సినిమా రివ్యూ: సావిత్రి

రివ్యూ: సావిత్రి రేటింగ్‌: 2/5 బ్యానర్‌: విజన్‌ ఫిలిం మేకర్స్‌ తారాగణం: నారా రోహిత్‌, నందిత, మురళి శర్మ, అజయ్‌, ధన్య బాలకృష్ణ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, సత్య, రవిబాబు, జీవా, మధునందన్‌,…

రివ్యూ: సావిత్రి
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: విజన్‌ ఫిలిం మేకర్స్‌
తారాగణం: నారా రోహిత్‌, నందిత, మురళి శర్మ, అజయ్‌, ధన్య బాలకృష్ణ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, సత్య, రవిబాబు, జీవా, మధునందన్‌, శ్రీముఖి తదితరులు
మాటలు: కృష్ణ చైతన్య
సంగీతం: శ్రవణ్‌
కూర్పు: గౌతమ్‌ నెరుసు
ఛాయాగ్రహణం: ఏ. వసంత్‌
నిర్మాత: డా|| వి.బి. రాజేంద్రప్రసాద్‌
కథ, కథనం, దర్శకత్వం: పవన్‌ సాదినేని
విడుదల తేదీ: ఏప్రిల్‌ 01, 2016

మన దగ్గరున్న కథతో రెండు నిమిషాల ఆసక్తికరమైన ట్రెయిలర్‌ కట్‌ చేయవచ్చు కానీ, అదే కంటెంట్‌తో రెండు గంటల సినిమాతో ఆకట్టుకోవడం అంత తేలిక కాదు. ట్రెయిలర్‌లో ప్రామిసింగ్‌గా కనిపించిన 'సావిత్రి' సినిమాలో తేలిపోయింది. కొత్త తరహా కథల్ని ప్రోత్సహించిన నారా రోహిత్‌ ఇప్పుడు కమర్షియల్‌గా తన స్థాయిని పెంచుకోవాలని ఆరాట పడుతున్నట్టున్నాడు. తుంటరి, సావిత్రిలో రోహిత్‌ కమర్షియల్‌ హీరోగా కనిపించాడు. అయితే ప్రతినిధి, అసుర లాంటి సినిమాలకి సెట్‌ అయిపోయిన తన లుక్‌, ఇలాంటి కమర్షియల్‌ హీరో పాత్రలకి సూట్‌ అవడం లేదు. 

కమర్షియల్‌ హీరో బాడీ లాంగ్వేజ్‌లో ఈజ్‌ ఉండాలి, డైలాగ్‌ కొడితే పంచ్‌ పేలిపోవాలి, డాన్సులు, ఫైట్లలో ఫ్లెక్సిబుల్‌గా అనిపించాలి. వీటిలో ఏ ఒక్క దానికి కూడా 'టిక్‌' పెట్టకుండానే కమర్షియల్‌ కథలోకి దూకిన రోహిత్‌ని చూస్తుంటే చెస్‌ ప్లేయర్‌ వచ్చి రగ్బీ ఆడుతున్న ఫీలింగ్‌ కలుగుతుంది. సావిత్రి హీరోనే కాదు దర్శకుడు కూడా తన కంఫర్ట్‌ జోన్‌ని విడిచిపెట్టి కమర్షియల్‌ ఫార్ములాని నమ్ముకోవడం విశేషం. 'ప్రేమ ఇష్క్‌ కాదల్‌'లాంటి కాంటెంపరరీ సినిమా తీసిన పవన్‌ సాదినేని ఈసారి కమర్షియల్‌ ఫార్ములాకి పట్టం కట్టాడు. శ్రీను వైట్ల వెంకీ సినిమాలో మాదిరిగా సుదీర్ఘమైన ట్రెయిన్‌ ఎపిసోడ్‌తో కామెడీ పండించడానికి విఫలయత్నం చేసాడు. అక్కడితో ఆగకుండా రెడీలో బ్రహ్మానందం మాదిరిగా హీరో మాటలని గుడ్డిగా నమ్మేసే పోసాని పాత్రని కూడా పెట్టుకున్నాడు. 

కమర్షియల్‌ సినిమా అంటే ఒక దాని తర్వాత ఒకటిగా కామెడీ సీన్లని పెట్టేయడమే అని చాలా మంది భ్రమపడుతున్నారు. కమర్షియల్‌గా ఫార్ములాకి అనుగుణంగా గ్రాఫ్‌ ఎక్కడ లేవాలో, ఎక్కడ స్టడీగా ఉండాలో చూసుకుంటే రొటీన్‌ కథలతో కూడా మెప్పించవచ్చు. అదే కామెడీని మాత్రమే నమ్ముకుని ఏరు దాటాలని చూస్తే తప్పకుండా ప్రతి సీను పండాల్సిందే. అడపాదడపా నవ్వించినా కానీ ఒక దశకి చేరుకునే సరికి కామెడీ కూడా ఓవర్‌డోస్‌ అయిపోయింది. ముఖ్యంగా పోసాని, రవిబాబు క్యారెక్టర్ల చుట్టూ అల్లిన సీన్లన్నీ తేలిపోయాయి. ఇక అసలు కథ విషయానికి వస్తే చెప్పుకోతగ్గ విషయమేం లేదు. చాలా సాధారణ ఫ్యామిలీ డ్రామా, లవ్‌స్టోరీలతో 'సావిత్రి' మెప్పించిన దానికంటే నీరసం తెప్పించిన సందర్భాలే ఎక్కువ. 

లవ్‌స్టోరీ పండాలంటే లీడ్‌ పెయిర్‌ మధ్య కెమిస్ట్రీ కంపల్సరీ. రోహిత్‌, నందిత ఇద్దరూ యాక్షన్‌ అనగానే నటిస్తున్నట్టే అనిపించారు కానీ ఎక్కడా వారి మధ్య సహజ సిద్ధమైన కెమిస్ట్రీ లేదు. ఖచ్చితంగా ఇలాంటి పాత్రలు రోహిత్‌ జోన్‌ కాదు. నవ్వడం, నడవడం దగ్గర్నుంచి తన ఫోర్ట్‌ అయిన డైలాగ్‌ చెప్పడంలోను రోహిత్‌ ఇంప్రెస్‌ చేయలేకపోయాడు. సావిత్రి క్యారెక్టర్‌కి కావాల్సిన క్యూట్‌నెస్‌ని తెర మీదకి తీసుకురావడంలో నందిత పూర్తిగా విఫలమైంది. మురళీ శర్మ, అజయ్‌ ఇద్దరికీ ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. పోసాని కృష్ణమురళి ఎంత ట్రై చేసినా నవ్వు రాలేదు. సత్య, ప్రభాస్‌ శ్రీను నవ్వించడం కోసం చాలా పాట్లు పడ్డారు. ధన్య బాలకృష్ణ టోన్‌, ఎక్స్‌ప్రెషన్‌ పరంగా మార్పులేం ఉండట్లేదు. 

పాటలు బాలేదు కానీ నేపథ్య సంగీతం కొన్ని సందర్భాల్లో బాగుంది. పెళ్లి బ్యాక్‌డ్రాప్‌ కావడంతో సినిమాటోగ్రాఫర్‌ ఎల్లో కలర్‌ థీమ్‌ని ఫాలో అయిపోయాడు. సంభాషణలు కొన్ని బాగా రాసుకున్నారు. పవన్‌ సాదినేని కమర్షియల్‌ సక్సెస్‌ కోసమని చేసిన ఎటెంప్ట్‌లో కొత్తదనం పూర్తిగా మిస్‌ అవడంతో పాటు అటు ఫార్ములాని కూడా పక్కాగా ఫాలో కాలేదు. ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ సమతూకంతో, కథ పక్కదారి పట్టని కామెడీతో ఇదే చిత్రాన్ని మరోలా తీర్చిదిద్ది ఉండొచ్చు. రోహిత్‌ మార్కు సీరియస్‌ డైలాగ్‌ డ్రామాలని ఇష్టపడే వారిని ఎలాగో ఆకట్టుకోలేని సావిత్రి కనీసం ఇటు ఫార్ములా ప్రేక్షకులని కూడా పూర్తిగా మెప్పించే విధంగా తెరకెక్కలేదు. విజయం కోసం రోహిత్‌ ఎదురు చూపులు ఇంకొన్నాళ్లు తప్పేట్టు లేవు. 

బోటమ్‌ లైన్‌: ఓల్డ్‌ ఫ్యాషన్డ్‌!

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri