రివ్యూ: సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు
రేటింగ్: 2.25/5
బ్యానర్: శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్
తారాగణం: రాజ్ తరుణ్, అర్తన, రాజా రవీంద్ర, ఎన్. శంకర్, షకలక శంకర్, రణధీర్, ఆదర్శ్, సురేఖా వాణి, శ్రీలక్ష్మి, హేమ తదితరులు
సంగీతం: గోపీ సుందర్
కూర్పు: కార్తీక శ్రీనివాస్
ఛాయాగ్రహణం: విశ్వ .డి.బి
నిర్మాతలు: ఎస్. శైలేంద్రబాబు, కె.వి. శ్రీధర్‌రెడ్డి, హరీశ్ దుగ్గిశెట్టి
రచన, దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి
విడుదల తేదీ: జనవరి 29, 2016
మూడు వరుస హిట్లు సాధించిన రాజ్ తరుణ్‌కి మిగిలిన యువ హీరోలకి తెలియని కిటుకులు ఏవో తెలుసనిపించింది. కథల జడ్జిమెంట్‌పై అతనికి పూర్తి పట్టు ఉందనిపించింది. అలాంటి అపోహలన్నీ తొలగించి, తాను కూడా రాంగ్ స్టోరీలకి ఓటేస్తానని చాటుకోవడానికి 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' చేసినట్టున్నాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు మూడు హిట్ సినిమాలు చేసిన రాజ్ తరుణ్‌కి ఇందులో అంతగా ఏం నచ్చిందా అనిపిస్తుంది. ఈ కథలో ఏముందని ముగ్గురు నిర్మాతలు ముందుకొచ్చి దీనికి డబ్బులు పెట్టారా అనే సందేహం అడుగడుగునా కలుగుతుంది.
రామయ్య, సీతమ్మల రామాయణమంత పురాతనమైనదీ 'సిత్రం'. వందల కొద్దీ సినిమాల్లో చూసేసిన ప్రేమకథనే ఏమాత్రం ఆసక్తి కలిగించని విధంగా, ఎక్కడా ఉత్కంఠత రేకెత్తించకుండా అలా చప్పగా తీసుకుంటూ పోతూ ఉంటే, బొత్తిగా సినీ పరిజ్ఞానం లేని వారికి కూడా 'సాగదీత్తున్నాడు.. స్టోరీ లేనట్టుంది' అనిపించేస్తుంది. చెడ్డీలేసుకుని తిరిగేటప్పుడే పీకల్లోతు ప్రేమలో పడిపోయిన రాము ఇంటర్ దాట్టానికి తంటాలు పడుతూ వుంటాడు. ఈలోగా సీత ఎంబిబిఎస్ చదివేస్తూ ఉంటుంది. ఇతడిని ప్రేమించడానికి ఏ అమ్మాయికైనా, ఇతనికి పిల్లనివ్వడానికి ఏ పిల్ల తండ్రికైనా ఒక్క క్వాలిఫికేషన్ కనిపించదు. కానీ తెలుగు సినిమా హీరోలంతే.. ఇలాగే ఉంటారన్నది దర్శకుడి ఫిలాసఫీ కాబోలు.
ఒక సీన్‌లో పనీ పాటా లేకుండా తిరుగుతున్నాడని తనని తిడుతున్న తల్లితో హీరో అంటాడు.. అన్ని సినిమాల్లో ఫస్ట్ హాఫ్‌లో హీరోలు ఖాళీగానే తిరుగుతారు, సెకండ్ హాఫ్‌లో బిజీ అయిపోతారని. సరే ఆ ఇంటర్వెల్ ఏదో కానిచ్చేస్తే ఇతను బిజీ అవుతాడేమో చూద్దామనుకుంటే, అయ్యవారు నిప్పుల గుండంపై నడిచేయగానే డాక్టరీ చదువుతోన్న అమ్మాయిగారు అందాకా అతనిలో కనిపించని గొప్ప లక్షణాలేవో చూసేసి కౌగిలించేసుకుని ఒక సాంగేసుకుంటుంది. హీరోయిన్ ప్రేమించడానికి అలాంటి రేలంగి కాలం నాటి ఐడియాని రాసుకుని, దాంతో ఈకాలం నిర్మాతలు, హీరోని ఒప్పించేసిన దర్శకుడి స్కిల్స్ మెచ్చుకుని తీరాలి. ఇక అమ్మాయిగారు కూడా ప్రేమించేసారు కాబట్టి ఆమె వైపు పెద్దలు ఒప్పుకోవడమే తరువాయి.
నిప్పుల గుండం మీద నడిచిన హీరోని చూసి హీరోయిన్ ప్రేమలో పడిపోయినప్పుడు, ఆఫ్టరాల్ ఆమె తండ్రి, అన్నల్ని పడేయడం ఎంత సేపు? క్లయిమాక్స్ కోసమా అన్నట్టు క్రికెట్ పోటీ పెట్టారు. చిన్నప్పుడే బ్యాట్ వదిలేసిన బ్యాచ్ అంతా కలిసి ట్రెయిన్డ్ క్రికెటర్లపై ఆడి గెలవాలన్నమాట. నిజంగా అయితే హీరోగారి 'చోటా భీమ్' క్రికెట్ జట్టుని మట్టికరిపించడం క్షణాల పని కానీ ఇది సినిమా కదా. సినిమా అంతటా మాత్రమే కాదు చివరకు ఈ ఆటలో ఎప్పుడేం జరుగుతుందో కూడా ముందే ఊహించేస్తూ తలలు బాదేసుకుంటూ కాలక్షేపం చేసుకోవచ్చు. విలన్ జట్టుపై హీరో గెలిచేస్తే అందులో విషయం ఏముంటుంది? అందుకే టైగా ముగిసిన ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లో విజేతని చిట్టీలేసి నిర్ణయిస్తారు. అప్పుడు హీరోలో అతని కాబోయే మామకి ఒక ప్రేమికుడు, క్రికెట్టరు కనిపిస్తారట. నాసి రకం సన్నివేశాలన్నీ రాశి పోసినట్టు ఆద్యంతం విసిగించే ఈ సిత్రంలో ఒక్క చెప్పుకోతగ్గ సన్నివేశం లేదు. ప్రేమకథ కాబట్టి కదిలించే ఒక్క సీన్ అయినా ఉంటుందని ఆశిస్తే కనీసం రోలింగ్ టైటిల్స్ అప్పుడు వేసిన డిలీటెడ్ కట్స్‌లో కూడా దాని జాడ కనిపించదు. అన్నట్టు ఆ డిలీటెడ్ సీన్సే సినిమాలో ఉన్నవాటికంటే బెటర్ అనిపిస్తాయి. వీటి మధ్య అవి ఫిట్ కావట్లేదని కట్ చేసినట్టున్నారు.
రాజ్ తరుణ్ ఎందుకో రవితేజని అనుకరించే ప్రయత్నం గట్టిగా చేసాడు. ఈ జనరేషన్‌కి రవితేజ కాగలడని ఎవరో అంటుండగా విన్నట్టున్నాడు. కానీ అతను సహజంగా నటిస్తేనే చూడ్డానికి బాగుంటుంది. అలాగే కథల ఎంపికలో ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే మొదటి మూడు సినిమాలతో హిట్టు కొట్టాడనే సంగతి చాలా త్వరగా మరుగున పడిపోతుంది. అర్తన గురించి ప్రత్యేకించి చెప్పుకోడానికి ఏమీ లేదు. షకలక శంకర్ నవ్వించడానికి విఫలయత్నం చేసాడు. రాజా రవీంద్ర క్యారెక్టర్‌కి బిల్డప్ ఇచ్చారు కానీ సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు.
సంభాషణలు ఆకట్టుకోవు. పాటలు సైతం అంతంత మాత్రమే. ఏమాత్రం మేటర్ లేని సన్నివేశాలకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేయడం ఎంతటి పరీక్షో పాపం. సినిమాటోగ్రఫీ ఒక్కటే ఈ సినిమాలో చెప్పుకోతగ్గ ప్లస్ పాయింటు. విలేజ్ నేపథ్యం కావడంతో ఆ పచ్చదనం చూడ్డానికి కంటికి ఇంపుగా ఉంది. 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' అనే పొయెటిక్ టైటిల్ పెట్టిన దర్శకుడు తన ప్రేమకథలో ఆ భావుకత కాస్తయినా చూపించకపోవడం బాధాకరం. రొటీన్ కథే అయినా ప్రేమకథలో ఫీల్ వర్కవుట్ అయితే ఆడియన్స్ ఎంతగా కనెక్ట్ అవుతారనేది రీసెంట్‌గా 'నేను శైలజ'లో చూసాం. ఈ చిత్రంలో ఫీలయ్యే సీన్లే తప్ప ఫీల్ కలిగించే మూమెంట్స్ అంటూ ఏం లేవు. మొదటి మూడు సినిమాలతో అలవోకగా విజయాలు అందుకున్న రాజ్ తరుణ్‌కి ఈ చిత్రం పరీక్ష పెడుతుంది. కంటెంట్ అస్సలే లేని, క్రేజ్ కూడా అంతగా రాని ఈ చిత్రాన్ని అతను ఏమాత్రం మోస్తాడనేది చూడాలి. సినిమా కాబట్టి పల్లకీ మోసేసి, నిప్పుల మీద నడిచేసి, క్రికెట్ ఆడేసి లవ్ గెలిచేసాడు. బాక్సాఫీస్‌ని గెలవడం అంత ఈజీ కాదుగా మరి.
బోటమ్ లైన్: సీతారాముల సిత్రాలు… ప్రేక్షకుల తంటాలు!
– గణేష్ రావూరి