గుడికి వెళ్లి దేవుడినో, దేవతనో దర్శించుకోవటం చేస్తుంటాం.
ఆ దేవతా విగ్రహాలు నిజానికి నగ్నరూపాలే. నిజరూప దర్శన సమయంలో తప్ప అసలు భగవత్ స్వరూపం కనిపించదు.
దేవాలయ గోడల విూదనో, గోపురాలపైననో కథా ఘట్టాలతో, అనేక భంగిమలలో, స్త్రీ పురుష శిల్పాలు కనిపిస్తుంటాయి … నగ్నంగాను, అర్థనగ్నం గాను.
పసి పిల్లల నుండి పండు ముదుసలుల దాకా ఆ మూర్తులను చూస్తూనే ఉంటారు… అప్పుడు అసభ్యం అనిపించదు… అశ్లీల భావన రాదు… అలాగే వర్ణచిత్రాలలో, నృత్య భంగిమలలో.
నగ్నత్వం, ఆధ్యాత్మికత్వం ఒకే ప్రాంగణంలో కొలువుదీరినా నిషేధానికి గురి కావటం లేదు… అయినా చిత్రకారులు మాత్రం అపడపడూ నిషేధాలకు, కన్నెర్రలకు గురి అవుతూనే ఉన్నారు.
కారణం రాజకీయమా? మతమా?? స్వార్థమా???
నగ్నత్వ దివ్యత్వాలు మానవజీవన సంయోగాలు. ఏ కళారూపమైనా ఈ రెంటినీ ముడిపెట్టనైనా ముడి పెడుతుంది. లేదా ఏ ఒక్కదానినో ఆశ్రయిస్తుంది. అప్పుడుకానీ ఆ కళాఖండానికి కావలసిన ప్రాచుర్యం లభించదు. అయితే ఆరాధ్య దేవతలకు ఆధునిక ధోరణులను ముడిపెట్టినప్పుడు – అదే అన్యమతస్థులు చిత్రకారులైతే కాంట్రవర్షియల్ అవుతుంది. అటువంటిదే ఈమధ్య వివాదాస్పదమైన అక్రం చిత్రం బార్‌లో బికినీభామలతో చిలిపికృష్ణుడు. ఈ కోవలోనివే అమెరికా చిత్రకారుల పిస్ క్రైస్ట్, వర్జిన్ మేరీ చిత్రాలు.
ఆ కథా కమామీషు –
భారతీయ చిత్రరచనకు పరిధులు ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవనే చెప్పుకోవాలి… ఉన్నదల్లా విలువలే. ఆ విలువలకు తిలోదకాలిస్తే ఏమవుతుంది అంటే ఆ వర్ణచిత్రాలు చూపరుల కన్నెర్రతో ఎరుపెక్కుతాయన్నది సమాధానం.
నిజమే, ఇమాజినేషన్ ప్లస్ ఇమిటేషన్ కలవనిదే కళాసృష్టి జరగదు. అంటే క్రియేటివ్ ఆర్ట్ అది శిల్పాకృతి అయినా చిత్ర లేఖనమైనా, రచనా చమత్కారమైనా, నృత్య భంగిమ అయినా, జీవితాన్ని పండించే నవరసరాలను పలికించాల్సిందే! అప్పుడే ఆ ఆర్ట్‌ఫార్మ్‌కి వందేళ్లు. ముఖ్యంగా సమకాలీన మానవ జీవితాన్ని అద్దం పట్టగలిగే ఆర్ట్‌కి ఎపడూ పెద్దపీటనే. చిత్రమేమిటంటే కాంట్రావర్సి కూడా ఈ వర్తమాన చిత్ర రీతులతోనే.
కారణం సమాజంలో, మానవ మనస్తత్వాలలో చోటుచేసుకుంటున్న మార్పులు ఒకేమారు అందరికీ వర్తిస్తాయని చెప్పలేం. కొందరికి మొదట్లోనే కొన్ని మార్పులు అంగీకారమవుతుంటాయి… ఇంకొందరికి ఏండ్లుపూండ్లు పట్టినా ఇంకా జీర్ణం చేసుకోలేని స్థితి నెలకొని ఉండవచ్చు. ఏదిఏమైనా వర్తమానం ఏ ఆర్ట్‌ఫార్మ్‌లోనైనా ప్రతిబింబించే తీరుతుంది. అయితే మతం కారణంగానో, రాజకీయం కారణంగానో లేదా ఇతర మానవ స్వార్థాల కారణంగానో అది సమకాలీన వ్యవస్థలో కొందరికి కన్నెర్ర కావచ్చు … నిషేధానికి గురి కావచ్చు … అంతమాత్రాన అందులోని ధోరణి వర్తమాన మానవ మనస్తత్వాల ప్రతిబింబం కాదనలేం.
భారతీయ మతాన్ని, భారతీయ తత్వాన్ని కాదని భారతీయ చిత్రాలకు ప్రత్యేక అస్తిత్వం లేదనే చెప్పుకోవాలి. అసలు భారతీయుల మనస్తత్వాన్ని భారతీయుల ఆధ్యాత్మికత్వాన్ని అర్ధం చేసుకోనిదే భారతీయ చిత్రకళను అర్థం చేసుకోవటమూ కష్టమే. భారతదేశ గుడుల గోపురాలలో కానీ, అజంతా వంటి కొండగుహల చిత్రలేఖనాలలో కానీ శాంత జీవనానికి పట్టుకొమ్మగా భాసిల్లే భారతీయ వ్యక్తి వ్యవస్థలో శృంగారానికి ఎంత ప్రాముఖ్యం ఉందో ఆ గుడులు గోపురాలలో పొదివిన బొమ్మలు, ఆ కొండ గుహలలో దాగున్న చిత్రలేఖనాలు అంతే స్పష్టంగా శృంగారాంశను చూపుతున్నాయి.
భక్తి అధిభౌతికంగా ఎంతటి ఆనందాన్ని కలగచేస్తుందో శృంగారమూ భౌతికంగా అంతటి ఆనందాన్ని కలగచేస్తుంటుంది. అంతెందుకు జీవన వ్యవస్థలో సెక్స్ అండ్ స్పిరిట్యుయాలిటీలు సమప్రాధాన్యాన్ని కలిగే ఉంటున్నాయి. అందుకే ఖజురహో శృంగార భంగిమల్ని, కోణార్క్ దేవాలయ శిల్పాలను, ఇళ్లలో నిత్యహారతులందుకుంటున్న, దేవతల చిత్రపటాలను సమదృష్టితోనే అంటే సమప్రాధాన్యంతోనే చూడటం చూస్తున్నాం.
ఈ నేపథ్యంలో తాజాగా అక్రం చిత్రం పలువురి ఆగ్రహానికి కారణమైంది. చిత్ర ప్రదర్శనతో కొన్ని వేల మందిని ఆకర్షించాల్సింది పోయి గోడమాటుకు చేరుకోవలసి వచ్చింది. అన్యమతస్థుడు కృష్ణుడ్ని బికినీ భామలతో చిత్రించటమే ఇలా తెరమరుగవటానికి ప్రధాన కారణమా? లేక కృష్ణుడు బార్‌లో బికినీ భామలతో ఉండడమే కారణమా?
అర్ధనగ్నత వల్ల ఈ చిత్రం ప్రదర్శన నుండి తప్పుకోలేదు. కారణం కృష్ణుడు అర్థనగ్నంగానూ, నగ్నంగా ఉన్న గోపికా చిత్రాలను ఎన్నింటిని మనం చూడలేదూ!? దేవాలయాలపైన కృష్ణుడ్ని నగ్నగోపికా శిల్పాల్ని ఎన్నిచోట్ల చూడటం లేదూ!?
కొన్నివేల మంది కన్నెర్రకు కారణం అయినప్పటికీ విూడియా పుణ్యమా అని అవే చిత్రాలు కొన్ని కోట్ల మందికి దర్శనీయాలయ్యాయి. అతి తక్కువ వ్యవధిలో పలు దేశాల ప్రజల్ని ఆకర్షించాయి. ఆశించని ప్రచారం వీటికి లభించింది. కొన్ని కోట్ల మందికి ఇష్టమైంది … ఇంకొన్ని కోట్ల మందికి కష్టమైంది … మరికొన్ని కోట్ల మందికి కన్నెర్రైంది. ప్రస్తుతానికి అసలు గీసిన చిత్రం కనుమరుగైనా దాని ప్రతిబింబం కోటానుకోట్ల మనసులతో ముద్రించుకుపోయింది.
కళ వ్యక్తీకరణ ఒక పుష్పంలా ఉండాలంటాడు వివేకానందుడు. అంటే ఆ పుష్పం ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఎంతలా పరిసరాలను సమ్మోహన పరస్తున్నప్పటికీ, పైకి ఎంతలా ఎదిగినా దాని జవసత్వాలు నేలతల్లివే. అంటే ఎంతటి గొప్ప చిత్రమైనా నేలవిడిచి సాము చేయకూడదనేగా? ఇలా చూస్తే అక్రం చిత్రమో, హుసేన్ చిత్రమో, మరో అరవింద్ చిత్రమో సమకాలాన్ని చిత్రించకుండా నేలవిడిచి సాము చేసినట్లా?
దేవాలయ బూతుబొమ్మల గురంచి తాపీ ధర్మారావు వంటి సాహిత్యకారులు పుస్తకాలు రాసారంటే వాటిల్లో వాస్తవాలున్నట్లే కదా?! ఓషో వంటి తాత్వికులు సంభోగం నుండి అంటూ పుస్తకాలు రాసారంటే అవి సెక్స్ పుస్తకాలన్నట్లు ఉలిక్కి పడటం ఎందుకు? ఇటువంటి పుస్తకాలు, కళా చిత్రాలు మార్కెట్లో బాగానే అమ్ముడుపోతున్నాయి. అంటే ఆదరణ ఉందనేగా!
అటు స్పిరిట్యుయాలిటీ అయినా ఇటు సెక్స్ అయినా మన జీవన విధానంలో సమంగానే కలిసిపోయాయి. అందుకే శిల్పాలలో, చిత్రాలలో, రచనలలో, నృత్యాలలో దేవతలను శృంగార రసాధిదేవతలుగా చూపటం జరుగుతోంది. వచ్చిన చిక్కల్లా అన్యమతస్థులు ఇలా చిత్రిస్తేనే?!
మానవ స్వభావం ప్రకృతి జనితం. ఏ మతం వారికైనా, ఏ కులం వారికైనా, ఏ వర్గం వారికైనా వర్తమానం ఒక్కటే … కాస్త ముందు వెనకలుగా అవి అందలం ఎక్కువతాయి అంతే. ఆధ్యాత్మికమూ, శృంగారమూ ఇలా విడదీయరాని మూలప్రవృత్తులే. ఆధ్యాత్మికత్వం ప్రాచీన ధోరణులనే కాక ఆధునిక ధోరణులనూ అంది పుచ్చుకున్నట్లే కళారూపాలు కూడా ప్రాచీన తత్వాల నుండి అర్వాచీన తత్వాలను సైతం తమ వ్యక్తీకరణలో ప్రతిబింబిస్తున్నాయి. అయితే ఈ స్వేచ్ఛ హరించుకుపోతోంది మత తాకిడితోనే … రాజకీయ తాకిడితోనే… మనసులు గాయపడితేనే. కాబట్టి ఘర్షణకు ఈ సంఘర్షణే మూలం.
సెంటిమెంట్ అనేది మనుషులేక కాదు సంస్కృతిలోను ఒక విడదీయరాని బంధమవుతోంది. సెంటిమెంట్‌తో గాయపడ్డప్పుడు కన్నీరయినా, కన్నెర్రయినా తప్పటం లేదు. సెంటిమెంట్ దెబ్బతోనే అస్సాంకి చెందిన అక్రం చిత్రించిన కృష్ణ చిత్రం కాంట్రవర్షియల్ పెయింటింగ్ అయింది. రవీంద్రభవన్ గౌహతి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శితమవుతున్న అక్రం వేసిన – బార్‌లో ఏడుగురు బికినీ గోపికల కృష్ణ చిత్రం వివాదస్పదమైంది. ఇతగాడి మద్యం సీసాలతో ఉన్న మువ్వన్నెల జాతీయ పతాక చిత్రమూ భారతీయుల్ని అగౌరవ పరచినట్లే అయింది. చివరికి అక్రంని అరెస్ట్ చేసి తీరవలసిందే అనే పట్టుదలకు దారి తీసింది… ఎఫ్‌ఐఆర్ ఫైలింగ్ దాకా వెళ్లింది… ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్‌ను మిస్‌యూజ్ చేసాడంటూ.
ఇలా నగ్నంగా హిందూ దేవతలను చిత్రించినందుకే ఒకప్పుడు ఎండి హుస్సేన్ భారతదేశం నుండి నిష్ర్కమించి దోహాలో తలదాచుకోవలసి వచ్చింది. 2013లో బెంగుళూరులో చిత్రకళా పరిషత్ ఆర్ట్ గాలరీలో మూడు నగ్నదేవతా చిత్రాలను ప్రదర్శిస్తున్న వర్ధమాన చిత్రకారుడు అరవింద్ సాయినాథ్ కృష్ణమణి కూడా ప్రజాగ్రహానికి గురైనవాడే. హిందూ దేవతల్ని నగ్నంగాను, క్రైస్తవ జీసస్‌ను అసభ్యంగాను చిత్రించి నందుకు బరోడాకు చెందిన చంద్రమోహన్, వెంకట్ అనే ఇద్దరు విద్యార్థులు సైతం విశ్వహిందూ పరిషత్ కన్నెర్రకు కారణమయ్యారు. జోస్ పెరైరా వేసిన భిక్షాటనలో ఉన్న శివుడి నగ్న రూపానికి రుషుల భార్యలు మోహితులైనట్లున్న చిత్రం కూడా ఆగ్రహానికి గురైంది.
మతపరంగా విశ్వాసం శక్తివంత మవుతుంటే తప్ప లాజిక్ ఏమాత్రం పనిచేయదు. అందుకే ‘రిలీజియస్ పెయిన్’ అనేది ఎంతగొప్ప ఆర్టిస్ట్‌నైనా క్షమించదు. దీనికి హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అన్న భేదభావం ఉండదు. అంటే ఒక మతం వారు ఒకలా మరొక మతం వారు మరోలా స్పందిస్తారని లేదు. అందరి కన్నెర్ర ఒక్కటే. తమ ఆరాధ్య దేవతలను ఎవరు తక్కువగా చిత్రించినా ఎక్కువగానే ఆగ్రహావేశులై చాలెంజ్ చేస్తూ ముందుంటారు. ఇటువంటప్పుడు మానవ ప్రవృత్తి వెనకడుగు వేస్తుంటే విశ్వసహోదరత్వం దాని పక్కనే అడుగులు వేస్తుండగా పోరాటతత్వం మాత్రం ముందుకు ఉరుకుతుంటుంది.
ఒక్క మన హిందూ మతానికి సంబంధించే అని కాదు క్రైస్తవ మతానికి సంబంధించీ అమెరికా చిత్రకారుడు ఆండ్రెస్ సెర్రానొ ‘పిస్ క్రైస్ట్’ వొఫిలి ‘వర్జిన్ మేరీ’ చిత్రాలూ ప్రజల ఆగ్రహం నుండి ఏమాత్రం తప్పించుకోలేకపోయాయి.
అసలు మనుషులనైనా దేవతలనైనా నగ్నంగా చిత్రించే చిత్రకారుల మనస్తత్వం ఏమై ఉంటుందా అంటే “Nudes are used as Gimmicks to get Attention” అన్నది నిషేధానికి అందని సమాధానం… ఆ తర్వాతి స్థానమే మతానికైనా, రాజకీయానికైనా.
డా. వాసిలి వసంతకుమార్
సెల్ : 9393933946