. ‘పండగ చేస్కో’ కూడా ఇదే ప్యాట్రన్‌ ఫాలో అవుతూ, ఈమధ్య కాలంలోనే చూసిన అనేకానేక తెలుగు సినిమాలని గుర్తు చేస్తూ, ఏం జరుగుతుందనేది ముందే తెలిసిపోతూ, మధ్య మధ్యలో నవ్విస్తూ, అక్కడక్కడా విసిగిస్తూ అలా సోసోగా సాగిపోతుంది. 

కథాపరంగా విషయం లేకపోవడంతో చాలా పాత్రలని, ఉపకథల్ని కలిపి వినోదం రంగరిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. ముందుగా భార్యలని వదిలేసిన భర్తలు, తండ్రికి దూరంగా ఉంటోన్న కూతురు కాన్సెప్ట్‌పై ఫ్యామిలీ డ్రామాతో సినిమా స్టార్ట్‌ అవుతుంది. ఆ పిల్లకి, పేరు దివ్య (రకుల్‌ ప్రీత్‌ సింగ్‌) పెళ్లి చేయాలంటే కత్తిలాంటి కుర్రాడు కావాలనగానే పోర్చుగల్‌లో హీరో కార్తీక్‌ (రామ్‌) ఇంట్రడక్షన్‌ జరుగుతుంది. ఒక పాట అయిన తర్వాత సదరు హీరో చాలా కంపెనీలకి ఓనర్‌ అని, మల్టీ మిలియనీర్‌ అని రివీల్‌ అవుతుంది. ఇంతలో నెల రోజుల్లోగా తన పెళ్లి కాకపోతే తన మూడు వేల కోట్ల ఆస్తి ట్రస్టుకి వెళ్లిపోతుందని అర్జంటుగా వరుడి వేట మొదలుపెడుతుందో పొగరుబోతు అనుష్క అలియాస్‌ స్వీటీ (సోనాల్‌). తనకి అన్నిటా తగిన వరుడు మన కార్తీకేనని ఫిక్సయి, ఒక పాటేసుకుని అతనితో నిశ్చితార్ధం కూడా చేసేసుకుంటుంది. ఇంతలో కార్తీక్‌కి ఇండియాలో ఉన్న కంపెనీ ఒకటి ఒక స్వఛ్ఛంద సంస్థ కారణంగా మూతబడడంతో హడావిడిగా ఇండియాకి వచ్చేస్తాడు. ఆ సంస్థని నడిపించేది దివ్య. ఆమెని బెదిరించే యత్నాలు, ప్రేమించే ప్రయత్నాల తర్వాత కథ రసకందాయంలో పడుతుంది. కార్తీక్‌ ఇండియాకి అసలు ఎందుకు వచ్చాడనే సంగతి రివీల్‌ అవుతుంది. 

కేవలం వినోదాన్ని పండించడమే తప్ప కొత్తగా ఏదైనా అందించాలనే ఆలోచన అయితే ఈ చిత్రం తీసిన వారికి లేదనే సంగతి క్లియర్‌గా తెలుస్తూనే ఉంటుంది. కామెడీని పండించడానికి ఎన్ని విధాలుగా స్కోప్‌ ఉంటే, అన్ని రకాలుగా నవ్వించడానికి డెస్పరేట్‌గా ట్రై చేసారు. కొన్ని సందర్భాల్లో సన్నివేశాలు, ఇంకొన్ని చోట్ల సంభాషణలు, ఒక్కోసారి నటీనటులు... ఇలా ఏదో రకంగా నవ్వులైతే పూసాయి. కాకపోతే అసలు కథని సైడ్‌ చేస్తూ మొదలు పెట్టిన ఉపకథలు, ఆ కథల్లోంచి పుట్టుకొచ్చి అసలు కథలోకి ఎంట్రీనిచ్చే పాత్రలతో కలగాపులగం అయిపోయింది. హీరో ఇండియాకి వచ్చిన రీజన్‌ రివీల్‌ అయ్యేసరికి అనగనగా అనేక సినిమాలు కళ్లముందు కదలాడుతాయి. షరా మామూలుగా కోన వెంకట్‌ ఫార్ములాకి అనుగుణంగా ముఖ్య పాత్రలన్నీ ఒకే ఇంటి కప్పు కిందకి చేరతాయి. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలన్నీ కామెడీ కోసమని చేసిన ప్రయత్నాలే కాగా, వాటిలో కొన్ని నవ్వించి, కొన్ని విసిగిస్తాయి. 

ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసినదే అయినా కానీ ఈ తంతుని ఎంజాయ్‌ చేయగల వారికి ‘పండగ చేస్కో’తో ఏ ఇబ్బందులు ఉండవు. కానీ ఎన్నిసార్లు ఇదే చేస్తారు, ఎన్నిసార్లని ఇదే చూస్తామని అనుకునేవారు మాత్రం బాగా నిరాశ పడతారు. కమర్షియల్‌ ఫార్ములాకి అనుగుణంగానే సినిమాలు తీసే దర్శకుడు గోపిచంద్‌ ఇందులోను అదే సేఫ్‌ గేమ్‌ ఆడాడు. బలుపు చిత్రంలో శృతి`బ్రహ్మానందం ట్రాక్‌, క్లయిమాక్స్‌లో జంపింగ్‌ జపాంగ్‌ లాంటి చమక్కులతో సక్సెస్‌ అయిన గోపిచంద్‌ ఇందులో అలాంటి మెరుపులు ఏమీ మెరిపించలేదు కానీ ఈ రొటీన్‌ కథని వీలయినంత వినోదాత్మకంగా మలిచేందుకు శతధా కృషి చేసాడు. కాకపోతే స్క్రిప్ట్‌లో ఫ్రెష్‌నెస్‌ పూర్తిగా లోపించడం వల్ల ఈసారి అవుట్‌పుట్‌ అంత ఎఫెక్టివ్‌గా రాలేదు. ఇంత కామెడీ చేసినా కానీ ఇది మిస్‌ అయితే ఏదో మిస్‌ అయిపోతామని అనిపించేదైతే ఇందులో ఏదీ లేదు.

రామ్‌కి తన గత మూడు చిత్రాలతో పోలిస్తే ఇది కాస్త ఉపశమనం. రొటీన్‌ అయినా కానీ సేఫ్‌ రూట్‌ ఎంచుకున్నాడు కానీ తను ఇదే ఫార్ములాతో బెటర్‌ మూవీస్‌ (రెడీ, కందిరీగ) ఆల్రెడీ చేసేసి ఉన్నాడు కాబట్టి తను ఆశిస్తున్న ఫలితం ఈసారి వస్తుందా రాదా అనేది అనుమానమే. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సోనాల్‌ ఇద్దరూ గ్లామర్‌ పరంగా పోటీ పడ్డారు. ఈ చిత్రానికి గ్లామర్‌ ఫ్యాక్టర్‌ ఖచ్చితంగా ప్లస్‌ పాయింటే. దానికోసమని సినిమాకి వెళ్లేవారు పండగ చేసుకోవచ్చు. బ్రహ్మానందంది రొటీన్‌ క్యారెక్టరే అయినా అడపాదడపా నవ్వించాడు. సంపత్‌ రాజ్‌, సాయికుమార్‌, పవిత్ర లోకేష్‌ అసలు కథకి మూలమైన పాత్రల్లో తమవంతు న్యాయం చేసారు. అభిమన్యుసింగ్‌, జయప్రకాష్‌రెడ్డి ట్రాక్‌ ‘నాయక్‌’లో రాహుల్‌దేవ్‌, జేపీ ట్రాక్‌ని గుర్తు చేస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ తగ్గకుండా చూసుకోవడానికి ఇంట్రడ్యూస్‌ చేసిన ఈ క్యారెక్టర్స్‌ని ‘నాయక్‌’లానే మళ్లీ చివర్లో కథలోకి కలిపారు. పృధ్వీరాజ్‌ని చివర్లో ఇంట్రడ్యూస్‌ చేసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ స్పూఫ్‌ ట్రై చేసారు కానీ అది అంతగా ఆకట్టుకోదు. ‘లౌక్యం’ క్లయిమాక్స్‌లో పేరడీ సీన్స్‌తో బ్రహ్మాండంగా పేలిన బాయిలింగ్‌ స్టార్‌ ఎటెంప్ట్‌ ఇక్కడ మిస్‌ఫైర్‌ అయింది.

ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా కూడా కన్సిస్టెన్సీ లేకపోవడం, సినిమా గ్రాఫ్‌లో చాలా అప్స్‌ అండ్‌ డౌన్స్‌ ఉండడంతో పండగ చేస్కో జస్ట్‌ యావరేజ్‌ అనిపిస్తుందే తప్ప మస్ట్‌ వాచ్‌ అనిపించుకోదు. తమన్‌ పాటలు కూడా ఈ చిత్రానికి ఎలాంటి వేల్యూ యాడ్‌ చేయలేదు. కాస్టింగ్‌ పరంగా, లొకేషన్స్‌ పరంగా నిర్మాతలు బాగానే ఖర్చు పెట్టారు. ఫార్ములాని నమ్ముకుని ఈ తరహా ఎంటర్‌టైనర్స్‌ని ఇష్టపడేవారిని మాత్రమే టార్గెట్‌ చేసుకుని చేసిన ఈ చిత్రంలో బాక్సాఫీస్‌ వద్ద పండగ చేసుకునేంత మెటీరియల్‌ అయితే లేదు కానీ సేఫ్‌గా పాస్‌ అయిపోవడానికి ఈ మాత్రం స్టఫ్‌ సరిపోతుందా లేదా అనేది చూడాలిక. 

బోటమ్‌ లైన్‌: రొటీన్‌ పండగ!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?