Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఉత్తమ విలన్‌

 సినిమా రివ్యూ: ఉత్తమ విలన్‌

రివ్యూ: ఉత్తమ విలన్‌
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌:
తిరుపతి బ్రదర్స్‌, రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌
తారాగణం: కమల్‌హాసన్‌, కె. బాలచందర్‌, నాజర్‌, కె. విశ్వనాధ్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, ఊర్వశి, పార్వతి మీనన్‌, జయరామ్‌, పార్వతి నాయర్‌, ఎం.ఎస్‌. భాస్కర్‌ తదితరులు
సంగీతం: జిబ్రాన్‌
కూర్పు: విజయ్‌ శంకర్‌
ఛాయాగ్రహణం: షామ్‌దత్‌
నిర్మాతలు: ఎన్‌. లింగుస్వామి, ఎన్‌. సుభాష్‌ చంద్రబోస్‌, ఎస్‌. చంద్రహాసన్‌
కథ, కథనం: కమల్‌హాసన్‌
దర్శకత్వం: రమేష్‌ అరవింద్‌
విడుదల తేదీ: మే 2, 2015

నటుడిగా ఎన్నో వైవిధ్యభరిత పాత్రలు పోషించినా కానీ ఇంకా కొత్తదనం కోసం అన్వేషించే కమల్‌హాసన్‌ ఈ క్రమంలో కొన్నిసార్లు బోరింగ్‌ సినిమాలు తీయవచ్చు కానీ యాక్టర్‌గా ఆయన ప్యాషన్‌ని మాత్రం క్వశ్చన్‌ చేయలేం. అరవయ్యేళ్ల వయసులోను కళాకారుడిగా ఆయన పడుతోన్న తపనకి అద్దం పడుతుంది ‘ఉత్తమ విలన్‌’. కమల్‌హాసన్‌ సినిమాలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేవనే కంప్లయింట్‌ ఇవ్వడం సరికాదు. ఎందుకంటే ఆయన అవసరం అనుకుంటే తప్ప వాటి జోలికి వెళ్లరు. తన సినిమానుంచి కేవలం వాణిజ్య విలువల్ని మాత్రమే ఆశించి వచ్చే ప్రేక్షకులు చాలా అరుదు. కమల్‌ సినిమాకి ఒక గొప్ప సినిమాని చూసిన అనూభూతి కోసం, ఒక మహానటుడి అభినయం వీక్షించిన ఆనందం కోసం వస్తుంటారు. దీంట్లో మొదటి దానిని ‘ఉత్తమ విలన్‌’ నెరవేర్చకపోయినా కానీ రెండో దానికి మాత్రం లోటుండదు. 

ఎమోషనల్‌ సీన్‌లో కమల్‌ నటిస్తుంటే ఇప్పటికి కొన్ని వందల సార్లు చూసి ఉంటాం. అయినప్పటికీ ఇంకోసారి కళ్లు చెమర్చేలా ఆయన కొన్ని సన్నివేశాల్లో తనలోని గొప్ప నటుడిని ఇంకొక్కసారి ఆవిష్కరించారు. ఇదో వయసు మళ్లిపోతున్న సినిమా నటుడి (కమల్‌హాసన్‌) కథ. తనని నటుడ్ని చేసిన గురువుని (బాలచందర్‌) కాదని, తను పెళ్లి చేసుకున్న భార్యని వదులుకుని.. తనని స్టార్ట్‌ చేస్తానన్న వ్యక్తి (విశ్వనాథ్‌) కూతుర్ని (ఊర్వశి) పెళ్లాడి అల్లుడవుతాడు. కమర్షియల్‌ సినిమాలెన్నో చేసిన అతనికి తన భవిష్యత్తు గురించిన భయంకరమైన నిజం ఒకటి తెలుస్తుంది. నటుడిగా కలకాలం గుర్తుండిపోయే సినిమా ఒక్కటి చేయాలని భావించి తన గురువుని కలిసి ‘ఉత్తమ విలన్‌’ అనే హాస్యభరిత జానపద చిత్రాన్ని చేద్దామని అడుగుతాడు. ఆ సినిమా, తన జీవితం సమాంతరంగా నడుస్తూ ఏ తీరం చేరతాయి? 

కెరీర్‌ కోసం అన్నీ వదిలేసుకుని మెకానికల్‌గా మారిన వ్యక్తికి తన జీవితంలోని చివరి మజిలీకి చేరుకున్నానని తెలియగానే అమాంతం తన తప్పులన్నీ కళ్లముందు మెదులుతాయి. నటుడిగా గుర్తుండిపోయే సినిమా ఒక్కటైనా చేయాలనే కోరిక అతడ్ని పరుగులు తీయిస్తుంది. తనకి తెలీకుండానే తనకో కూతురుందని, ఆమె తనని అమితంగా ద్వేషిస్తోందని తెలుస్తుంది. తనకేం జరుగుతుందో అర్థం చేసుకునే ఓపిక లేని భార్య తనని విడిచి పోతుంది. స్క్రీన్‌ప్లే రైటర్‌ అయి తన తండ్రితో ఒక అద్భుతమైన చిత్రం చేద్దామని తన కొడుక్కి ఉన్న బలమైన కోరిక ఎప్పటికీ తీరదనే వేదన మెలిపెడుతుంది. ఇలా ఇందులోని ‘మనోరంజన్‌’ పాత్ర చుట్టూ బోలెడంత ఎమోషన్‌ ఉంటుంది. చావుకి దగ్గర పడిన హీరోల్ని చాలా మందినే చూసినా కానీ, ఈ తరహా పాత్రలు కమల్‌ కూడా చేసినా కానీ ఇందులోని చాలా సన్నివేశాలు కదిలిస్తాయి. 

తనకంటే వయసులో చాలా చిన్నవాడైన శిష్యుడు అర్ధాంతరంగా తమని వదిలేసి పోతాడని తెలిసినపుడు ఆ గురువు పడే వేదన, తన తండ్రి ఇక తనకి ఉండడని తెలిసినపుడు ‘వై యూ’ అంటూ కొడుకు పెట్టే కన్నీళ్లు, తన యజమాని శ్రేయస్సుని కోరుకున్న వ్యక్తి అతనికి చేసిన నమ్మక ద్రోహాన్ని విన్నవించుకునే వైనం... ఇలా కొన్ని సాలిడ్‌ సీన్స్‌ ఈ చిత్రానికి వెన్నుదన్నుగా నిలిచాయి. అయితే గుర్తుండిపోయే సినిమా చేయాలని అనుకున్న మనోరంజన్‌ అందుకోసం చేసే సినిమాలోని సన్నివేశాలు మాత్రం పేలవంగా తయారయ్యాయి. మొదట్లో కాస్త హాస్యంతో నడిచినా కానీ రాను రానూ అవి అసలు కథకి అవరోధంగా మారి... సినిమాతో ప్రేక్షకుడు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయిన ప్రతిసారీ డిస్‌కనెక్ట్‌ అయిపోయేలా చేసాయి. ఇలా సినిమాని, జీవితాన్ని కలిపి నడిపించే స్క్రీన్‌ప్లేలో విషయమున్నా కానీ వాటి మధ్య సమతూకం కుదర్లేదు. 

ఒక కథలో ఎమోషన్‌ డామినేట్‌ చేస్తుంటే, మరో కథలో ఎంటర్‌టైన్‌మెంట్‌ హైలైట్‌ అవ్వాలనేది కథకుడిగా కమల్‌హాసన్‌ ఉద్దేశం. కానీ మెయిన్‌ ప్లాట్‌లో ఎమోషన్‌ పండినట్టుగా, సబ్‌ ప్లాట్‌లో వినోదం పండలేదు. ద్వితీయార్థానికి వచ్చేసరికి కమల్‌, నాజర్‌ మధ్య సన్నివేశాలు చాలా ఇరిటేట్‌ చేస్తాయి. ఒక మంచి సీన్‌ తర్వాత వెంటనే కథ ఈ కామెడీ బ్యాక్‌డ్రాప్‌కి షిఫ్ట్‌ అయి ఫీల్‌ క్యారీ అవడానికి వీల్లేకుండా చేసింది. ఆ సినిమా తాలూకు సన్నివేశాలే కనుక సవ్యంగా ఉన్నట్టయితే ‘ఉత్తమ విలన్‌’ మనోరంజన్‌ కోరుకున్నట్టు ఒక మర్చిపోలేని సినిమా అయి ఉండేది. దర్శకుడిగా రమేష్‌ అరవింద్‌ ఎమోషనల్‌ సీన్స్‌ బాగా తీసాడు. కానీ అతని అనుభవానికి మించిన కథని కమల్‌ అతని చేతిలో పెట్టాడేమో అనిపిస్తుంది. తన జీవితానికి సంబంధించిన కొన్ని రిఫరెన్సులు అవీ చూస్తే ఇది కమల్‌కి చాలా పర్సనల్‌ ఫిలిం అనే భావన కలుగుతుంది. అలాంటప్పుడు తనే డైరెక్ట్‌ చేసినట్టయితే ఆ ఎఫెక్ట్‌ వేరేలా ఉండేదేమో. 

కమల్‌హాసన్‌ నటన గురించి కొత్తగా చెప్పేదేముంది. తన అద్భుతమైన నటనతో ఇంత వీక్‌ సినిమాని కూడా చాలా వరకు నిలబెట్టగలిగారు. నిజంగానే గురుశిష్యులైన బాలచందర్‌, కమల్‌ మధ్య సన్నివేశాలు, సంభాషణలు చాలా సహజంగా ఉన్నాయి. సపోర్టింగ్‌ కాస్ట్‌ అందరూ కూడా తమ వంతుగా చేయగలిగింది చేసారు. జిబ్రాన్‌లోని మరో కోణం ఈ చిత్రంలో కనిపిస్తుంది. అతని నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోసింది. ఛాయాగ్రహణం బాగుంది. అవసరానికి మించిన నిడివి ఈ చిత్రానికి మైనస్‌ అయింది. ఇంత ఎమోషనల్‌ సినిమాని వీలయినంత తక్కువ సమయంలో ముగించినట్టయితే బాగుండేది. 

కమల్‌హాసన్‌ కోసమే సినిమా చూడాలని అనుకునే వాళ్లు నిస్సందేహంగా ‘ఉత్తమ విలన్‌’ చూడొచ్చు. వినోదం కోసమో, కాలక్షేపం కోసమో వెళితే మాత్రం ఈ చిత్రం బాగా విసిగిస్తుంది. అడపాదడపా వచ్చే కొన్ని మంచి సన్నివేశాలు ఒక మంచి చిత్రం కాలేవు. వాటి మధ్య ప్రేక్షకుల దృష్టి పక్కకి మరలని పకడ్బందీ కథనం కూడా ఉండాలి. కమర్షియల్‌ సక్సెస్‌ మాట ఎలా ఉన్నా కానీ కనీసం ఒక మంచి సినిమాగా గుర్తుండిపోవడానికి అయినా కథా గమనం ‘ఉత్తమం’గా ఉండి తీరాలి. దురదృష్టవశాత్తూ ‘ఉత్తమ విలన్‌’ కమల్‌ నుంచి వచ్చిన ఒక సగటు చిత్రంగానే మిగిలిపోతుంది తప్ప ఉత్తమ చిత్రమనిపించుకోదు. 

బోటమ్‌ లైన్‌: ఉత్తమ నటుడు... సాధారణ చిత్రం!

గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?