అసలు హత్య జరిగిన వారం రోజులకే పోలీసు ఐజి గురుదర్శన్ సింగ్, నిందితుడు రాజేష్ తల్వారే అనేశాడు. 'ఆ రోజు రాజేష్ తెల్లవారుఝామున 3 గంటల దాకా మేలుకుని యింటర్నెట్‌తో పని చేసుకుంటున్నాడు. ఎందుకంటే యింటర్నెట్ రౌటర్ 3 గంటలదాకా పని చేస్తూనే వుంది. (12 గంటల తర్వాత యింటర్నెట్ వాడలేదని మరో కథనం వుంది) అది కట్టేసేసరికి అతనికి ఆరుషి గదిలో చప్పుళ్లు వినబడ్డాయి. వెళ్లి చూశాడు. హేమరాజ్, ఆరుషిని సన్నిహితంగా చూశాడు. విపరీతమైన కోపంతో ఒక దుడ్డుకర్రలాటి (అది రాజేష్ గాల్ఫ్ క్లబ్ కావచ్చు) తో దానితో యిద్దరి తలల మీద బాదాడు. నూపుర్ లేచి వచ్చి అతనికి సాయపడింది. డాక్టర్లకుండే సహజమైన లాఘవంతో సన్నటి చాకుతో యిద్దరి గొంతులూ కోసి చంపేశారు. హేమరాజ్ శవాన్ని డాబా మీదకు చేర్చి తాళం వేసేశారు. ఇక ఆరుషి శరీరంపై శృంగారానికి సంబంధించిన జాడలు ఏవీ కనబడకుండా శుభ్రం చేసేశారు. ఆ ప్రదేశంలో సాక్ష్యాలు లేకుండా చూసి, ఆమె శవంపై దుప్పటి కప్పేశారు. రాజేష్ నెర్వస్‌గా ఫీలయ్యాడు. వెళ్లి బార్ తెరిచి విస్కీ బాటిల్ తెరిచి కాస్త తాగాడు. దాని మీద హతుల యిద్దరి రక్తపు నమూనాలు వున్నాయి. ఇద్దర్నీ చంపినది ఒక్కరే. అది రాజేష్. పరువుకోసం చేసిన హత్య యిది' అని సింగ్ కథనం.
చాలామంది దాన్ని విశ్వసించారు. మే 31న సిబిఐకు అప్పగించారు. జులై 11 న రాజేష్ బెయిల్లో బయటకు వచ్చాడు. ఇక అతన్ని కేసు నుండి తప్పించడానికి సిబిఐ జాయింటు డైరక్టరు అరుణ్ కుమార్ ప్రయత్నించసాగాడు. హేమరాజ్‌ను ఎవరు ఎందుకు చంపారు? అన్నదానికి సమాధానం చెప్పాలి కాబట్టి, ముగ్గురు పనివాళ్లను వేదికపైకి తీసుకుని వచ్చాడు. రాజేష్ వద్ద పనిచేసే కృష్ణ అనే పనివాడు, పక్కింట్లో పని చేసే విజయ్ మండల్, తల్వార్ల స్నేహితులు దురానీల యింట్లో పనివాడు రాజ్‌కుమార్ ముగ్గురు కలిసి హేమరాజ్ గదిలో మందు కొట్టారని, హేమరాజ్ వారిస్తున్నా ఆరుషిపై బలాత్కారం జరిపి, చంపి, ఆ తర్వాత హేమరాజ్‌ను చంపారని వాదించారు. వాళ్లపై నార్కో టెస్టులు జరిపి నిజాలు రాబట్టామని చెప్పారు. హేమరాజ్ శవాన్ని మెట్లమీదకు లాక్కుని వెళ్లిన గుర్తులు లేవని, హేమరాజ్, కృష్ణ డాబా మీదనే ఘర్షణ పడ్డారని, అక్కడే హేమరాజ్ హత్యకు గురయ్యాడని చెప్పాడు. ఆ కథనంలోనూ చాలా లోపాలున్నాయి. కోర్టులో చెపితే నిలిచేట్లు లేదు. 14 నెలలు గడిచేసరికి అరుణ్ కుమార్‌ను తప్పించి కౌల్ అనే ఆయన్ని యిన్వెస్టిగేషన్ ఆఫీసరుగా తీసుకుని వచ్చారు. 15 రోజుల్లో కేసు స్వరూపం మారిపోయింది. ముగ్గురు పనివాళ్లు నిరపరాధులనీ, రాజేషే ప్రధాన నిందితుడే కానీ నిరూపించేందుకు సాక్ష్యాలు లేవు కాబట్టి కేసు మూసేయాలని విజ్ఞప్తి చేసింది.
అయితే రాజేష్ యీ మచ్చను సహించలేకపోయాడు. ఎందుకంటే ఆరుషి-హేమరాజ్ అక్రమసంబంధం సిద్ధాంతం నమ్మబుద్ధిగా లేదు కాబట్టి, ఆమె క్లాస్మేట్స్, స్నేహితులు ఎవరూ ధృవీకరించలేదు కాబట్టి, రాజేష్‌కు, అనితా దురానీ అనే డెంటిస్టుకి సంబంధం వుందని, అదే యీ హత్యలకు మూలకారణమనీ మరో పుకారు బయటకు వచ్చింది. అనిత, అతను కలిసి రోజూ ఉదయం నోయిడాలో ఒకే క్లినిక్‌లో పనిచేస్తారు. అదే క్లినిక్‌లో సాయంత్రం అనిత భర్త, రాజేష్ భార్య కలిసి పనిచేస్తారు. రెండు జంటలూ చాలా స్నేహంగా వుంటాయి. హేమరాజ్ యీ విషయాలు గ్రహించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, అవేళ రాత్రి రాజేష్ కోపం పట్టలేక హేమరాజ్ తల బద్దలు కొడితే ఆరుషి నిలదీసిందని, అందుకే కోపావేశంలో ఆమెనూ చంపివేశాడనీ అనసాగారు. హేమరాజ్ భార్య నేపాల్ నుండి వచ్చి 'తమ కుటుంబరహస్యాలు బయట పెడుతున్నందుకు తిడుతున్నాడనీ, బెదిరిస్తున్నాడనీ హేమరాజ్ తరచూ వాపోయేవాడ'ని మీడియాతో చెప్పింది. ఈ గొడవల కారణంగా రాజేష్ సిబిఐ రిపోర్టును ఛాలెంజ్ చేస్తూ పరిశోధన యింకా సాగించాలని కోరాడు. బయట మీడియాలో పరువునష్టం దావా వేస్తానని బెదిరించాడు. ఎందుకంటే బయట ప్రజలు రాజేష్, నూపుర్లే యీ హత్య చేసి వుంటారని బలంగా నమ్మసాగారు.
అలా కోరడమే రాజేష్ కొంప ముంచింది. 2012 జూన్ నుండి సిబిఐ కేసుని తిరగదోడింది. పోస్టుమార్టమ్ చేసిన డాక్టరును తలమీద గాయాల గురించి ఎందుకు రాయలేదని అడిగింది. అతను తన స్టేటుమెంటు మార్చాడు. చివరకు జడ్జి రాజేష్, నూపుర్‌లను హత్య చేసినందుకు గాక, సాక్ష్యాలు తారుమారు చేసినందుకు శిక్షించారు. ఆ నలుగురు తప్ప ఆ రాత్రి ఆ యింట్లో వేరే ఎవరూ లేరని, ఆరుషి తలుపు తీసి హేమరాజ్‌ను తన గదిలో రప్పించుకుందని కోర్టు అభిప్రాయపడింది. డిఫెన్సు తరఫున వచ్చిన సాక్ష్యాలను కోర్టు విశ్వసించలేదు. ఆరుషి, హేమరాజ్‌ల సెల్ ఫోన్లు మాయం కావడం కూడా మిస్టరీగా వుంది. బయటి హంతకుడు యిన్ని జాగ్రత్తలు తీసుకుంటాడా అని కోర్టు సందేహం.
ఆరుషి తలిదండ్రులు అమాయకులని యిప్పటికీ చాలామంది నమ్ముతున్నారు. 45 ఏళ్ల హేమరాజ్ బంజాడేకి వాళ్ల నేపాల్ దేశంలో భార్యాబిడ్డలే కాదు, మనుమడు కూడా వున్నాడు. ఎనిమిది నెలల క్రితమే పనిలో చేరాడు. అతన్ని 14 ఏళ్ల ఆరుషి దగ్గరకు రానిస్తుందా? అర్ధరాత్రి తలుపు తీసి ఆహ్వానిస్తుందా? అని విస్తుపోతున్నారు. ఈ విషయాలపై చర్చించినకొద్దీ వెగటు పుట్టి యీ వెర్షన్ నమ్మబుద్ధి కాదు. కానీ అలా అయితే చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి వుంటుంది – బయటనుండి బలవంతంగా ఆ యింట్లోకి గాని, ఆమె గదిలోకిగాని వేరెవరో చొరబడినట్లు కనబడటం లేదు. ఆరుషి గది తలుపులో తాళం చెవి ఆ రాత్రి వదిలేశానని నూపుర్ చెప్పినది ఎంతవరకు నిజమో తెలియదు. బయటనుండి వచ్చిన హంతకుడైతే బార్ వద్దకు వెళ్లి ధైర్యంగా విస్కీ తాగడు. తలిదండ్రులు ఏ క్షణాన్నయినా లేస్తారన్న భయం వుంటుంది. 'మేం మా తలుపులు బిడాయించుకుని ఎసి వేసుకుని పడుక్కున్నాం. మాకేమీ వినబడలేదు' అంటున్నారు రాజేష్, నూపుర్లు. అయితే ఆ రాత్రి ఇంటర్నెట్ రౌటర్ని ఎవరో గానీ మధ్యమధ్యలో ఆన్ చేసి, ఆఫ్ చేస్తున్నారు. ఇది 3 గంటల దాకా సాగింది. రాజేష్ నిద్రపోయి వుంటే నెట్ వాడినవారెవరు? హేమరాజ్ శవాన్ని డాబాపైకి యీడ్చిన హంతకుడు తర్వాత శవంపై కూలర్ గ్రిల్ పెట్టాడు. ఆ గ్రిల్ తీయడంలో అతని చేతుల కంటిన రక్తం కూలరు నీళ్లలో కలిసింది. హంతకుడు ఆ తర్వాత టెర్రేస్ తలుపు తాళం పెట్టి మళ్లీ యింట్లోకి ప్రవేశించాడు. డైనింగ్ టేబుల్ పక్కన మామూలుగా అందరికీ కనబడకుండా ఉడెన్ ప్యానెల్ వెనక్కాల వుండే బార్ తెరిచి విస్కీ తాగాడు. బయటివాడెవడైనా అయితే యింత అవస్థ ఎందుకు పడతాడు? శవాన్ని దాని మానాన్న దాన్ని వదిలేసి పారిపోతాడు. వచ్చి తీరిగ్గా మందు కొట్టడు.
అందువలన యిది కచ్చితంగా ఇంటి సభ్యుల పనే. రాజేష్ కాకపోతే మరెవరు చేశారో చెప్పవలసినది వారే! మద్యం ముట్టని హేమరాజ్ గదిలో మద్యపు సీసాలు ఎలా వున్నాయి? వంటి చిక్కు వీడని ముళ్లు ఇప్పటికి కూడా చాలా వున్నాయి. కావాలని గందరగోళ పరచిన కేసులో యివి తప్పవు. గందరగోళ పరిచినదెవరు? అంటే హంతకులే అయి వుండాలి. రాజేష్ దంపతుల్లో కూతురు హంతకులను పట్టించాలన్న ఆతృత కంటె కావాలని సాక్ష్యాలను చెరిపివేయించాలన్న తపన స్పష్టంగా కనబడుతోంది కాబట్టి, వారినే అనుమానించాలి. ఆ విధంగా చూస్తే తీర్పు సబబే. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2013)