రివ్యూ: సెకండ్ హ్యాండ్
రేటింగ్: 2.5/5
బ్యానర్: శ్రేయస్ చిత్ర
తారాగణం: ధన్యా బాలకృష్ణన్, సుధీర్‌వర్మ, కిరీటి, శ్రీవిష్ణు, అనూజ్ రామ్, పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: రవిచంద్ర
కూర్పు: ఎస్.ఆర్. శేఖర్
ఛాయాగ్రహణం: అవనీంద్ర, ఉమ
నిర్మాతలు: బి.వి.ఎస్. రవి, పూర్ణ నాయుడు
రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల
విడుదల తేదీ: డిసెంబర్ 13, 2013
సంక్రాంతి వరకు పెద్ద సినిమాలేవీ రావట్లేదు కాబట్టి ప్రస్తుతం తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల హవా నడుస్తోంది. గత వారంలానే ఈవారం కూడా పలు లో బడ్జెట్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ‘సెకండ్ హ్యాండ్’ సినిమా వార్తలు ఫాలో అయ్యే వారిని కొంతమేర ఆకర్షించింది. మరి సినిమాలో రంజింపజేసే అంశాలు ఉన్నాయో లేదో మీరే చూడండి.
కథేంటి?
సంతోష్‌కి (సుధీర్‌వర్మ) ఫోటోగ్రఫీ హాబీ. దీపుని (ధన్య) తొలిచూపులోనే ప్రేమించిన సంతోష్ ఆమెని కూడా తన ప్రేమలో పడేస్తాడు. కానీ వీరిద్దరి ప్రేమ ఎక్కువ కాలం నిలవదు. దీపు వేరే పెళ్లి చేసుకుంటుంది.
సుబ్బారావు (కిరీటి) జెంటిల్మెన్. పెళ్లి చూపుల్లోనే స్వేఛ్ఛపై (ధన్య) మనసు పారేసుకుంటాడు. కానీ ఆమెకి ఆల్రెడీ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, అతనితో ఆమె చాలా దూరం వెళ్లిందని తెలుసుకుంటాడు. అయినా కానీ ఆమెని పెళ్లి చేసుకుంటాడు కానీ సుబ్బారావు జీవితం ఆమె వల్ల చిందర వందర అవుతుంది.
సహస్ర (ధన్య) తన రూమ్‌మేట్ అయిన చైతన్య (విష్ణు) ప్రేమలో పడుతుంది. ప్రేమ మత్తులో ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ ప్రేమకథతో పాటు మిగిలిన వాళ్ల ప్రేమకథలు ఎలా ఎండ్ అయ్యాయి, వారికి పరిష్కారం ఎలా దొరుకుతుంది అనేది ‘సెకండ్ హ్యాండ్’.
కళాకారుల పనితీరు!
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో మహేష్‌ని చూడగానే ఫ్లాట్ అయిపోయే క్యారెక్టర్ చేసిన ధన్య బాలకృష్ణన్‌కి ‘సెకండ్ హ్యాండ్’తో హీరోయిన్‌గా ప్రమోషన్ లభించింది. హీరోయిన్‌గా చేసిన ఫస్ట్ మూవీలోనే మూడు క్యారెక్టర్స్‌లో నటించే అవకాశం రావడం ఆమె అదృష్టం. స్వేఛ్ఛ పాత్రలో ఆమె నటన బాగుంది. మిగిలిన క్యారెక్టర్స్‌లో ఫర్వాలేదనిపించింది.
ముగ్గురు హీరోల్లో సుబ్బారావుగా కిరీటి ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు. అతని క్యారెక్టరైజేషన్ ఫన్నీగా ఉండడంతో నవ్వులు పూసాయి. సుధీర్‌వర్మ నటన యావరేజ్‌గా ఉంది. శ్రీవిష్ణు కూడా తన వంతు న్యాయం చేసాడు. పోసాని కృష్ణమురళి ‘జ్ఞానోదయం’ కలిగించే అతిథి పాత్రలో కనిపించాడు.
సాంకేతిక వర్గం పనితీరు:
సంగీతం జస్ట్ ఓకే. మళ్లీ వినాలనిపించే పాటలేమీ లేవు. సినిమాటోగ్రఫీ బాలేదు. రామ్‌గోపాల్‌వర్మ సినిమాల్లో మాదిరిగా అవసరం లేని ఎక్స్‌ట్రీమ్ క్లోజప్ షాట్స్, జూమ్‌లు డామినేట్ చేశాయి. కొన్ని సీరియస్ సీన్స్‌లో కూడా ఈ టెక్నిక్ ఫాలో అవడం ఆకట్టుకోదు. సంభాషణలు బాగానే ఉన్నాయి. సుబ్బారావుకి రాసిన డైలాగ్స్ కొన్ని నవ్విస్తాయి.
దర్శకుడు స్క్రీన్‌ప్లే పరంగా క్రియేటివిటీ ప్రదర్శించాడు. అయితే ఫస్ట్ హాఫ్‌లో కనిపించిన సృజనాత్మకత సెకండ్ హాఫ్‌లో కనుమరుగైంది. సుబ్బారావు ఎపిసోడ్‌ని బాగా డీల్ చేసాడు. డైరెక్టర్ రవిబాబు చిత్రాల్లో ఉండే తరహా కామెడీతో ఈ పార్ట్ ఆకట్టుకుంటుంది. సంతోష్ ఎపిసోడ్ యావరేజ్‌గా ఉంటే, సహస్ర ఎపిసోడ్ సహనాన్ని పరీక్షిస్తుంది. ప్రథమార్థంలో ఉన్న వినోదాన్ని ద్వితీయార్థంలో కూడా కొనసాగించడానికి దర్శకుడు అంతగా కృషి చేయలేదు. ఫలితంగా వేగం మరీ మందగించి ‘సెకండ్ హ్యాండ్’ నిరాశపరుస్తుంది.
హైలైట్స్:
- సుబ్బారావు కొరడా కామెడీ
డ్రాబ్యాక్స్:
- సెకండ్ హాఫ్
విశ్లేషణ:
యువతరం ప్రేమలు ఎలా ఉంటున్నాయనేది వీలయినంత పచ్చిగా చూపిస్తూ యూత్‌ని ఆకట్టుకోవడానికి ఈమధ్య మన యువ దర్శకుల్లో చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ‘ఈ రోజుల్లో’, ‘బస్‌స్టాప్’ సినిమాల్తో స్టార్ట్ అయిన ఈ ట్రెండుని యూత్‌ఫుల్ లవ్‌స్టోరీస్ పేరిట చాలా మంది ఫాలో అయిపోతున్నారు. గత వారం విడుదలైన ‘ప్రేమ ఇష్క్ కాదల్’ కూడా ఇదే టైప్ సినిమా. ఇప్పుడు ప్రేమలు ఎలా ఉంటున్నాయి, అమ్మాయిలు, అబ్బాయిలు ఎంత స్వార్థంగా వ్యవహరిస్తున్నారు వంటి పాయింట్స్‌ని చర్చిస్తూ యూత్‌కి తమ సినిమాలు ఈజీగా కనెక్ట్ కావాలని చూస్తున్నారు.
‘ప్రేమ ఇష్క్ కాదల్’లానే ఇది కూడా క్లాస్ టచ్ ఉన్న యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ. అదే కథని దర్శకుడు డిఫరెంట్‌గా చెప్పే ప్రయత్నం చేసాడు. హీరోయిన్ క్యారెక్టర్‌ని అతను తన స్క్రీన్‌ప్లేకి వాడుకున్న తీరు ప్రశంసనీయం. అయితే ఇంటర్వెల్ వరకు చూపించిన కొత్తదనాన్ని దర్శకుడు ద్వితీయార్థంలో మెలోడ్రామాతో చెడగొట్టాడు. ఎప్పుడైతే హీరోయిన్ రియల్ స్టోరీ స్టార్ట్ అయిందో సెకండ్ హ్యాండ్ దూకుడు పూర్తిగా మందగించింది. కనీసం క్లయిమాక్స్‌తో అయినా పైకి లాగుతారేమో అని చూస్తే, మోరల్స్ క్లాస్‌తో చిరాకు పెట్టి ముగించేశారు.
ఫస్ట్ హాఫ్‌లో చూపించిన కొత్తదనం, అక్కడ పండిన వినోదం అలాగే కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేసినట్టయితే ‘సెకండ్ హ్యాండ్’ ఫలితం మరోలా ఉండేది. హీరోయిన్ నెరేట్ చేస్తున్న కథలోకి దర్శకుడు చొరబడి మూడ్ మరింత స్పాయిల్ చేసాడు. అతని కామెడీ పండకపోగా సెకండ్ హాఫ్‌కి మరింత చేటు చేసింది.
బోటమ్ లైన్: సెకండ్ హాఫ్ బ్యాడ్
– జి.కె