దాసరి నారాయణరావు గారు బహుముఖప్రజ్ఞాశాలి. ఆయన అనేక విధాలుగా, అనేక కారణాలతో ఎప్పణ్నుంచో వార్తల్లో వుంటూ వచ్చారు. కానీ ప్రస్తుతం బొగ్గు కుంభకోణం కారణంగా ఆయన పేరుకు బాగా మసి అంటింది. పత్రికల వాళ్లు ఆయన విషయాలన్నీ కూపీ లాగుతున్నారు. పుకార్లకు నిలయమైన తెలుగు సినీరంగానికి వచ్చి అడిగితే వాళ్లు చాలాచాలా విషయాలు చెప్తున్నారు. నిజమెంతో, అబద్ధమెంతో తెలియదు కానీ వాళ్లు చెప్తున్న విషయాలివి – '2004లో అనుకోకుండా మంత్రి అయ్యే సమయానికి దాసరి చాలా ఆర్థికపరమైన కష్టాల్లో మునిగివున్నారు. ఆయన పెట్టుబడి పెట్టిన వ్యాపారాలనేకం దెబ్బతిని వున్నాయి. కొన్ని అప్పులు తీర్చడానికి చెన్నయిలో ప్రసాద్ స్టూడియోస్ ఎదురుగా వున్న తన స్కూలును తమిళనాడు కాంగ్రెసు నాయకుడు వాళప్పాడి రామమూర్తికి 2001లో అమ్మచూపారు. అడ్వాన్సు యిచ్చాక రామమూర్తి చనిపోయారు. డీల్ పూర్తి కాలేదు. అప్పులవాళ్లు దాసరిని హింసిస్తూండేవారు. మంత్రిపదవి వచ్చిన నెల్లాళ్లకే దాసరి తన బాకీదారులందరినీ పిలిచి 3.75 కోట్ల రూ.ల అప్పులు తీర్చేశారు.
'ఇక ఆ తర్వాత దాసరి భారీ సినిమాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకోసాగారు. ''జై చిరంజీవ'' సినిమా నైజాం, వైజాగ్ పంపిణీ హక్కులకై రూ.6 కోట్లు చెల్లించారు. సినిమా ఫెయిలయింది. తర్వాత ''సైనికుడు'', ''సూపర్'', ''బాలు'', ''దేశముదురు'' యిలా 40 పెద్ద సినిమాల హక్కులు ఆయన తీసుకున్నారు. వీటిలో చాలా సినిమాలు అపజయం పాలైనా తన కంపెనీకి లాభాలు వస్తున్నట్లే చూపిస్తూ వచ్చారాయన. 2006లో రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన సందర్భంగా తన ఆస్తులను ప్రకటించినపుడు వాటిలో సిరి మీడియా, సౌభాగ్య మీడియాల గురించి ప్రస్తావనే లేదు. కాగా చిన్నచిన్న వస్తువుల విలువ కూడా చూపించారు. ఎయిర్ కూలర్ (విలువ రూ.2736), టైప్ మిషన్ (1938), టేపు రికార్డరు (949), కంప్యూటరు (4015), ఎయిర్ కండిషనర్ (2313). ఆషాడభూతి కథలో పూచికపుల్ల వుదంతం గుర్తుకు వస్తోందా?
దాసరి 2004-08 మధ్య బొగ్గు శాఖలో సహాయమంత్రిగా పనిచేశారు. బొగ్గులో యింత డబ్బు ఎలా వస్తుంది అంటే 'సి' గ్రేడ్ బొగ్గును అతి తక్కువ నాణ్యత కలిగిన 'ఎఫ్' గ్రేడ్ బొగ్గుగా చూపించి గనులను కొన్ని కంపెనీలకు ఎలాట్ చేస్తారు. ఆ కంపెనీలు కృతజ్ఞతాపూర్వకంగా మంత్రి తాలూకు కంపెనీలలో డబ్బు వేస్తారు. జిందాల్ కంపెనీవారికి 2008లో జార్ఖండ్‌లోని అమరకొండ ముర్గాదంగల్ కోల్ బ్లాక్‌ను ఎలాట్ చేసినందుకు ప్రతిఫలంగా ఒక ఏడాదిలోపున జిందాల్ కంపెనీ దాసరి కంపెనీలు సిరి, సౌభాగ్యలలో 2.25 కోట్ల రూ.లు వేశారని సిబిఐ తన చార్జిషీటులో ఆరోపించింది. ఇలాటివి జరగకుండా బొగ్గుగనులను వేలం వేసేట్లా ఆర్డినెన్సు తేవాలని బొగ్గు శాఖ సెక్రటరీ పిసి పరేఖ్ సూచిస్తే దాసరి, అప్పటి న్యాయశాఖ మంత్రి, ప్రస్తుత కర్ణాటక గవర్నర్ ఎచ్.ఆర్.భరద్వాజ్ (ఈయనే మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నరుగా వస్తారని పుకారు) కలిసి కొట్టి పారేశారు. వింత ఏమిటంటే యిప్పుడు సిబిఐ పరేఖ్‌ను కూడా దోషిగా నిలబెట్టింది. ఇప్పుడాయన దాసరిపై వేలు చూపుతున్నారు.
దాసరి 'నాదేం లేదు, నేను సహాయమంత్రిని మాత్రమే, ప్రధానమంత్రి కార్యాలయం ఏం చెపితే అదే చేశాను' అంటున్నారు. కానీ దాసరి స్వభావం గురించి టివి జర్నలిస్టు శ్రీనివాసన్ జైన్ 'బిజినెస్ ఇండియా'లో వ్యాసం రాస్తూ ఒక విషయాన్ని వెల్లడించారు. 'పరేఖ్ హైదరాబాదు నివాసంలో సిబిఐ సోదా చేసినపుడు 'దాసరికి నీతినియమాలు లేవు, ఆయన ధనదాహానికి మితి లేదు' అని రాసివున్న కాగితం దొరికిందట. అయితే ఆ కాగితంపై ఎవరి సంతకమూ లేదు. దాసరి ప్రస్తుతం ''అసెంబ్లీలో దొంగలుపడ్డారు'' అనే సినిమా తీయబోతున్నారు. ''పార్లమెంటులో..'' అని మార్చి తీస్తే స్వీయానుభవాలు కూడా రంగరించవచ్చు.
– ఎమ్బీయస్ ప్రసాద్